వలస పాలనలో నమీబియాలో మారణహోమం జరిగినట్లు అధికారికంగా అంగీకరించిన జర్మనీ

సంకెళ్లతో బంధించిన హెరెరో తిరుగుబాటుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెరెరో తిరుగుబాటుదారులు

నమీబియా జర్మనీ వలసపాలనలో ఉన్నప్పుడు అక్కడ మారణహోమం జరిగినట్లు జర్మనీ అధికారికంగా అంగీకరించింది. అందుకు పరిహారంగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.

20వ శతాబ్దపు తొలినాళ్లలో నమీబియాలో కొన్ని వేల మంది హెరెరో, నామా జాతి ప్రజలను జర్మన్లు చంపేశారు.

ఈ మరణాలను మారణహోమంగా అంగీకరిస్తూ జర్మనీ ఆర్ధిక మంత్రి హీకో మాస్ శుక్రవారం ప్రకటన చేశారు.

"నమీబియాను, మరణించిన వారి వారసులను క్షమించమని అడగడం జర్మనీకున్న చారిత్రక, నైతిక బాధ్యత" అని ఆయన అన్నారు.

బాధితులకు కలిగిన తీవ్రమైన వేదనను గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశ అభివృద్ధికి 1.34 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం, ఆ దేశ మౌళిక సదుపాయాలు, వైద్య రంగం, ఈ మారణహోమం వల్ల ప్రభావితులైన జాతులకు శిక్షణా కార్యక్రమాల కోసం 30 సంవత్సరాల వరకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

"నేడున్న పరిస్థితులకు అనుగుణంగానే ఈ ఘటనలను మేము మారణహోమం అని అధికారికంగా గుర్తిస్తాం"అని మాస్ అన్నారు.

"వలస పాలనలో చోటు చేసుకున్న ఘటనలను పక్కన పెట్టేసి, మెరుపులు అద్దకుండా వాటిని చర్చించాల్సిన అవసరముంది" అని ఆయన ప్రకటనలో అన్నారు.

"ఇది మారణహోమంగా గుర్తించడమే సరైన అడుగు" అని నమీబియా ప్రభుత్వపు ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

అయితే, ఈ విషయంలో ప్రభుత్వం అమ్ముడుపోయిందని అంటూ కొంత మంది సంప్రదాయ నాయకులు జర్మనీ ఇచ్చిన ప్యాకేజీని తీసుకోవడానికి నిరాకరించారు.

20వ శతాబ్దపు తొలినాళ్లలో నమీబియాలో కొన్ని వేల మంది హెరెరో, నామా జాతి ప్రజలను జర్మన్లు చంపేశారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వలస పాలనలో నమీబియాలో మారణహోమం జరిగినట్లు జర్మనీ అధికారికంగా అంగీకరించింది

మారణహోమం సమయంలో ఏం జరిగింది?

నమీబియాతో ఐదేళ్ల పాటు సాగిన చర్చల తర్వాత శుక్రవారం నాటి ప్రకటన విడుదలయింది. నమీబియా 1884-1915 వరకు జర్మనీ వలస పాలనలో ఉంది.

ఆ సమయంలో జర్మనీ నమీబియా ప్రజలపై అవలంబించిన అమానుష చర్యలను "20వ శతాబ్దంలో మర్చిపోయిన మారణహోమం" గా చరిత్రకారులు అభివర్ణించారు.

అప్పట్లో ఆ ప్రాంతాన్ని జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని పిలిచేవారు.

ఒక జాతిని, మత సమూహాన్ని, లేదా వర్గాన్ని పూర్తిగా గాని, పాక్షికంగా గాని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో చంపడాన్ని 'మారణహోమం' అని ఐక్యరాజ్య సమితి నిర్వచిస్తోంది.

జర్మన్లు తమ భూమిని, పశు సంపదను ఆక్రమించిన తర్వాత హెరెరో, నామా జాతులు వారు చేసిన తిరుగుబాటుతో 1904లో ఈ మారణహోమం మొదలయింది. ఈ తిరుగుబాటుకు ప్రతీకారంగా అక్కడి జనాభాను అంతం చేయాలని అక్కడి మిలటరీ అధిపతి లోథార్ వోన్ ట్రోథా పిలుపునిచ్చారు.

ఆ మారణహోమంలో బ్రతికి బయటపడిన వారు ఎడారిలోకి పారిపోయారు. ఆ తర్వాత వారిని కాన్సంట్రేషన్ శిబిరాల్లో పెట్టి వెట్టి చాకిరీ చేయించుకున్నారు.

చాలా మంది రోగాలతో, అలసటతో, ఆకలితో మరణించారు. కొంత మంది పై లైంగిక వేధింపులు, ఔషధాల కోసం ప్రయోగాలు జరిగాయి. ఆ సమయంలో స్వదేశీ జాతులకు చెందిన వారు కనీసం 80 శాతం మంది మరణించి ఉంటారని అంచనా. కొన్ని వేల మంది ప్రజలు మరణించారు.

