You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
COP26: గ్లాస్గోలో జరిగే పర్యావరణ సదస్సులో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
కరువు, అకాల వర్షాలు, వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత ఏడాది కాలంలో భారతదేశం సుమారు రూ.6500 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
రూ.17,827 కోట్లతో ఈ విషయంలో చైనా భారత్‌కన్నా ముందుంది. ఈ డేటాను ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసింది. ఈ నష్టాలకు కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు అంటున్నారు.
భారతదేశంతో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్లాస్గో నగరంలో సమావేశం అవుతున్నాయి. పర్యావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ చర్చిస్తారు.
మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా భారత్‌లోని దిల్లీ, ఉత్తరాఖండ్ నుండి కేరళ, గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్, అస్సాం వరకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధాని మోదీ అక్కడ ఎలాంటి ప్రకటనలు చేస్తారన్నది కీలకంగా మారింది.
ఐక్య రాజ్య సమితి తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుతం వివిధ దేశాలు నిర్దేశించిన లక్ష్యాల కారణంగా, ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని ఉష్ణోగ్రత 2.7°C పెరుగుతుంది.
అందుకే వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
ఈసారి 2 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని గ్లాస్గోలో చర్చ జరగనుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఈ పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ లోపే ఉండేలా చూడాలని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నెట్ జీరో అంటే ఏంటి?
గ్లాస్గో సమావేశం సందర్భంగా అన్ని దేశాలు తమ నెట్ జీరో గడువులను ప్రకటించాల్సి ఉంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల మధ్య సమతుల్యత అంటే ఉత్పత్తి అవుతున్న ఉద్గారాలు, నిర్మూలిస్తున్న ఉద్గారాలను సమానం చేయడమే నెట్ జీరో అంటారు.
ఒక దేశం మొత్తం కర్బన ఉద్గారాలు నెట్ జీరో చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక సంవత్సరాన్ని గడువుగా పేర్కొనాల్సి ఉంది.
ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా 2060 నాటికి తాము కార్బన్ న్యూట్రల్‌గా మారతామని ఇప్పటికే ప్రకటించింది. 2030 కి ముందే తమ ఉద్గారాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చైనా చెప్పింది.
రెండో అతిపెద్ద కార్బన్ ఉద్గారిణి అమెరికా 2050 నాటికి నెట్ జీరోకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2035 నాటికి తమ విద్యుత్ రంగాన్ని డీకార్బనైజ్ చేస్తామని అమెరికా చెబుతోంది. అయితే దీనికి సంబంధించి భారత్ ఇంకా గడువు ఇవ్వలేదు.
బొగ్గు మీద ఆధారపడటం తగ్గించాలి
బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని ఎలా తగ్గించాలన్నదానిపై గ్లాస్గో సదస్సులో చర్చ జరగనుంది.
బొగ్గు వాడకం వల్ల ఎక్కువ కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. కానీ ఆర్థికాభివృద్ధితో ముడి పడటం వల్ల దాన్ని సులభంగా వదిలేయడం సాధ్యం కాదు. దీనికి చైనా, ఇండియా, అమెరికాలే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంది.
ఈ మూడు దేశాలు బొగ్గుపై ఆధారపడటాన్ని ఆపేందుకు ఎలాంటి గడువు ఇవ్వలేదు.
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) సూచన ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుంటా నిరోధించడానికి, 2050 నాటికి బొగ్గు పై ఆధారపడటం పూర్తిగా తగ్గించాలి.
అయితే, ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య వివాదం చెలరేగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సహజ వాయువు పై ఆధారపడే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు బొగ్గు పై ఆధారపడటాన్ని తగ్గించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే, ఇది జరగాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అవసరం.
డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ ఆర్థిక సహాయం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, పారిస్ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం కింద అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
కానీ, ఈ హామీని అభివృద్ధి చెందిన దేశాలు నెరవేర్చలేకపోయాయి.
వాతావరణ నిధి కోసం పారిస్‌లో వాగ్దానం చేసిన 100 బిలియన్ డాలర్ల నిధిని నెరవేర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఈ మొత్తాన్ని కూడా పెంచాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి. ఇది కూడా COP 26లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
భారతదేశానికి చెందిన ప్రసిద్ధ పర్యావరణవేత్త, ఐఫారెస్ట్ సీఈఓ చంద్రభూషణ్ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.
"గ్లాస్గో ఎజెండా చాలా పెద్దది. పారిస్ ఒప్పందం నిబంధనలను నెరవేర్చడమే ప్రధాన అజెండా అని నేను భావిస్తున్నాను. దీనితో పాటు, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నమ్మకం ఉండాలి. కానీ అది విచ్ఛిన్నమైంది. దాన్ని పునరుద్ధరించాల్సి ఉంది'' అన్నారాయన.
నష్టాలు
భారతదేశం తరఫున గ్లాస్గోలో ప్రతిపాదించాల్సిన అజెండా, నష్టం గురించి మాట్లాడుతూ.. ''పారిస్ ఒప్పందంలో దీని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు'' అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డైరెక్టర్ సునీతా నారాయణ్ అన్నారు.
