ట్రంప్, కిమ్ భేటీ: నకిలీ కిమ్‌ను దేశం నుంచి బహిష్కరించిన వియత్నాం

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్-ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య ఈ వారం హనోయ్‌లో శిఖరాగ్ర సదస్సు జరిగే ముందు కిమ్‌ను పోలిన వ్యక్తిని వియత్నాం తమ దేశం నుంచి బహిష్కరించింది.
కిమ్‌లా కనిపించే హాంకాంగ్ వాసి హోవర్డ్ ఎక్స్, ట్రంప్‌ను పోలిన రస్సెల్ వైట్‌తో కలిసి గత వారం హనోయ్‌లో ఒక నకిలీ సమ్మిట్ నిర్వహించారు.
తర్వాత వియత్నాం పోలీసులు ఇద్దరినీ ప్రశ్నించారు. రాజకీయ వ్యంగ కార్యక్రమాలు కట్టిపెట్టాలని సూచించారు.
అప్పటి నుంచి అధికారులు తన 'వీసా' చెల్లదని చెప్పారని, కానీ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని హోవర్డ్ మీడియాకు చెప్పారు.
కిమ్ జాంగ్-ఉన్ లాగే నల్ల సూట్, నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న హోవర్డ్ ఎక్స్ "నియంతృత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యం అనేది శక్తివంతమైన ఒక ఆయుధం లాంటిది. అసలు మనుషుల్లాగే ఉన్న కొందరిని చూసి వాళ్లు భయపడిపోతున్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నకిలీ నేతల నకిలీ సదస్సు
ఆయన, ట్రంప్‌లాగే కనిపించే వైట్‌తో కలిసి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఒక నకిలీ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
"ఉత్తర కొరియా అణ్వాయుధ ఆకాంక్షలను తగ్గించాలనేదే మా ఉద్దేశం" అని మీడియాకు చెప్పారు.
"సంభాషణల ద్వారా, చర్చల ద్వారా మేం శాంతి కోసం పనిచేస్తున్నాం. మేం ఉత్తర కొరియాకు సాయం కూడా చేయాలనుకుంటున్నాం" అని కెనెడా వాసి అయిన వైట్ విలేకరులతో అన్నారు. ఆయన డోనల్డ్ ట్రంప్‌లాగే దుస్తులు ధరించారు.
ఇటు "ఆయన నా అణు క్షిపణులను పట్టించుకోకుండా, మాపై ఆంక్షలు ఎత్తివేస్తారనే ఆశిస్తున్నాను" అని కిమ్ వేషంలో ఉన్న హోవర్డ్ ఎక్స్ అన్నారు. పూర్తి స్థాయిలో కిమ్, ట్రంప్‌ను అనుకరించే ఇద్దరూ గత ఏడాది సింగపూర్‌లో ట్రంప్-కిమ్ మధ్య మొదటి శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు అక్కడికి కూడా వెళ్లారు.
తర్వాత ఈ ఇద్దరూ ఒక స్థానిక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర కొరియాపై వ్యతిరేకత
"ఇద్దరూ అగ్ర నేతలను అనుకరించడం మానాలని, అనుమతించిన ప్రదేశాల్లో ఎస్కార్ట్‌తో మాత్రమే ప్రయాణించాలని" వియత్నాం పోలీసులు వారికి చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
"కిమ్ జాంగ్-ఉన్‌లా కనిపించేలా పుట్టడమే, నేను చేసిన నేరమా" అని హోవర్డ్ ప్రశ్నించారు.
"ఉత్తర కొరియా నేతకు 'సెన్సాఫ్ హ్యూమర్' లేదు కాబట్టే తనను దేశ బహిష్కరణ చేసినట్లు" భావిస్తున్నట్టు తెలిపారు.
కిమ్‌లా కనిపించే ఈయన గత ఏడాది అమెరికా-ఉత్తర కొరియా మధ్య తొలి శిఖరాగ్ర సదస్సు జరిగిన సమయంలో కూడా ఇలాంటి కొన్ని వ్యంగ్య కార్యక్రమాలు చేశారు.
దక్షిణ కొరియాలో 2018 శీతాకాల ఒలింపిక్స్ సమయంలో ఉత్తర కొరియా చీర్ లీడర్స్ ముందు నృత్యం చేస్తున్నందుకు హోవర్డ్‌ను సెక్యూరిటీతో బయటకు పంపించారు.
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్-ఉన్ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హనోయ్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఈ చర్చల్లో అణ్వాయుధ కార్యక్రమాన్ని విడిచిపెట్టేలా ఉత్తర కొరియాను ఒప్పించడంపై దృష్టి పెడతారని భావిస్తున్నారు.
గత ఏడాది జూన్‌లో వీరి మధ్య జరిగిన తొలి శిఖరాగ్ర సదస్సు ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేపింది. కానీ దీని వల్ల చాలా తక్కువ పరిమాణాలు కనిపించాయి.
అణునిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామని రెండు పక్షాలూ చెబుతున్నా, దీనిని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలా ధ్రువీకరిస్తారు అనే దానిపై ఎవరూ ఎలాంటి వివరాలూ ఇవ్వడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్, కిమ్ భేటీ: వియత్నాంలో ఫిబ్రవరి 27న రెండో సమావేశం
- బంగ్లాదేశ్ విమానం 'హైజాకర్'ను కాల్చి చంపిన సాయుధ బలగాలు
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు?
- సెక్స్‌కు గుండెపోటుకు సంబంధముందా?
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








