You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Plastic pollution: భూమి ‘ప్లాస్టిక్ సంక్షోభం’లో చిక్కుకోకుండా కాపాడటం సాధ్యమేనా?
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడం కోసం ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
"ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభం"పై చర్యలు తీసుకోవడానికి దాదాపు 200 దేశాలు ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు చర్చలు ప్రారంభించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేస్తున్నాయి.
ఇప్పటికే వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని, వన్యప్రాణులకు ఎంతో హాని కలిస్తున్నాయని, ఆహార గొలుసును కూడా ఇవి కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.
తాజా ఒప్పందానికి మద్దతు తెలుపుతున్నవారు దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ చర్యలలో ఒకటైన 1989 ‘‘మాంట్రియల్ ప్రోటోకాల్''తో పోలుస్తున్నారు. ఓజోన్ పొర క్షీణించడానికి కారణమయ్యే పదార్థాలను దశల వారీగా తగ్గించడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ ఉపయోగపడింది.
వాతావరణ మార్పులకు సంబంధించి పారిస్ ఒప్పందం ఉన్నట్లే, ప్లాస్టిక్ నివారణకు కూడా కట్టుబడి ఉండే విధంగా ఒక ఒప్పందం ఉండాలి, ఇది ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుంటుంది.
పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్ ఫ్లెచర్.. ప్లాస్టిక్ వలన వచ్చే సమస్యలపై ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ)కి సలహాదారుగా పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో చుట్టుముట్టే సమస్యలు జాతీయ, అంతార్జాతీయ సరిహద్దులు దాటాయని ఆయన అన్నారు.
ఒక దేశం ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు తీసుకునే విధానాలు ఎంత మంచివి అయినప్పటికీ ''ఒంటరిగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోలేదు'' అని ఆయన అన్నారు.
''ప్లాస్టిక్ మన సమాజానికి విసిరే సవాళ్లను ఎదుర్కోవటానికి ఓ ప్రపంచ ఒప్పందం అవసరం ఉంటుంది’’అని ఆయన పేర్కోన్నారు.
దీని అర్థం ఏమిటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటిని వినియోగించే విధానాల గురించి, వాటిని పారవేయడానికి సంబంధించిన నియమ నిబంధనల కోసం ఒప్పందం రూపొందించడానికి అంతర్జాతీయంగా చర్చలు ప్రారంభించేందుకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ప్రస్తుతం అంగీకరించాయి. నైరోబీలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చిన రువాండా పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ జీన్ డి ఆర్క్ ముజావమారియా మాట్లాడుతూ.. ఈ చర్చలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ఒక విధమైన పునాదులుగా ఉపయోగపడతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు తీసుకుంటున్న ఈ చర్యలను వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్.. మాంట్రియల్ ప్రోటోకాల్‌తో పోల్చింది.
ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటి జీవిత కాలం, వాటి వినియోగానికి సంబంధించిన అంశాలతో పాటు వాటిని వాడి పడేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలు కూడా కీలకం అని సీనియర్ పాలసీ సలహదారుడు పౌలా చిన్ అన్నారు.
''ఈ కీలక ఒప్పందంలో కట్టుబడిన అంశాలకు సంబంధించిన హామీలు నెరవేర్చడానికి సభ్యులను సిద్ధం చేయాల్సి ఉంది'' అని కూడా ఆమె చెప్పారు.
ఈ ఒప్పందం తర్వాత ఏం జరుగుతుందంటే ?
ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన ఈ ఒప్పందంపై అంగీకారం కుదిరేందుకు ప్రపంచ నాయకులకు 2024 వరకు సమయం ఉంటుంది. ఈ ఒప్పందంలోనే ఎలాంటి అంశాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి? ఒప్పంద నిర్వహణకు ఎలా ఆర్థిక సహాయం చేస్తారో నిర్ణయిస్తారు.
హానికరమైన ఉత్పత్తులు, వినియోగ పద్ధతులను అతిక్రమించే వారిపై జరిమానాలు అమలు అయ్యేలా, ప్లాస్టిక్ నియమ నిబంధనలను ప్రతి దేశం ప్రోత్సహించేలా స్పష్టమైన, కఠినమైన ప్రమాణాలను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చెయ్యాలని పర్యావరణ సంస్థలు కోరుతున్నాయి.
ప్లాస్టిక్ సమస్యను ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం చేయాలని ఈ సమస్యకు మూలకారణమైన ఉత్తరార్ధ గోళంలోని దేశాలపై దక్షిణార్ధ గోళంలోని దేశాలు ఒత్తిడి చేయవచ్చు.
''ఈ ఒప్పంద నిర్వహణకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు? ప్రపంచంలోని దక్షిణార్ధ గోళంలోని దేశాలు ఎదుర్కొంటున్న కాలుష్య సంక్షోభాన్ని నివారించడానికి ఎలాంటి వనరులు అందుబాటులో ఉన్నాయి? లాంటి అంశాలపై చర్చ జరుగుతుంది '' అని ప్రొఫెసర్ ఫ్లెచర్ అన్నారు.
ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన బ్రిటన్ ప్రభుత్వం, ఈ ఒప్పందాన్ని ''చరిత్రాత్మకమైన నిర్ణయం'' అని పేర్కోంది.
''మనిషిగా మన జీవిత కాలంలో ప్రతి ఒక్కరు, పర్యావరణానికి ఊహించని విధంగా ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాం. ప్లాస్టిక్ కాలుష్యంతో మహాసముద్రాల్లోని ప్రతి భాగమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది’’ అని బ్రిటన్ ప్రభుత్వంలోని అంతర్జాతీయ పర్యావరణ శాఖ మంత్రి లార్డ్ జాక్ గోల్డ్ స్మిత్ అన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందాన్ని దీర్ఘకాలిక ఒప్పందంగా మార్చడానికి మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పారు .
మహా సముద్రాలలో దాదాపు ఐదు ట్రిలియన్లకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని అంచనా. ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎన్నో ఏళ్లు పట్టవచ్చు. ప్రతి సంవత్సరం 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. వాటిలో 40% ఒక్కసారి మాత్రమే వినియోగిస్తున్నారు.
అన్ని రకాల ప్లాస్టిక్‌లను రీసైకిల్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే అలా చెయ్యడం అనేది చాలా ఖరీదుతో, కష్టంతో కూడిన పని. భూమిపై నుంచి ఏటా ఎనిమిది మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాలలోకి ప్రవేశిస్తున్నాయి.
ఈ ప్లాస్టిక్ కారణంగా భూమి, సముద్రాల్లో ఉండే జీవజాతులకు హాని కలగవచ్చు, అవి పొరపాటున క్యారియర్ బ్యాగుల్లో, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో చిక్కుకోవచ్చు. ఆహారం కోసం అన్వేషిస్తూ పొరపాటున ప్లాస్టిక్ వ్యర్థాలను తినేసి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)