పంది గుండెను మానవునికి అమర్చడంలో వచ్చే నైతిక సమస్యలు ఏంటి... యూదు, ముస్లిం చట్టాలు ఇందుకు ఒప్పుకుంటాయా?

    • రచయిత, జాక్ హంటర్
    • హోదా, బీబీసీ న్యూస

ప్రపంచంలోనే జన్యు సవరణ చేసిన పంది గుండెను కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా అమెరికాకు చెందిన డేవిడ్ బెనెట్ నిలిచారు.

57 ఏళ్ల బెనెట్ తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని, ఆయనకు మానవుల గుండెను అమర్చలేమని డాక్టర్లు చెప్పారు. దీంతో 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసి పంది గుండెను అమర్చామని అన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

ఈ శస్త్రచికిత్సపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మెడికల్ ప్రయోగం తర్వాత, గుండె మార్పిడికి పట్టే సమయాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోగుల జీవితాలను ఈ శస్త్రచికిత్సతో మార్చవచ్చని అంటున్నారు.

ఈ మొత్తం ప్రక్రియను నైతికంగా సమర్థించవచ్చా? అనే ప్రశ్నించే వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరంతా రోగి భద్రత, జంతువుల హక్కులు, మతపరమైన ఆందోళనల గురించి మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో పందుల నుంచి చేసిన అవయవ మార్పిడి ఎంతవరకు వివాదాస్పదంగా మారింది?

వైద్యకోణం నుంచి...

ఇది రోగిని ప్రమాదంలో పడేసే ఒక ప్రయోగాత్మక శస్త్రచికిత్స. రోగికి సరిపోలే మానవుల అవయవాలనే, మార్పిడి తర్వాత రోగి శరీరం తిరస్కరించే అవకాశముంటుంది. అలాంటిది, జంతువుల అవయవాల మార్పిడి విషయానికొస్తే, ఇందులో మరింత ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది.

ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వైద్యులు, జంతువుల అవయవాలను ఉపయోగించేందుకు దశాబ్ధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారికి మిశ్రమ ఫలితాలు లభించాయి. జంతువుల అవయవాలను ఉపయోగించే అంశాన్ని 'క్జీనోట్రాన్స్‌ప్లాంటేషన్' అంటారు.

1984లో కాలిఫోర్నియాలో చింపాంజీ గుండెను మార్పిడి చేయడం ద్వారా ఒక బాలిక ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ 21 రోజుల తర్వాత ఆ బాలిక చనిపోయింది.

ఇలాంటి చికిత్సలు చాలా ప్రమాదకరం. అయితే రోగికి, ఈ చికిత్స వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన ఉండి, వారు ఒప్పుకుంటే ఈ చికిత్సను కొనసాగించవచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు.

''ఇలాంటి సందర్భాల్లో చికిత్స తర్వాత రోగి మరణిస్తాడో, లేదో మనకు తెలియదు. కానీ రిస్క్ తీసుకోకుండా మనం ముందుకు సాగలేం'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ప్రాక్టికల్ ఎథిక్స్ ప్రొఫెసర్ జులియాన్ సైవలెక్సు అన్నారు.

''మానవ అవయవాల మార్పిడి, యంత్రాల సహాయంతో అందించే మద్దతుతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను రోగుల చెంతకు తీసుకురావడం ముఖ్యం'' అని జులియాన్ అన్నారు. డేవిడ్ బెనెట్‌కు చికిత్స చేసిన వైద్యుల ప్రకారం... జీవించి ఉండటానికి బెనెట్‌కు ఉన్న ఏకైక అవకాశం జంతువుల అవయవ మార్పిడి. ఆయనకు ఇది తప్ప మరో అవకాశం లేదు. మానవుల గుండెను ఆయన శరీరం స్వీకరించదు. జన్యుసవరణ చేసిన పంది గుండెను అమర్చి ఉండకపోతే ఆయన మరణించి ఉండేవారు.

''ఒక ప్రక్రియ సురక్షితం అని నిర్ధారించుకోవడానికి, ఏదైనా శస్త్రచికిత్స చేయడానికి ముందు తప్పనిసరిగా అత్యంత కఠినమైన కణజాల పరీక్ష, జంతువులపై పరీక్షలను నిర్వహించాలి'' అని ప్రొఫెసర్ జులియాన్ అన్నారు.

డేవిడ్ బెనెట్‌ గుండె మార్పిడి, క్లినికల్ ట్రయల్స్‌లో భాగం కాదు. ఆయనకు ఇచ్చిన మందులను కూడా జంతువులపై పరీక్షించలేదు.

డేవిడ్ బెనెట్ చికిత్సకు సంబంధించి పూర్తి సన్నద్ధత కోసం ఏమీ చేయలేదని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ క్రిస్టిన్ లావ్ చెప్పారు.

క్రిస్టిన్ కూడా బెనెట్ చికిత్సలో పాల్గొన్నారు. ''మేం దశాబ్దాలుగా ల్యాబ్‌లో దీన్ని చేస్తున్నాం. జంతువుల అవయవాలను మానవులను అమర్చడం సురక్షితమే అని భావించే స్థాయికి చేరుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం'' అని ఆమె బీబీసీతో అన్నారు.

జంతువుల హక్కుల కార్యకర్తల నిరసన

మానవుల అవయవ మార్పిడి కోసం పందులను ఉపయోగించడాన్ని పలు జంతు హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా డేవిడ్ ఉదంతంతో ఈ చర్చ మరింత జోరందుకుంది.

