ఆస్ట్రేలియా: తేనెటీగలకూ లాక్‌డౌన్‌ ఎందుకు విధించాల్సి వచ్చింది, వదిలేస్తే ప్రపంచానికి ప్రమాదమేంటి

    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్ట్రేలియాలో లక్షల కొద్దీ తేనెటీగలను "లాక్‌డౌన్"లో ఉంచారు. తరువాత, వాటిని చంపేస్తారు కూడా. దీనంతటికీ కారణం వరోవా అనే పరాన్నజీవి. ఇది తేనెటీగలకు, తేనెపట్లకు పట్టే తెగులు.

వరోవా వ్యాప్తి కారణంగా తేనె, ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఈ పరాన్నజీవిని తొలిసారిగా సిడ్నీ నగరానికి దగ్గర్లో ఉన్న ఒక ఓడరేవులో గతవారం గుర్తించారు. అప్పటి నుంచి దీని వ్యాప్తి మొదలైంది. అక్కడికి 100 కిమీ దూరంలో ఉన్న కొన్ని తేనెపట్లలో కూడా కనిపించింది.

వెంటనే, తేనెటీగల రక్షణ కోసం కొత్త బయోసెక్యూరిటీ జోన్‌ను ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు వరోవా కీటకాలు వ్యాప్తి చెందని ఏకైనా దేశం ఆస్ట్రేలియా. ప్రపంచవ్యాప్తంగా వీటిని తేనెటీగలకు అతిపెద్ద ముప్పుగా భావిస్తారు.

నువ్వు గింజ పరిమాణంలో ఉండే ఈ కీటకాలు తేనెపట్లకు వ్యాపించి వాటిని నాశనం చేస్తాయి. ఇవి ఒకరకమైన వైరస్‌ను వ్యాపింపజేస్తాయి.

న్యూ సౌత్ వేల్స్‌లో ఏడు ప్రాంతాలలో వరోవా జీవులను గుర్తించిన తరువాత, వాటి వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు పలు రకాల బయోసెక్యూరిటీ చర్యలను చేపట్టారు.

వరోవా సోకిన ప్రాంతాల నుంచి 10 కిమీ దూరంలో ఉన్న తేనెపట్లను నాశనం చేస్తారు. ఇప్పటివరకు ఆ చుట్టుపక్కల సుమారు 400 తేనెపట్లు కనిపించాయి. 25 కి.మీ. దూరంలో ఉన్న తేనెపట్లను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

తేనేటీగలకు లాక్‌డౌన్

వరోవా కారణంగా "తేనేటీగల లాక్‌డౌన్" (బీ లాక్‌డౌన్) ప్రకటించారు. అంటే తేనెటీగలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించలేవు.

ఉత్పత్తికి నష్టం వాటిల్లకుండా ఈ లాక్‌డౌన్ అవసరమని ఎన్ఎస్‌డబ్ల్యూ ఫార్మర్స్‌కు చెందిన ఇయాన్ మెక్‌కాల్ అన్నారు.

వరోవా పరాన్నజీవులు వ్యాప్తి చెందితే, తేనే ఉత్పత్తి పరిశ్రమకు మాత్రమే సంవత్సరానికి సుమారు 70 మిలియన్ డాలర్ల (రూ. 553 కోట్లు) నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు.

ఆస్ట్రేలియా ఆహార ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు తేనెటీగల పరాగ సంపర్కంపై ఆధారపడి ఉంటుంది. బాదం, యాపిల్స్, అవకాడో మొదలైనవన్నీ తేనెటీగల సంపర్కంపైనే ఆధారపడి ఉంటాయి.

"తేనెటీగలు మా ఉత్పత్తి వ్యవస్థలో అంతర్భాగం. కేవలం పరిశ్రమకు నష్టం కలుగుతుందనే కాదు, మొత్తం తేనెటీగల జాతికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన ఉంది" అని మెక్‌కాల్ అన్నారు.

గతంలో క్వీన్స్‌లాండ్, విక్టోరియాలలో కనిపించిన ఇతర రకాల వరోవా పరాన్నజీవులను నాశనం చేశారు. ఇవి మళ్లీ వ్యాప్తి చెందకుండా రైతులు మరికొన్ని రోజులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)