లాక్‌ డౌన్ సడలిస్తే మనకు ముప్పు తప్పదా

    • రచయిత, డేవిడ్ షుక్మన్
    • హోదా, సైన్స్ ఎడిటర్

జన సమ్మర్థంగా ఉండే రెస్టారెంట్లు, ఆఫీస్ స్థలాలలో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఎంత వరకు ఉంటుందనే అంశం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి అయ్యే కారణాల గురించి అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువగా ఉంది.

రోజు రోజుకీ సైన్స్ అందిస్తున్న సమాచారం అనేక కొత్త సందేహాల్ని లేవనెత్తుతోంది.

వ్యాపారాలు, పబ్ లు తెరవాలని వివిధ వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో వైరస్ వ్యాప్తి గురించి మరింత అధ్యయనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, ప్రభుత్వం విధించిన నిబంధనల అమలు పట్ల ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తోంది.

వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన అంశాలు ఏమిటి?

అన్నిటి కంటే ముఖ్యమైన అంశం దూరం పాటించడం.

ఎవరైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ వెలువడే తుంపరలు ఒక మీటర్ దూరం వరకు విస్తరిస్తాయని 1930 లలో జరిగిన వైద్య అధ్యయనాలు పేర్కొన్నాయి. దాని ఆధారంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ సామాజిక దూరం పాటించడానికి ఒక మీటర్ దూరం పాటించాలనే నియమాన్ని ప్రచారం చేసింది.

మనిషికి మనిషికీ మధ్య ఎంత దూరం పాటిస్తే అంత సురక్షితమని చెబుతున్నప్పటికీ దూరమొక్కటే వైరస్ వ్యాప్తిని అరికట్టలేదు.

ఒక వ్యక్తితో ఎంత సేపు దగ్గరగా ఉన్నారనేది రెండవ ముఖ్యమైన అంశం.

కరోనావైరస్ సోకిన రోగితో రెండు మీటర్ల దూరంలో ఉంటూ ఒక నిమిషం పాటు ఉంటే ఎంత ముప్పో, ఒక మీటర్ దూరంలో ఉండి ఆరు సెకండ్ల పాటు ఉంటే కూడా అంతే ముప్పని యు కె ప్రభుత్వం చెబుతోంది.

ఒక వ్యక్తితో దూరంగా మెలగడం సాధ్యం కానప్పుడు 15 నిమిషాలకి మించి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండకూడదని సూచిస్తోంది.

దూరం,సమయంతో పాటు, గాలి వెలుతురు కూడా మరొక ముఖ్యమైన అంశం .

బహిరంగ ప్రదేశాలలో వైరస్ తొందరగా గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలా అని వైరస్ వ్యాప్తి చెందదని నియమం ఏమీ లేదు.

యు కె ప్రభుత్వం మనిషికి మనిషికీ మధ్య కనీసం 2 మీటర్ల దూరం పాటించమని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడవద్దని సూచిస్తోంది.

గాలి రాని ప్రదేశాలలో ఎక్కువ మంది మనుషులతో కలిసి ఎక్కువ సమయం గడపటం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.

రెస్టారెంట్లలో ఉండే ముప్పు ఏమిటి?

చైనాలో గువాంగ్ ఝౌలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వైరస్ వ్యాప్తి పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

గువాంగ్ ఝౌ లోని ఒక రెస్టారెంట్లో గత జనవరిలో ఒక మీటర్ దూరంలో కూర్చుని కొంత మంది విందు తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తికి కరోనావైరస్ ఉన్న విషయం తెలియలేదు.

కానీ, అదే రెస్టారంట్లో కొన్ని మీటర్ల దూరంలో కూర్చుని ఉన్న మరో 9 మంది మరి కొన్ని రోజుల్లోనే కరోనావైరస్ బారిన పడ్డారు.

అయితే, కరోనావైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడిన తుంపరలు ఏసి ద్వారా ప్రయాణించి వ్యాప్తికి కారణమయ్యాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఏసి నుంచి ప్రవహించిన గాలి వలనే వైరస్ వ్యాప్తి చెందిందని ఈ అధ్యయనం తెలిపింది.

ఇదొక్కటే వైరస్ వ్యాప్తికి కారణం అని చెప్పలేకపోయినప్పటికీ ఇదొక మార్గం అని మాత్రం చెప్పవచ్చు.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న చోట కేవలం టేబుళ్ల మధ్య దూరం పాటిస్తే సరిపోదు.

గాలి వెలుతురు ప్రభావం గురించి మనకేమి తెలుసు?

భవంతులలో ఉండే సూక్ష్మ జీవుల నుంచి వచ్చే ముప్పు గురించి తెలుసుకునేందుకు ఒరెగాన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు రెస్టారెంట్లలో వెలుతురు వచ్చే వివిధ విధానాల పై అధ్యయనం చేశారు.

