అమెరికాలో పాఠాల్లోనూ కనిపించని నల్లజాతి మహిళా సైంటిస్టులు

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

అమెరికాలో టెక్స్ట్ బుక్స్‌లో సైంటిస్టులకు సంబంధించి ఉన్న పాఠాల్లో అత్యధికం శ్వేత జాతీయులైన పురుష శాస్త్రవేత్తల గురించే ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది.

ఒక్క జీవ శాస్త్ర పుస్తకాలనే ఉదాహరణగా తీసుకుంటే పాఠ్యాంశాల్లో ప్రస్తావించిన శాస్త్రవేత్తల్లో పురుషులు, స్త్రీల నిష్పత్తి 7:1గా ఉంది. ఇక ఆ మహిళల్లో నల్లజాతీయులు అస్సలు లేనేలేరు.

‘‘మేం ఏ టెక్స్ట్ బుక్‌లో కూడా ఒక్క నల్లజాతి మహిళా సైంటిస్టు గురించి కూడా చూడలేదు’’ అని పరిశోధకుల్లో ఒకరైన అలబామాలోని ఓబర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సిసీ బేలెన్ అన్నారు.

అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జీవ శాస్త్ర పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తల పేర్లను ఈ అధ్యయన బృందం పరిశీలించింది.

వారిలో ఒక్కరు కూడా నల్ల జాతి మహిళ లేరని తేల్చింది.

చార్లెస్ డార్విన్, గ్రెగర్ మెండల్ నుంచి ఇప్పటి తరం శాస్త్రవేత్త జేన్ గూడాల్ వరకు వెయ్యి మందికిపైగా శాస్త్రవేత్తల ప్రస్తావన ఈ పుస్తకాల్లో ఉంది.

ఈ మొత్తం శాస్త్రవేత్తల్లో 13 శాతం మహిళలున్నారు. అయితే, వారంతా శ్వేతజాతి మహిళలే. ఆసియన్లు, మైనారిటీలు, నల్లజాతి పురుష శాస్త్రవేత్తలు 6.7 శాతం మంది ఉన్నారు.

గతం కంటే ఇప్పుడు కొంత నయమని.. ఇప్పుడు మహిళలు, ఆసియా పురుష శాస్త్రవేత్తలకు చోటు దొరికిందని డాక్టర్ బేలెన్ అన్నారు.

అయినప్పటికీ అలా చోటు దక్కించుకున్న శాస్త్రవేత్తలు కనీసం ఆ పాఠాలు వినే వర్గాలకు కూడా ప్రతినిధులుగా లేరని.. ముఖ్యంగా ఆసియా, హిస్పానిక్ ప్రజలకు ఇది వర్తిస్తుందని అన్నారు. అయితే... నల్లజాతి మహిళ శాస్త్రవేత్తల ప్రాతినిధ్యమే పూర్తిగాలేదు.. దాంతో పోల్చితే ఇది కొంత నయమని అభిప్రాయపడ్డారు.

‘‘పాఠ్య పుస్తకాల ప్రచురణకర్తలు అభ్యాసకుల్లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చారిత్రక, సమకాలీన విజ్ఞాన శాస్త్రం మధ్య సమతుల్యతకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారామె.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో సమానత్వం, భిన్నత్వం, సమ్మిళితంపై హానరరీ రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్న డాక్టర్ రెహ్మా ఎల్మాది దీనిపై మాట్లాడుతూ బ్రిటన్‌లో పరిస్థితులూ అలాగే ఉన్నాయన్నారు. టెక్స్ట్ బుక్స్, ఇతర లెర్నింగ్ మెటీరియల్స్‌లో ప్రస్తావించే సైంటిస్టులంతా ఎక్కువగా శ్వేతజాతీయులు, పురుషులేనని... చివరకు క్లాస్ రూంలో ఉండే విద్యార్థుల్లో భిన్నత్వాన్ని కూడా కనీసం ఈ పుస్తకాల్లో ప్రతిబింబించలేకపోతున్నారని అన్నారు.

‘‘ఈ అసమానత్వాన్ని రూపుమాపేందుకు చర్యలు ప్రారంభించాలి. లేదంటే తరువాత తరాల్లోని ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకూ సరైన స్థానం దొరకదు’’ అన్నారు బేలెన్.

ఇక విద్యార్థుల విషయానికొస్తే అమెరికాలో బయాలజీలోనే ఎక్కువగా అమ్మాయిలు చదువుతున్నారు. ఫిజిక్స్ వంటి ఇతర సైన్స్ సబ్జెక్టులతో పోల్చితే బయాలజీ చదివే అమ్మాయిల శాతం ఎక్కువ. బయాలజీలో 60 శాతం మహిళలే ఉంటున్నారు. కానీ, బయాలజీ పుస్తకాల్లో పేర్కొనే శాస్త్రవేత్తల్లో మాత్రం అత్యధికులు పురుషులే. 13 శాతమే మహిళలున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)