You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జి-7 సదస్సు: భావప్రకటనా స్వేచ్ఛ ఒప్పందంపై మోదీ సంతకం చేయడాన్ని కొందరు ఎందుకు తప్పుబడుతున్నారు?
- రచయిత, చందన్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ కోసం
ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ను సోమవారం దిల్లీ పోలీస్‌కు చెందిన స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత మంగళవారం ఆయనను నాలుగు రోజులు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు.
దిల్లీ పోలీసుల ప్రకారం, ఐపీసీ సెక్షన్ 153-ఎ (సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం), 295-ఎ (ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం) కింద నాలుగేళ్ల క్రితమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వాటి ప్రకారమే ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు పౌర సమాజం స్వేచ్ఛను కాపాడతామంటూ భారత్, జి-7 గ్రూపుతో కలిసి సోమవారమే ఒక ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ మేరకు జి-7లోని ఏడు శాశ్వత సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్, భారత్‌తో పాటు మరో నాలుగు దేశాలు ఉమ్మడిగా నాలుగు పేజీల ప్రకటనను విడుదల చేశాయి.
''ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికల్లో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటానికి భాగస్వామ్య దేశాలన్నీ కలిసి కృషి చేస్తాయి. ఇంటర్నెట్ ప్రపంచాన్నిమరింత స్వేచ్ఛగా, విశ్వసనీయంగా, భద్రమైన ప్రదేశంగా మార్చుతాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విధంగా ఒకేరోజు రెండు ఘటనలు తెరపైకి రావడంతో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.
'కేవలం ఒప్పందంతో ఏమవుతుంది'
''భారత్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణించిందనడానికి మహమ్మద్ జుబైర్ అరెస్ట్ మరొక ఉదాహరణ. భారత్‌లో జర్నలిస్టులకు ప్రతికూల వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించింది'' అని జర్నలిస్టుల రక్షణ కమిటీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
మహమ్మద్ జుబైర్ అరెస్ట్ తర్వాత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ యూజెరిక్ మాట్లాడుతూ... ''ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు, తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి భయం లేకుండా తమ పని చేసుకునే స్వాతంత్ర్యం జర్నలిస్టులకు ఉండాలి'' అని అన్నారు.
మహమ్మద్ జుబైర్ అరెస్ట్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా బదులిచ్చారు.
సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, బీబీసీ హిందీతో మాట్లాడారు. ''ఇది హాస్యస్పదంగా అనిపిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది దేశంలో నశించిపోయింది. ప్రభుత్వం కోరుకుంటే ఏదైనా ఒక చిన్న కేసులో కూడా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. జుబైర్ లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. జి-7తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ, భావ ప్రకటన స్వేచ్ఛకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో మరో సీనియర్ జర్నలిస్ట్ పరంజయ్ గుహ ఠాకుర్తా మాట్లాడుతూ... ''విదేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి భారత ప్రధాన మంత్రి ఏమైనా చెబుతారు. కానీ, దేశంలో కథ మాత్రం వేరేలా ఉంటుంది'' అని అన్నారు.
ప్రభుత్వ పక్షపాతంగా వ్యవహరిస్తోంది అంటూ రాజకీయాలతో ముడిపడిన చాలా మంది ఆరోపణలు చేశారు. ''బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఒక కేసు ఉంది. అయినప్పటికీ ఇంకా ఆమెను అరెస్ట్ చేయలేదు. కానీ, జుబైర్‌ను మాత్రం అరెస్ట్ చేశారు ఎందుకు?'' అంటూ ఎంఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ ట్వీట్‌లో ప్రశ్నించారు.
ప్రజల్లో భిన్న అభిప్రాయాలు
ఇతర విషయాల తరహాలోనే ఈ అంశంలో కూడా ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు జుబైర్ అరెస్ట్ విషయాన్ని సమర్థిస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
జుబైర్ ఒక 'జిహాదీ' అని, ఆయన హింసను ప్రేరేపించారని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేత అన్నారు.
బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''ఫేస్‌బుక్‌లో ఒక సాధారణ పోస్ట్ పెట్టినందుకు మరాఠీ నటిని అరెస్ట్ చేసినప్పుడు రాహుల్ గాంధీ వ్యతిరేకించలేదు. రాజస్థాన్‌లో మహిళలు, చిన్నారులపై రేప్ జరిగినప్పుడు కూడా నోరు మెదపలేదు. కానీ, ఇప్పుడు ఒక జిహాదీ కోసం కన్నీరు కార్చుతున్నారు'' అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా జుబైర్ అరెస్ట్‌ను సమర్థించారు.
భారత్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ సంస్థల ఆందోళన
గత ఏడాది నివేదిక ప్రకారం పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉంది. 2016లో భారత్ ర్యాంక్ 133 కాగా, 2021 నాటికి 142కు దిగజారింది.
ఆసియాలోని అనేక దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ సూచిలో భారత్ స్థాయి క్రమంగా పడిపోతూ వస్తోంది. 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' అనే సంస్థ ప్రతీ ఏడాది ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది.