డేవిడ్‌కు పంది గుండెను అమర్చడాన్ని 'పెటా' సంస్థ ఖండించింది. 'అనైతికం, ప్రమాదకరం, వనరులను వృథా చేయడం'' అని వ్యాఖ్యానించింది.

మానవులకు సరిపోలేలా చేయడం కోసం జంతువుల జన్యువులను సవరించడం తప్పని కార్యకర్తలు అంటున్నారు. బెనెట్‌ శరీరం స్వీకరించేందుకు వీలుగా, పందికి చెందిన 10 జన్యువులను శాస్త్రవేత్తలు సవరించారు. ఆపరేషన్ రోజున పంది గుండెను బయటకు తీశారు.

''ఎట్టి పరిస్థితుల్లోనూ తాము క్జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ను, జంతువుల జన్యు సవరణను వ్యతిరేకిస్తామని'' బీబీసీతో యూకే జంతు హక్కుల సంఘం 'యానిమల్ ఎయిడ్' అధికార ప్రతినిధి అన్నారు.

జన్యు సవరణ వల్ల పందుల్లో కలిగే దీర్ఘకాలిక ప్రభావాల గురించి కూడా కొందరు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

''జన్యు సవరణ వల్ల వాటికి అనవసరమైన నష్టం కలగకుండా మనం చూసుకోగలిగినప్పుడు మాత్రమే, అవయవాల కోసం, జన్యు మార్పిడి చేసిన పందులను ఉపయోగించుకోవాలి'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బయో ఎథిక్స్ ఫెలో, డాక్టర్ క్యాట్రియెన్ డెవాల్డర్ అన్నారు.

'' ప్రాణాలను రక్షించడం కోసం కంటే కూడా, మాంసం కోసం పందులను వినియోగించడం అనేది చాలా విచారించదగిన అంశం. అయితే, జంతువుల సంక్షేమాన్ని విస్మరించకూడదు'' అని డెవాల్డర్ వ్యాఖ్యానించారు.

మతపర కోణం..

జంతువుల అవయవ మార్పిడిని మతపర విశ్వాసాల కోణంలో చూసేవారు కూడా ఉన్నారు. వారి నమ్మకాల ప్రకారం, జంతువుల అవయవాలను మార్పిడి చేయడం సరైనది కాదు.

వాస్తవానికి పందుల అవయవాలు, మానవుల అవయవాల పరిమాణంలో ఉన్న కారణంగానే చికిత్స కోసం వీటిని ఎంపిక చేస్తారు. అలాగే, పందులను పెంచడం కూడా చాలా సులభమైన పని.

పందుల విషయంలో కఠిన నిబంధనలను కలిగి ఉండే ముస్లిం, యూదు మతాల వారిపై... చికిత్స కోసం ఈ జీవి ఎంపిక ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

పందులను పెంచడాన్ని, ఆహారంగా తీసుకోవడాన్ని యూదుల చట్టం నిషేదిస్తుంది. అయితే పంది గుండెను మార్పిడి చేసుకోవడం యూదుల చట్టం ఉల్లంఘన కిందకు రాదని యూకే ఆరోగ్య శాఖ మోరల్ ఎథికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎంఈఏజీ)‌కు చెందిన సీనియర్ డాక్టర్ మోషే ప్రైడ్‌మన్ అన్నారు.

''మానవుల ప్రాణాన్ని కాపాడటమే యూదుల చట్టంలోని తొలి ప్రాధాన్యత. ఒక యూదు వ్యక్తి ప్రాణాన్ని రక్షించడానికి, జంతువుల అవయవాన్ని మార్పిడి చేయడం తప్పనిసరి అయితే... అది తప్పేమీ కాదు'' అని ఫ్రైడ్‌మన్ అన్నారు.

ఇస్లాం మతం కూడా ఇదే చెబుతోంది. జీవితాలను కాపాడే విషయానికొస్తే, జంతువుల అవయవాలను మార్పిడి చేయడాన్ని ఇస్లాం అనుమతిస్తుంది.

'దార్ అల్-ఇఫ్తా' అనేది ఈజిప్టులో మతపరమైన ఆదేశాలు జారీ చేసే ప్రభుత్వ సంస్థ. ''రోగి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు, మానవుల శరీర అవయవాలు దెబ్బతిన్నప్పుడు, వ్యాధి తీవ్రమయ్యే పరిస్థితి ఉంటే లేదా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు పందుల హృదయాలకు సంబంధించిన కవాటాలను ఉపయోగించుకోవచ్చని ఆ సంస్థ ఒక ఫత్వాలో పేర్కొంది.

''ఎవరైనా రోగి మతపరమైన లేదా నైతిక విశ్వాసాల కారణంగా జంతువుల అవయవాలను తీసుకునేందుకు విముఖంగా ఉంటే, వారికి మానవ దాతల జాబితాలో తక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదని'' ప్రొఫెసర్ జులియాన్ అన్నారు.

''జంతువుల రూపంలో అవయవ మార్పిడికి అవకాశం ఉంది కాబట్టి మానవదాతల నుంచి అవయవం పొందే జాబితాలో మీరు ఆఖరున ఉండాలి అని కొందరు అనవచ్చు. మరికొందరేమో, మిగతావారి తరహాలోనే మీకు కూడా మానవదాతల అవయవాలపై అంతే హక్కు ఉంటుంది అని అంటారు. కాబట్టి పరిస్థితిని బట్టి మనమే తగిన నిర్ణయాలు తీసుకోవాలి'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)