కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు

కోవిడ్-19 మూలాలను కనిపెట్టడం ఎప్పటికీ తమకు సాధ్యంకాకపోవచ్చని అమెరికా నిఘా సంస్థలు ఒక నివేదికలో వెల్లడించాయి. అయితే, దీన్ని ‘‘బయోలాజికల్ వెపన్’’గా సృష్టించారనే వాదనను తోసిపుచ్చాయి.

ఈ వైరస్ వ్యాప్తి ఎలా మొదలైంది? అనే అంశంపై అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్‌ఐ) దర్యాప్తు చేపట్టింది. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించడం, లేదా ల్యాబ్ నుంచి లీక్ కావడంతో ఈ వైరస్ వ్యాప్తి మొదలై ఉండొచ్చని ఓడీఎన్‌ఐ అభిప్రాయపడింది.

అయితే, కచ్చితంగా ఇలానే వైరస్ వ్యాప్తి మొదలైందని చెప్పడానికి తమ దగ్గర తగిన సమాచారం లేదని ఓడీఎన్‌ఐ తెలిపింది. ఈ నివేదికలోని అంశాలను చైనా విమర్శించింది.

‘‘వైరస్ మూలాల విషయంలో నిఘా వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. జంతువుల నుంచి ఈ వైరస్ సంక్రమించి ఉండొచ్చని నాలుగు సంస్థలు అభిప్రాయం వ్యక్తంచేశాయి’’అని నివేదికలో పేర్కొన్నారు.

‘‘మరొక నిఘా సంస్థ మాత్రం ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అవ్వడంతో తొలి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చని పేర్కొంది. బహుశా చైనాలోని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జంతువులపై ప్రయోగాల వల్ల ఈ వైరస్ లీకై ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేసింది.’’

‘‘2019 చివర్లో వూహాన్‌లో కేసులు విపరీతంగా వచ్చిపడే వరకు చైనా అధికారులకు కూడా దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. అయితే, వైరస్ మూలాలపై విచారణకు చైనా ఆటంకాలు సృష్టిస్తూ వస్తోంది. సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరిస్తోంది.’’

తొలి ఇన్ఫెక్షన్లతో వూహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌కు సంబంధం ఉండొచ్చని ఇదివరకు చైనా అధికారులు అనుమానం వ్యక్తంచేశారు. దీంతో జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ ఏడాది మొదట్లో వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకై ఉండొచ్చని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రమాదవశాత్తు ల్యాబ్ నుంచి వైరస్ లీకై ఉండొచ్చని వీటిలో పేర్కొన్నారు.

వైరస్ మూలాలపై విచారణ చేపట్టాలని నిఘా విభాగం అధికారులను గత మే నెలలో బైడెన్ సూచించారు. చైనా తిరస్కరిస్తూ వచ్చిన ల్యాబ్ లీక్ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

తాజా నివేదికపై వాషింగ్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయం స్పందించింది. ‘‘వైరస్ మూలాల విషయంలో శాస్త్రవేత్తలపై కాకుండా నిఘా సంస్థలపై ఆధారపడుతూ అమెరికా తీసుకుంటున్న చర్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి’’అని చైనా అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

‘‘వైరస్ మూలాల విషయంలో శాస్త్రీయ పరిశోధనలకు మేం మొదట్నుంచీ మద్దతు తెలుపుతూనే ఉన్నాం. ఆ దిశగా మా మద్దతు కొనసాగుతుంది. ఈ విషయంతో రాజకీయాలు చేయడాన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.’’

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల మందికిపైగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 49 లక్షల మందికిపైగా ఈ ఇన్ఫెక్షన్‌తో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)