మానవ హక్కుల కోసం పనిచేస్తోన్న 'హ్యూమన్ రైట్స్ వాచ్' కూడా భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మే 3న న్యూయార్క్ నుంచి విడుదలైన నివేదికలో ఇలా రాశారు. ''భారత్‌లో జర్నలిస్టులు, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వేధిస్తున్నారు. దీని వెనుక హిందుత్వవాదులు, ప్రభుత్వ మద్దతు ఉన్న సంస్థలు ఉన్నాయి'' అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
మహ్మద్ జుబేర్ అరెస్టు తర్వాత మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన విడుదల చేసింది, "మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకు భారత ప్రభుత్వం, జుబైర్‌ను లక్ష్యంగా చేసుకుంది. మానవ హక్కుల కార్యకర్తలు ఎదుర్కొనే ముప్పు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు ఈ అరెస్టులు చూపుతున్నాయి'' అని పేర్కొంది.
'ప్రభుత్వం కంటే న్యాయవ్యవస్థ పైనే ఎక్కువ నిరాశ'
భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ అన్నారు. దీనికి దేశ న్యాయవ్యవస్థ ఎక్కువ బాధ్యత వహించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
''ఈ రోజు నేను ప్రభుత్వ తీరుకంటే న్యాయవ్యవస్థ తీరుతోనే ఎక్కువ నిరాశకు గురవుతున్నాను. దేశ న్యాయవ్యవస్థ వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను కాపాడాల్సి ఉంది. అది బాగా లేనప్పుడు ఇంకేమీ ఆశించలేం'' అన్నారామె.
''ఏ దేశంలోనైనా న్యాయవ్యవస్థను న్యాయవ్యవస్థే నిర్వహిస్తుంది. ప్రతి ప్రజాస్వామ్య దేశానికి చాలా కీలకమైన చట్టం, రాజ్యాంగం అనేవి న్యాయస్థానాల ద్వారా మాత్రమే రక్షించబడతాయి. కానీ కాలక్రమేణా మన న్యాయస్థానాలు చట్టాన్ని, పౌరుల స్వేచ్ఛను పరిరక్షించడంలో విఫలమవుతున్నందుకు బాధగా ఉంది'' అన్నారు రెబెక్కా జాన్.
"ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ వాటిని నియంత్రించే, రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజల్లో భయం మొదలవుతుంది. జి-7లో భావప్రకటనా స్వేచ్ఛపై కుదిరిన ఒప్పందం ఓ జోక్. ఒకవైపు మీరు అగ్రిమెంట్‌పై సంతకం చేస్తుంటే, మరోవైపు ట్వీట్‌లు చేసినందుకు అరెస్టులు చేస్తున్నారు'' అన్నారామె.
పరంజయ్ గుహా కూడా దీనిపై స్పందించారు. ''విదేశాల్లో ప్రధాని మోదీ ఏం చెబుతారు, ఏం చేస్తారు అనే దానికంటే దేశంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ముఖ్యం. నరసింహానంద, ఎంపీలు సాధ్వి ప్రజ్ఞా, సాక్షి మహరాజ్‌ల వివాదాస్పద ప్రకటనలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అన్నారాయన.
జి-7 పాత్ర ఏంటి
అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలు జి-7లో శాశ్వత సభ్యదేశాలు. యూరోపియన్ యూనియన్‌తో పాటు ఐదు మిత్రదేశాలైన ఇండియా, సౌతాఫ్రికా, ఇండోనేషియా, అర్జెంటీనా, సెనెగల్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, అణచివేత, హింసకు వ్యతిరేకంగా నిలబడే ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించే వారందరినీ స్వాగతిస్తుందంటూ సభ్యదేశాలు పేర్కొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సమాజాల స్థితిని మెరుగుపరచడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకు వెళతామని ఈ ఒప్పందంలోని అన్ని పక్షాలు ప్రతిజ్ఞ చేశాయి. ప్రజాస్వామ్యంలోని బహిరంగంగా చర్చించే స్వేచ్ఛ, ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో స్వేచ్ఛాయుత మీడియాను అనుమతిస్తామని సదస్సులో పాల్గొన్న దేశాలు చెప్పాయి.
సైబర్ సెక్యురిటీ గురించి అవగాహన పెంచుకోవడం, ఈ రంగంలో సహకారాన్ని విస్తరించడంతోపాటు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచుకోవాలని కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాయి.
అదే సమయంలో, ఇంటర్నెట్‌లో ప్రచారంతో పాటు, సమాచారాన్ని తారుమారు చేయడం, అందులో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను నివారిస్తామని చెప్పాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు
- చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
- Instagram: మీ సెల్ఫీ వీడియో చూసి వయసెంతో గుర్తు పట్టేస్తుంది.
- యుక్రెయిన్‌లో దొంగిలిస్తున్న ఆహార ధాన్యాలను రష్యా ఎక్కడికి తీసుకెళ్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)