అఫ్గానిస్తాన్-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జెండా ఎగరేసిన తాలిబన్లు -Newsreel

బోర్డర్ పోస్టును తాలిబన్‌లు చేజిక్కించుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు నిర్థరించారు.

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, బోర్డర్ పోస్టును తాలిబన్‌లు చేజిక్కించుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు నిర్థరించారు.

విదేశీ సైన్యాలు వెళ్లిపోయాక ఒక్కొక్క ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లు అఫ్గానిస్తాన్ , పాకిస్తాన్ మధ్య ఉన్న ఓ కీలకమైన సరిహద్దు పోస్టుపై తమ జెండా ఎగరేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతం ఇప్పుడు తమ అధీనంలోకి వచ్చిందని తాలిబన్ పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కాందహార్ సమీపంలోని స్పిన్ బోల్డాక్ క్రాసింగ్‌పై తాలిబన్‌ల తెల్లని జెండా ఎగురుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.

అయితే, అఫ్గాన్ అధికారులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాల్లో తాలిబన్‌ మిలిటెంట్లు, పాకిస్తాన్ సరిహద్దు దళాలతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏ రకమైన ప్రతిఘటనా లేకుండా తాలిబన్‌లు ఆ బోర్డర్ క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీబీసీకి సమాచారం అందింది.

గత కొన్ని వారాలుగా మిలిటెంట్లు దేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ఇరాన్, తజకిస్తాన్, తుర్క్‌మినిస్తాన్ బోర్డర్ పోస్టులతో సహా పలు ప్రాంతాలను అఫ్గాన్ భద్రతా దళాల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా భద్రతా దళాలు విధించిన గడువు (స్పెటెంబద్ 11) కన్నా ముందే అఫ్ఘానిస్తాన్ నుంచి వైదొలగడంతో తాలిబన్‌లు ఆ దేశంలో ముందుకు దూసుకు వస్తున్నారు.

దాంతో పాటుగా, ప్రధాన నగరాలకు సరఫరా మార్గాలను అడ్డుకునే ఆలోచనతో తాలిబన్‌లు అనేక కీలక రహదారులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

తాలిబన్ మిలిటెంట్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తాలిబన్ మిలిటెంట్లు

కాందహార్ ప్రాంతంలో అఫ్గాన్ పట్టణం స్పిన్ బోడ్లాక్‌ను, పాకిస్తాన్ పట్టణం చమన్‌ను విభజించే బోర్డర్ పోస్టు, ఈ రెండు నగరాల మధ్య అత్యంత రద్దీగా ఉందే రెండవ మార్గం. ఇది కాందహార్ నగరాన్ని పాకిస్తాన్ పోర్టులకు లింకు చేస్తుంది. ఈ మార్గంలో రోజుకు సుమారు 900 ట్రక్కులు వస్తూ పోతుంటాయి.

దీనిపై పట్టు సాధించడం వ్యూహాత్మకంగా, ప్రతీకాత్మకంగా కూడా తాలిబన్‌లకు లాభదాయకమేనని బీబీసీ ప్రతినిధి లైస్ డౌసెట్ అభిప్రాయపడ్డారు.

ఈ మార్గం ద్వారా వచ్చే కస్టమ్స్ రెవెన్యూ చేతికి అందడమే కాకుండా, పాకిస్తాన్‌లో తాలిబన్ నాయకులు, మిలిటెంట్లు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పలు ప్రాంతాలకు సులువుగా చేరుకునే మార్గం దొరుకుతుందని ఆమె అన్నారు.

ఈ వార్తను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. కానీ, ఆ బోర్డర్ పోస్టును తాలిబన్‌లు చేజిక్కించుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు నిర్థరించారు. బోర్డరు దగ్గర అఫ్గాన్ పట్టణంలో తాలిబన్‌లు ఉన్నట్లు స్థానికులు కూడా వెల్లడించారు.

జొమాటో

ఫొటో సోర్స్, NURPHOTO

జొమాటో IPO: ఈ ఫుడ్ డెలివరీ యాప్ విలువ 900 కోట్ల డాలర్లకు చేరుకుంటుందా?

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఐపీఓ ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంలోని అతిపెద్ద టెక్ స్టార్టప్స్‌లో ఒకటైన జొమాటో ఇప్పటికే 562.3 మిలియన్ డాలర్ల మొత్తాన్ని సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన ఈ మొత్తం కన్నా 35 రెట్లు ఎక్కువగా బిడ్లు రావడం విశేషం.

నష్టాల్లో ఉన్న కంపెనీ విలువను భారీగా లెక్కగట్టారని ఒక వైపు విశ్లేషకులు చెబుతున్నా ఆ ప్రభావమేమీ మదుపరులపై పెద్దగా కనిపించడం లేదు.

జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ మద్దతు ఉన్న జొమాటో భారతదేశంలోని భారీ డిజిటల్ స్టార్టప్స్‌లో ఐపీఓకు వస్తున్న మొదటి కంపెనీ.

భారతదేశంలో ఇటీవలి కాలంలో యూనికార్న్ కంపెనీల - అంటే బిలియన్ డాలర్ల విలువను (రూ. 7,450 కోట్లు) అందుకున్న ప్రైవేట్ స్టార్టప్స్ - సంఖ్య వేగంగా పెరుగుతోంది. వాటిలో మొబైల్ పేమెంట్స్ యాప్ 'పేటీఎం', ఆన్ లైన్ బ్యూటీ రీటైలర్ 'నైకా' వంటి కంపెనీలు రానున్న నెలల్లో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి.

మూడు రోజులు అందుబాటులో ఉండే జొమాటో ఐపీఓ షేర్ ధరను రూ. 72-76గా నిర్ణయించారు. ఈ ఐపీఓ తరువాత ఈ కంపెనీ విలువ 900 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్టాక్‌లో ట్రేడింగ్ జూలై 27న ప్రారంభం కానుంది.

స్టాక్ ఎక్ఛేంజ్ డేటా ప్రకారం బుధవారం ఐపీఓ ప్రారంభమైన తరువాత మధ్యాహ్నానికి 29% షేర్లు అమ్ముడయ్యాయి.

2008లో ప్రారంభమైన జొమాటో సంస్థ ప్రస్తుతం 525 నగరాల్లో ప్రతి నెలా 68 లక్షల మంది వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేస్తోంది. అయితే, 2021 మార్చిలో ఈ కంపెనీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23.4% తగ్గాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)