''వాతావరణ మార్పుల కారణంగా 1970-2019 మధ్య కాలంలో 11,000 ప్రకృతి వైపరీత్యాలు నమోదయ్యాయి. వీటి కారణంగా 20 లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల, గ్లాస్గోలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి, ఈ నష్టాలకు పరిహారంతో లంకె పెట్టాల్సి ఉంది'' అని సునీతా నారాయణ్ అభిప్రాయపడ్డారు.
పారిస్ ఒప్పందాన్ని భారత్ ఎంత వరకు పాటించింది?
పారిస్ ఒప్పందం ద్వారా భారతదేశం కూడా వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి తన వంతుగా అనేక వాగ్దానాలు చేసింది, ఇందులో మూడు ప్రధానమైనవి.
మొదటిది-2005తో పోలిస్తే 2030 నాటికి 33 నుంచి 35 శాతం వరకు కర్బన ఉద్గారాలను తగ్గించాలి. మొదటి లక్ష్యంలో 28% లక్ష్యాన్ని 2021లోనే పూర్తి చేశామని భారత ప్రభుత్వం పేర్కొంది.
అయితే ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతి పెద్ద బొగ్గు వినియోగదారు. దేశంలో 70% కంటే ఎక్కువ విద్యుత్ బొగ్గు నుండి ఉత్పత్తి అవుతుంది.
అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి, దేశపు స్థిరమైన ఆర్థికాభివృద్ధికి రాబోయే కొన్ని దశాబ్దాలపాటు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గును ప్రధాన వనరుగా వాడుకోవాల్సి ఉంది. అందువల్లే భారత్ నెట్ జీరో టార్గెట్‌ను ప్రకటించ లేదు.
భారత్ చేసిన రెండో పెద్ద వాగ్దానం 2030 నాటికి మొత్తం విద్యుత్‌లో 40శాతాన్ని పునరుత్పాదక, అణువిద్యుత్‌లు గా మారుస్తామని.
2030 నాటికి ఈ లక్ష్యం కంటే ఎక్కువే (సుమారు 48శాతం) సాధిస్తామని భారత ప్రభుత్వం పేర్కొంది.
పారిస్ ఒప్పందంలోని భారత ప్రభుత్వం చేసిన మూడో వాగ్దానం చెట్లను అధికంగా నాటడం. 2030 నాటికి భారీ ఎత్తున చెట్లను నాటడం ద్వారా వాతావరణం నుండి అదనంగా 2.5 నుండి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువును తగ్గించాలన్నది లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2001-2019 మధ్య భారతదేశంలో అటవీ విస్తీర్ణం 5.2 శాతం పెరిగింది. కానీ ఈ గణాంకాలు అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్‌తో సరిపోలడం లేదు.
గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రకారం భారత దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గింది. అయితే, అంకెల్లో ఇలా తేడా రావడానికి ప్రధాన కారణం ' ఫారెస్ట్ కవర్' నిర్వచనంలో తేడా ఉండటమే.
గ్లాస్గోలో ఇండియా ఏం చేయగలదు?
భారత దేశం తన లక్ష్యాలకు గ్లాస్గోలో సవరణలను ప్రతిపాదించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకు ముందు, భారత ప్రభుత్వం 'నెట్-జీరో'పై పెద్దగా నమ్మకం వ్యక్తం చేయలేదు.
''నెట్‌జీరో లక్ష్యం భారతదేశపు ప్రయోజనాలతో ముడిపడి ఉంది. 2050, 2060 మధ్య భారతదేశం దీనిని సాధించగలదు. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 °C కంటే ఎక్కువ పెరగకపోతే, భారతదేశం అతిపెద్ద లబ్ధిదారు అవుతుంది'' అని చంద్రభూషణ్ అన్నారు.
త్వరలో భారత జనాభా 150 కోట్లకు చేరబోతోంది. అదే నిష్పత్తిలో, పేదల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది ఇప్పటికే ఎక్కువగా ఉంది. పేదరికం నేరుగా వాతావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది.
పేదలకు నివాసం ఉండేందుకు పక్కా ఇళ్లు లేకుంటే వాతావరణ మార్పు వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇది మళ్లీ దేశ జీడీపీని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో రుతుపవనాలపై ఆధారపడటం కూడా చాలా ఎక్కువ.
''నెట్ జీరోపై భారత ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలంటే మనం మరికొంత కాలం వేచి ఉండాలి. అయితే 2030 నుంచి నెట్ జీరో పై దృష్టి పెట్టాలని భారత ప్రభుత్వం చెబుతుందని నేను అనుకుంటున్నారు. నెట్ జీరో సాధించడానికి ఇది ఆరంభ సంవత్సరం కావాల్సిన అవసరం ఉంది'' అని సీఎస్ఈ డైరెక్టర్ సునీతా నారాయణ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)