గతంలో ఈ అమానుషం చోటు చేసుకున్నట్లు జర్మనీ గుర్తించినప్పటికీ దానికి పరిహారం చెల్లించడానికి మాత్రం అంగీకరించలేదు.

2018లో శ్వేత జాతి యూరోపియన్ల జాత్యహంకారాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని మానవ అవశేషాలను నమీబియాకు తిరిగి పంపించింది. వాటిని కొన్ని ఉపయోగపడని, గుర్తించని అధ్యయనాల కోసం వాడుకుంది.

మే మధ్యలో కొంత మంది ప్రత్యేక దౌత్యవేత్తలు చేసిన చర్చల ఫలితంగా ఈ కొత్త ఒప్పందానికి జర్మనీ అంగీకరించింది.

వచ్చే నెలలో ఇరు దేశాల పార్లమెంట్లలో ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి ముందే జర్మనీ విదేశాంగ మంత్రి నమీబియా రాజధాని విండ్ హోయక్ లో ఒక తీర్మానం చేస్తారని ఆశిస్తున్నట్లు, జర్మనీ మీడియా కథనాలు చెబుతున్నాయి.

అధికారికంగా క్షమాపణలు చెప్పేందుకు జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మీర్ నమీబియా వెళ్లవచ్చని చెబుతున్నారు.

హెరెరో పారామౌంట్ చీఫ్ వెకి రుకోరో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెరెరో పారామౌంట్ చీఫ్ వెకి రుకోరో

దీనిపై స్పందనలెలా ఉన్నాయి?

జర్మనీ అధికారికంగా మారణహోమం జరిగినట్లు ఆమోదించడమే తొలి అడుగని నమీబియా ప్రభుత్వ అధికారులు అంటుండగా, కొంత మంది మాత్రం వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు.

వలస పాలకుల చేతిలో అనుభవించిన తిరిగి కోలుకోలేని హానిని అనుభవించిన వారికి ఈ పరిహారం సరిపోదని, పరిహారం కోసం అమెరికా కోర్టుల్లో జర్మనీ పై కేసులు వేయాలని ప్రయత్నించిన హెరెరో పారామౌంట్ చీఫ్ వెకి రుకోరో అన్నారు.

"ఈ ఒప్పందాన్ని చూస్తుంటే నమీబియా ప్రభుత్వం పూర్తిగా అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తోందంటూ దీంతో సమస్యలున్నాయి" అని ఆయన రాయిటర్స్ సంస్థతో అన్నారు.

బాధితుల జ్ఞాపకార్ధం న్యాయమైన సయోధ్యను కుదర్చడానికి ఒక ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎన్నుకోవడానికి ఈ చర్చలు లక్ష్యంగా పెట్టుకున్నాయని మాస్ అన్నారు. ఈ చర్చల్లో హెరెరో, నామా జాతుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

అయితే, ఈ చర్చల్లో పాల్గొన్న సంప్రదాయ నాయకులు మాత్రం ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదని నమీబియా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇందులో ముఖ్యంగా భాషకు సంబంధించిన విషయంలో వివాదం ఉంది.

అధికారికంగా ఇచ్చే పరిహారం విషయంలో సయోధ్య పై ఈ ఒప్పందం దృష్టి సారించింది. దీనిని పరిహారంగా కాకుండా, సహాయం చేస్తున్నట్లుగా మాస్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ మారణహోమంలో బలైన చాలా మంది వారసులను పక్కకు పెట్టారని హ్యాం బర్గ్ యూనివర్సిటీలో గ్లోబల్ హిస్టరీ ప్రొఫెసర్ జర్గెన్ జిమ్మరర్ అన్నారు.

"సయోధ్య కుదుర్చుకోవడమే లక్ష్యమైతే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది" అని ఆయన అన్నారు.

"ఈ మొత్తం ప్రక్రియలో బాధితులే తమను పక్కన పెట్టినట్లు భావిస్తే బాధితులతో సయోధ్య ఎలా కుదురుతుంది" అని ఆయన ప్రశ్నించారు.

ఒక మాజీ వలస రాజ్యం ఇలాంటి చర్చలకు పూనుకోవడం ఇదే మొదటిసారని, బీబీసీకి చర్చల గురించి రాసిన వ్యాసంలో టిమ్ వీవెల్ అన్నారు.

ఈ ఒప్పందం తమ పూర్వీకులు కోల్పోయిన సంపదను, భూమిని తిరిగి సంపాదించి పెడుతుందని కిక్కిరిసిన ప్రాంతాల్లో, అసంఘిటితంగా నివసిస్తున్న చాలా మంది హెరెరో, నామా జాతుల ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)