You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పునీత్ రాజ్‌కుమార్ మరణం: జిమ్‌లో ఈ తప్పులు చేయకండి
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కన్నడ సినీ నటుడు, యూత్ ఐకాన్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కి వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చర్చ జరుగుతోంది.
ఫిట్‌నెస్ విషయంలో ఎంతో మందికి పునీత్ ప్రేరణగా నిలిచేవారు. ఫిట్‌గా కనిపించే వ్యక్తి 46 ఏళ్ల వయసులోనే ఇలా హఠాత్తుగా చనిపోతే ఎలా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 2న నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణించినప్పుడు కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. టీవీ ఆర్టిస్ట్, హోస్ట్ అయిన 40 ఏళ్ల సిద్ధార్థ్ పూర్తిగా ఫిట్‌గా కనిపించేవారు.
పునీత్ జిమ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావడంతో మొదట తన ఫ్యామిలీ డాక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమణా రావును సంప్రదించారు.
"నేను పునీత్ పల్స్, రక్తపోటును చెక్ చేశాను. రెండూ సాధారణంగానే ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా చెమటలు పడుతున్నాయి అని ఆయన్ని అడిగాను. జిమ్ చేయడంతో సాధారణంగానే చెమటలు పట్టాయని చెప్పాడు. అనుమానంతో నేను ఆయన ఈసీజీ చెక్ చేశాను. తక్షణమే ఆసుపత్రికి వెళ్లమని సూచించాను. ఆసుపత్రి వారిని కూడా అప్రమత్తం చేశాను" అని డాక్టర్ రావు మీడియాతో చెప్పారు.
‘పునీత్ మార్గమధ్యంలో కార్డియాక్అరెస్ట్‌కు గురయ్యారు. ఆయన్ని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని విక్రమ్ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ తెలిపారు.
12 సంవత్సరాల క్రితం ఐటీ కంపెనీ సాప్ ఇండియా సీఈఓ రంజన్ దాస్ కూడా జిమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత గుండెపోటుతో మరణించారు. ఫిట్‌గా ఉండే 42 ఏళ్ల దాస్ మరణించిన తర్వాత కూడా 40లలోనే గుండెపోటు రావడం ఏంటని అనేక ప్రశ్నలు తలెత్తాయి.
"బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేసినప్పుడు, కండరాలు ఒత్తిడికి గురవుతాయి. వెయిట్ లిఫ్టింగ్ కారణంగా రక్తనాళాలపై ఒత్తిడి ఉంటుంది. అపరిమిత వ్యాయామాలు గుండె కవాటాలకు మంచిది కాదు" అని శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్‌జేఐసీఎస్‌ఆర్) డైరెక్టర్ డాక్టర్ సీఎన్ మంజునాథ్ బీబీసీతో అన్నారు.
గుండెపోటు లక్షణాలు
- ఛాతీ నొప్పి - గుండె మధ్యలో బిగుతుగా అనిపించడం
- శరీరంలోని ఇతర భాగాలలో నొప్పి (ఛాతీ నుండి చేతులు, దవడ, మెడ, వీపు, ఉదరం వరకు నొప్పి)
- అలజడిగా లేదా మైకంలో ఉన్నట్టు అనిపించడం
- చెమటలు పట్టడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- వికారం, వాంతులు అవుతున్నట్లు అనిపించడం
- అసౌకర్యంగా ఉండటం
ఈ లక్షణాలు కనిపిస్తే..
- వెంటనే గట్టిగా శ్వాసతీసుకోవడంతోపాటూ గట్టిగా దగ్గాలి
అయితే గుండెపోటు తరచుగా తీవ్రమైన ఛాతీ నొప్పికి కారణమవుతున్నప్పటికీ, కొంతమందిలో తేలికపాటి నొప్పి మాత్రమే వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా రావడం లేదు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో ఇలా అవుతుంది.
25-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తుంది?
ఎస్‌జేఐసీఎస్‌ఆర్‌లో 2000 మంది వ్యక్తులపై 2017లో నిర్వహించిన ఒక పరిశోధనలో 25నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని తేలింది. గత ఐదేళ్లతో పోల్చితే ఇలాంటి కేసులు 22% పెరిగాయి.
ఈ పరిశోధనలో పాల్గొన్న 1500 మంది పేషెంట్‌లు కర్ణాటకకు చెందినవారు కాగా, 500 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు.
సాధారణంగా గుండె జబ్బుకు ముఖ్యకారణాలైన.. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు కలిగిన వాళ్లు, ధూమపానం, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర సమస్యలు లేని వ్యక్తులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు అని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.
అయితే పునీత్ అన్నయ్యలు నటుడు శివరాజ్‌కుమార్, నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లకు ఇంతకు ముందే గుండెపోటు వచ్చింది.