రెస్టారంట్లో ఒక మూలన కూర్చుని నోటికి ముక్కుకి అడ్డు పెట్టుకోకుండా ఒక వ్యక్తి దగ్గారు. ఆ వ్యక్తి నుంచి వెలువడిన తుంపరలు ఎక్కువగా తనకి దగ్గర్లో ఉన్న టేబుల్ మీద పడ్డాయి.

కానీ, కొన్ని చిన్న తుంపరలు గదిలో ఉన్న ఏసి మెషిన్ ని చేరి ఏసి నుంచి వచ్చే గాలితో గది అంతా విస్తరించాయి.

ఇలాంటి పరిస్థితే గువాంగ్ఝౌ రెస్టారెంట్లో కూడా జరిగి ఉంటుంది.

వైరస్ ఇలాగే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం పూర్తిగా నిర్ధరించలేక పోయినప్పటికీ, ఇలా జరిగితే ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వైరస్ బారిన పడే ముప్పు అయితే మాత్రం ఉంది.

రెస్టారెంట్లని సురక్షితంగా మార్చడం ఎలా?

ఒక తెరిచిన కిటికీ దగ్గర కూర్చుని దగ్గితే ఏమవుతుందనే అంశం పై కూడా ఈ బృందం అధ్యయనం చేసింది.

ఇలాంటి స్థితిలో తుంపరలు నేరుగా కిటికీ లోంచి బయటకి వెళ్లినట్లు గుర్తించారు.

స్వచ్ఛమైన గాలిలో ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అధ్యయనకర్తలు భావించారు.

వైరస్ తో ఉన్న ముప్పు నుంచి పూర్తిగా తప్పించుకోవడం సాధ్యమయ్యే పని కాదని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వాన్ డెన్ వై మె లె న్ బెర్గ్ చెప్పారు.

మనం ఉండే ప్రదేశాలని సురక్షితంగా చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోగలమని ఆయన అన్నారు.

కిటికీల నుంచి గాలి వచ్చేటట్లు చేయడమే కాకుండా, ఫిల్టర్లను వాడి గాలిని శుభ్రపరుచుకునేలా చేసుకోవచ్చని అన్నారు.

విమానాలలో ఎంత వరకు సురక్షితం?

విమానం సగం ఖాళీగా ఉంటే తప్ప సామాజిక దూరం పాటించడం కుదరదు. అలాగే 15 నిమిషాల కన్నా తక్కువ సేపు కలిసి ఉండటం కూడా సాధ్యం కాని పని.

విమానాలలో వైరస్ ముప్పు ఎక్కువ. అక్కడ ఎవరైనా దగ్గినా ఆ తుంపరలు అదే ప్రదేశంలో చిక్కుకుని ఉంటాయి.

ఆధునిక విమానాలలో ప్రతి కొన్ని నిమిషాలకి కేబిన్ లోపల ఉండే గాలిని శుభ్రపరుస్తూ ఉంటారు.

పని స్థలాలలో పొంచి ఉన్న ముప్పు ఏమిటి?

ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో సామాజిక దూరం పాటించడం కష్టం.

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని లీసెస్టర్ లో వైరాలజీ నిపుణుడు తెలిపారు.

మీ స్నేహితుని దగ్గర నుంచి వచ్చే ఉల్లిపాయ, వెల్లుల్లి వాసనని మీరు పీల్చగలుగుతున్నట్లైతే వారు వదులుతున్న శ్వాసని మీరు పీలుస్తున్నట్లే అర్ధం.

అలాంటి పరిస్థితుల్లో గాలిలో ఉన్న ఎటువంటి వైరస్ అయినా మీరు పీల్చే ప్రమాదం ఉంది.

వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపరలు, చేతుల ద్వారా ముక్కు, నోరు, కంటిలోకి వెళ్ళినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. దీని ఆధారంగానే సామాజిక దూరం అనే నియమాన్ని అమలు చేశారు.

వైరస్ వ్యాప్తి చెందడానికి రెండవ మార్గం ఉపరితలాలు. వైరస్ సోకిన వ్యక్తితో చేతులు కలపడం వలన కానీ, కిచెన్ గట్ల పై చేతులు పెట్టడం వలన కానీ కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

అందుకే చేతులు కడుక్కోవడం తప్పని సరి.

మూడవ మార్గం: ఈ తుంపరలు మాట్లాడుతున్నప్పుడు గాలి ద్వారా ప్రయాణించి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం కూడా ఉంది.

ఇదంతా చూస్తుంటే సురక్షితంగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఏమి లేదని అర్ధం అవుతోంది. సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తులతో ఎక్కువ సేపు సమయం గడపకుండా , గాలి వెలుతురు వచ్చే ప్రదేశాలలో ఉండటం మేలని అర్ధం అవుతోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)