ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం: BBC Special Report

సముద్రాలను ప్లాస్టిక్‌ కలుషితం చేస్తోంది. భారతదేశంలో కూడా ప్లాస్టిక్‌ సమస్య అధికంగానే ఉంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ నగరానికి చెందిన ఒక సంస్థ.

నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఉపయోగిస్తూ వీళ్లు ఏకంగా ఇళ్లను, ఫుట్ పాత్‌లనే నిర్మిస్తున్నారు. అయితే భవిష్యత్తు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మితమయ్యే ఇళ్లదేనా? ఇటువంటి ఇళ్ల ఖరీదు ఎంత ఉండొచ్చు?

ఇది ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఈ ఇంటి నిర్మాణంలో ఉపయోగించింది అక్షరాలా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలనే. దాదాపు రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ ఇంటి నిర్మాణంలో ఉపయోగించారు. ఈ ఇంటి పైకప్పు నిర్మించడానికి యాభై లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వాడారు.

ఈ ఇంట్లో నివసిస్తున్న పార్కింగ్ అటెండెంట్ ఇంద్రనీల్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నానని, సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.

పర్యావరణానికి ఎలాంటి చేటు చేయని ఇళ్లను నిర్మించే ఆలోచనతో సంవత్సరం క్రితం ముందుకు వచ్చారు బాంబూ హౌస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ లింగం.

ప్లాస్టిక్ కవర్‌లను, వస్తువులను సేకరించేందుకు ఆయన చెత్త ఏరుకునే వారికి డబ్బులిస్తారు.

"ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడమనేది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. ప్లాస్టిక్‌ను నివారించలేం.. అందుకే దాన్ని రీసైకిల్ చేయడం మంచిది లేదా అదంతా డంపింగ్ గ్రౌండ్‌కు చేరుతుంది" అని ప్రశాంత్ లింగం బీబీసీతో అన్నారు.

అయితే ఈ విధంగా నిర్మించిన ఇళ్లను అమ్మడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఈ ఇళ్ల ఖరీదు సాధారణ ఇళ్లకంటే 25% ఎక్కువ. అందుకే వినియోగదారులను ఒప్పించడం కష్టం.

కానీ ప్లాస్టిక్‌తో టైల్స్ తయారు చేసి అమ్మడంలో విజయం సాధించారు ప్రశాంత్.

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఈ ప్లాస్టిక్ టైల్స్ ఉపయోగించి పాదచారుల కోసం ఫుట్ పాత్‌లను నిర్మిస్తోంది.

ఒక్క టైల్ తయారు చేయడానికి 600 పాలిథీన్ బ్యాగులు అవసరమవుతాయి. దీని ఖర్చు ఒక్క డాలర్, అంటే దాదాపు డెబ్భై రూపాయల కంటే తక్కువే ఉంటోంది.

భారత్‌లో పెరుగుతోన్న ప్లాస్టిక్ సమస్యకు ఇదొక పరిష్కారం అని చెప్పొచ్చు. భవిష్యత్తులో డిమాండ్ పెరిగి ఈ చెత్త బంగారంలా మారుతుందని ప్రశాంత్ ఆశాభావంతో ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)