2021 ఎర్త్ ఫొటో కాంపిటీషన్: ఈ ఫొటో ఎందుకు విజేతగా నిలిచిందంటే..

కూతురితోపాటు తామూ చదువుకునేందుకు ఇథియోపియాలోని ఓ కుటుంబం పడుతున్న కష్టాన్ని ఫొటోల రూపంలో మలిచిన ప్రాజెక్టుకు ''2021 ఎర్త్ ఫొటో కాంపిటీషన్''లో విజేతగా నిలిచింది.

రోసీ హెల్లాం ఈ ఫొటోలను తీశారు. విద్యా హక్కును అందరికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ఫొటోలను రోసీ తీశారు.

ఈ ఫొటోలో మధ్యలో సీలామౌ కనిపిస్తోంది. తన కుటుంబంలో ప్రైమరీ స్కూల్‌లో చేరిన తొలి బాలిక ఆమె. ఒకవైపు ఆమె తల్లి మెసెలెక్, మరోవైపు తండ్రి మార్కో కనిపిస్తున్నారు.

సీలామౌ కుటుంబం వ్యవసాయం చేస్తుంది. తమ కుమార్తెతోపాటు చదువుకునేందుకు ప్రత్యేక విద్యా కార్యక్రమంలో వీరు నమోదు చేసుకున్నారు.

పీపుల్స్ కేటగిరీలోనూ ఈ ప్రాజెక్టుకు అవార్డు దక్కింది.

''లింగ సమానత్వం''

''విద్య అనేది మౌలిక మానవ హక్కుల కిందకు వస్తుంది. అంతేకాదు దీన్ని మనం స్మార్ట్ పెట్టుబడిగా చూడాలి''అని రోసీ అన్నారు.

''మానవ అభివృద్ధిలో విద్య చాలా కీలకమైనది. సామాజిక, ఆర్థిక వృద్ధికి ఇది బాటలు వేస్తుంది. లింగ సమానత్వం, శాంతి స్థాపనలోనూ ఇది కీలకంగా మారుతుంది'' అని చెప్పారు.

ఫారెస్ట్రీ ఇంగ్లండ్, రాయల్ జాగ్రిఫికల్ సొసైటీ ఈ అవార్డులను ప్రకటించింది. ఆరు కేటగిరీల్లో ఎంపిక చేసిన 55 ఫొటోలు, నాలుగు సినిమాల నుంచి విజేతలను ప్రకటించారు.

పోటీల లక్ష్యం ఇదే...

  • అత్యుత్తమ పర్యావరణ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం
  • ప్రపంచం, మానవులకు సంబంధించి కీలక అంశాలపై చర్చలను ప్రోత్సహించడం

''ప్లేస్'' కేటగిరీలో ఎడ్వర్డ్ బ్యాట్‌మన్ తయారుచేసిన ''హాల్ఫ్ డోమ్ ఇన్ వింటర్''కు అవార్డు దక్కింది.

కోవిడ్-19 వ్యాప్తి కట్టడి చేసేందుకు విధిస్తున్న ఆంక్షలతో జాతీయ పార్కుల సందర్శన కష్టం అవుతోంది. దీంతో తన వంట గదిలోని టేబుల్‌పై 3డీ జాతీయ పార్కును ఎడ్వర్డ్ తయారుచేశారు.

దీని కోసం అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) సమాచారాన్ని ఆయన తీసుకున్నారు. ఫాగ్ మెషీన్‌ను ఉపయోగించి దీన్ని తయారుచేశారు.

నేచర్ కేటగిరీలో మార్కస్ 'బ్లూ పూల్' విజేతగా నిలిచింది.

ఐస్‌లాండ్‌లో ప్రజలు తక్కువగా ఉండే ప్రాంతంలోని ఒక అందమైన నీలి రంగు చెరువు ఇది.

చేజింగ్ ఫారెస్ట్ కేటగిరీలో రెబోర్టో బ్యూనో తీసిన ''ఫారెస్ట్ లైక్ గార్డెన్'' ఫొటో విజేతగా నిలిచింది.

స్పెయిన్‌లోని ద్రాక్ష తోటలు పండించే ప్రాంతాన్ని విహంగ వీక్షణంతో ఆయన కెమెరాలో బంధించారు.

వాతావరణ మార్పుల కేటగిరీలో ఆంటోనియో పెరేజ్ సిరీస్ ''ద సీ మూవ్స్ అస్'' విజేతగా నిలిచింది.

పశ్చిమ ఆఫ్రికాలో తీరం కోతకు గురికావడంతో ప్రభావితమైన ఘానాలోని ఫువేమే నగరవాసుల ఫొటోలను ఆంటోనియో తీశారు.

వీడియో కేటగిరీలో పీర్పాలో మిట్టికా తీసిన షార్ట్‌ఫిల్మ్ ''సెమీపాలాటిన్సెక్ పాలిగాన్'' విజేతగా నిలిచింది.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అణు పరీక్షలతో ప్రభావితమైన మనుషులు, పర్యావరణాలను దీనిలో చూపించారు.

లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సొపైటీ పెవీలియన్‌లో ఆగస్టు 25 వరకు ఎర్త్ ఫొటో ప్రదర్శన కొనసాగుతుంది.

ఫోటోలు రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