"జిమ్‌లో ఇద్దరికీ గుండెపోటు వచ్చింది. కుటుంబానికి అలాంటి గుండె సమస్యల చరిత్ర ఉంది" అని మాజీ ముఖ్యమంత్రి, రాజ్‌కుమార్ కుటుంబానికి సన్నిహితులు హెచ్‌డి కుమారస్వామి బీబీసీతో అన్నారు.
యువతలో కండలు పెంచుకోవాలనే క్రేజ్
నేటి కాలంలో జిమ్‌కి వెళ్లి కండలు పెంచుకోవాలనే క్రేజ్ యువతలో ఉందని కుమారస్వామి చెప్పారు. "సరైన సలహాలు ఇచ్చే అర్హత లేని జిమ్ ట్రైనర్‌ల సూచనల మేరకు యువత సరైన శారీరక పరీక్షలు చేయించుకోకుండానే జిమ్‌లకు వెళ్లడం, ప్రొటీన్ పౌడర్ లేదా ప్రొటీన్ షేక్స్ తీసుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది" అని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
''చాలా జిమ్‌లు యువతకు స్టెరాయిడ్‌లను సిఫార్సు చేస్తుంటాయి. స్టెరాయిడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. భారతదేశంలో ఇలాంటి జిమ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ ఇది ఆందోళన కలిగించే అంశం'' అని అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ అలెగ్జాండర్ థామస్ అన్నారు.
''జిమ్‌కు వెళ్లే వారు ప్రొటీన్లు తీసుకోవాలని అనుకుంటుంటారు. అలా చేయడం సరైంది కాదు. డైట్‌లో ప్రొటీన్ లోపం ఉంటే తప్ప, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రీడలతో అనుబంధం ఉన్న వారు కూడా స్పోర్ట్స్ ఫిజీషియన్స్ లేదా క్వాలిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌ల సలహా మేరకు మాత్రమే ప్రొటీన్లు తీసుకుంటారు'' అని ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషన్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి తెలిపారు.
వ్యాయామం ఎంతసేపు చేయాలి?
హై ఇంటెన్సిటీ వ్యాయామాలు (హై-స్ట్రెస్ వ్యాయామాలు) చేసే ముందు గుండె ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలని డాక్టర్ మంజునాథ్ చెప్పారు.
"హై-ఇంటెన్సిటీ వర్కవుట్‌లను వెంటనే ప్రారంభించకూడదు. ముందుగా కొంత సమయం వార్మప్ చేయాలి. హై-ఇంటెన్సిటీ వర్కవుట్‌లను ప్రారంభించినా, వాటిని ప్రతిరోజూ చేయకూడదు. ఇవి గుండె సమస్యలకు నాందికి కారణం కావచ్చు" అని ఆయన అన్నారు.
వ్యాయామశాలలో శిక్షణ ప్రారంభించే ముందు ఒక నిర్ధిష్ట దినచర్యను అనుసరించాలని ఫిజియోథెరపిస్టులు చెబుతుంటారు. "సాధారణ జీవనశైలి ఉన్నవారు, ఎక్కువగా కూర్చుని పని చేసేవారు త్వరగా అలసిపోతారో లేదో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడానికి సరిపోతాడా లేదా అని తెలుసుకోవడమే ఈ పరీక్షల లక్ష్యం'' అని మంగుళూరులోని పీఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ సజీష్ రఘునాథన్ అన్నారు.
"ప్రాథమికంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే హై-ఇంటెన్సిటీ వర్కవుట్‌లను ప్రారంభించాలి. మరీ ఎక్కువసేపు వ్యాయామం చేయకుండా చూసుకోవాలి. బయట నుండి అందంగా కనిపించడం అంటే, గుండె ఆరోగ్యంగా ఉందని కాదు" అని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామం చేసే వారిని గమనించడానికి జిమ్‌లో డాక్టర్ కూడా ఉండాలనే కుమారస్వామి వ్యాఖ్యలతో డాక్టర్ మంజునాథ్ ఏకీభవించారు.
"వాస్తవానికి, గుండెను పునరుద్ధరించడానికి డీఫిబ్రిలేటర్ షాక్‌ను అందించగల అత్యవసర పరికరాలను ఉపయోగించేలా జిమ్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలని నేను సూచిస్తున్నాను" అని డాక్టర్ మంజునాథ్ అన్నారు.
"పది నిమిషాల ముందే పునీత్ ఆసుపత్రికి చేరుకుని ఉంటే, ఆయన్ని రక్షించే అవకాశం ఉండేది. మేము క్యూ లైన్‌లలో వేచి ఉన్న పేషెంట్‌లను కూడా చూశాము. సరైన సమయంలో చికిత్స అందించడంతో వారు 20 నుంచి 30 సంవత్సరాలు జీవించారు".
ఇవి కూడా చదవండి:
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్ జైలు అత్యంత ప్రమాదకరమని ఎందుకంటారు?
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
- అప్గానిస్తాన్: తాలిబాన్లు ఐఎస్‌కు వ్యతిరేకంగా రహస్య యుద్ధం చేస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)