జపాన్: 22 రోజుల ముందే ముగిసిన వర్షాకాలం, ఆల్‌టైమ్ గరిష్ట ఉష్ణోగ్రతలతో హడలిపోతున్న ప్రజలు

జపాన్‌లో 1875లో ఉష్ణోగ్రతల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటినుంచి చూస్తే, జపాన్‌లో అత్యంత దారుణమైన ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఈ ఏడాది జూన్ నెల రికార్డు సృష్టించింది.

ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అధిక వేడితో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరే కేసులు పెరుగుతున్నందున వడదెబ్బను నివారించడానికి ఏసీలను ఉపయోగించమని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది.

రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మానవ ప్రేరిత వాతావరణ మార్పుల కారణంగా హీట్‌వేవ్‌లు తరచుగా సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత, వ్యవధి కూడా ఎక్కువగా ఉంటోంది.

పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలో ఉష్ణోగ్రతలు దాదాపు 1.1 సెంటిగ్రేడ్ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఉద్గారాలకు కోత విధించకపోతే ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి.

టోక్యోలో వరుసగా అయిదో రోజు బుధవారం 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1875లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జూన్ నెల ఇదే.

టోక్యోకు వాయువ్యంగా ఉన్న ఇసెసాకి నగరంలో రికార్డు స్థాయిలో 40.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జపాన్‌లో జూన్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేశారు.

"నేను ఉదయం నుంచి బయటే ఉన్నాను. ఈ తీవ్రమైన వేడితో దాదాపు కరిగిపోతున్నా'' అని ఒకరు ట్వీట్ చేశారు.

'' వేడి కారణంగా మా ఆఫీస్‌లోని ఫైర్ అలారం షార్ట్ సర్క్యూట్‌కు గురైంది'' అని మరొకరు రాశారు.

జపాన్‌లో సాధారణంగా జూన్ నెలను వర్షాకాలంగా పరిగణిస్తారు. కానీ, టోక్యోతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షా కాలం సీజన్ ముగిసినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ (జేఎంఏ) ప్రకటించింది.

ఈ ప్రకటన ప్రకారం అక్కడ 22 రోజుల ముందే వర్షకాలం ముగిసిపోయింది. 1951 నుంచి తొందరగా ముగిసిపోయిన వర్షాకాలం ఇదే.

వేడిగాలుల కారణంగా హీట్‌స్ట్రోక్ కేసులు కూడా పెరిగాయి. బుధవారం కనీసం 76 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అత్యవసర సేవలు తెలిపాయి.

విద్యుత్ కొరత హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వినియోగాన్ని తగ్గించుకోవాలని మంగళవారం స్థానిక అధికారులు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)