ఆస్ట్రేలియా రైలు.. డ్రైవర్‌ లేకుండా 92 కిలోమీటర్లు వెళ్లింది

డ్రైవర్ లేకుండా ప్రయాణించిన గూడ్స్

ఫొటో సోర్స్, BHP

ఆస్ట్రేలియాలో డ్రైవర్ లేకుండా 92 కిలోమీటర్లు వెళ్లిన ఒక గూడ్స్ రైలును అధికారులు పట్టాలు తప్పించారు.

మైనింగ్ దిగ్గజ సంస్థ బి.హెచ్.పికి చెందిన ఈ గూడ్స్ రైలును ఐరన్ ముడి ఖనిజాన్ని తరలించడానికి సిద్ధం చేశారు.

అయితే సోమవారం డ్రైవర్ లేకుండా ఈ రైలు 50 నిమిషాలపాటు ప్రయాణించింది.

పెనుప్రమాదాన్ని నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, పెర్త్ నగరం నుంచి రైలు పట్టాలు తప్పేలా చేయగలిగామని బి.హెచ్.పి సంస్థ తెలిపింది.

''ప్రయాణానికి ముందు, డ్రైవర్ రైలును తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలోనే రైలు కదిలింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు పట్టాలు తప్పింది'' అని ఆస్ట్రేలియా రవాణా భద్రతా సంస్థ తెలిపింది.

ఈ సంఘటనపై ఆస్ట్రేలియా రవాణా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

బి.హెచ్.పి. ఐరన్ ఓర్ సంస్థ రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బి.హెచ్.పి. ఐరన్ ఓర్ సంస్థ రైలు ఫైల్ ఫోటో

ఆ సంస్థకు చెందిన న్యూమ్యాన్ మైన్స్ నుంచి పోర్ట్ హెడ్‌ల్యాండ్‌కు వెళ్లేందుకు రైలును సిద్ధం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని బీహెచ్‌పీ సంస్థ తెలిపింది.

గమ్యానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉండగానే రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలుతోపాటు 1.5 కిలోమీటర్ల మేర పట్టాలు కూడా దెబ్బతిన్నాయి.

ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని అధికారుల అంచనా. ఈ రైలు ప్రయాణించిన ప్రాంతంలో జనాభా తక్కువగానే ఉంటుంది. రైలు పట్టాలు కూడా బీహెచ్‌పీ సంస్థ సొంతంగా వేసినవే!

ఈ సంఘటన ఆందోళన కలిగిస్తోందని ఆస్ట్రేలియా మంత్రి మార్క్ మెక్ గోవన్ అన్నారు.

''ఈ ఘటనపై బీహెచ్‌పీ సంస్థ సమీక్ష చేస్తుందని అనుకుంటున్నా. కానీ ఈ అంశంలో ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉండొచ్చా అని తెలుసుకుంటా'' అని మంగళవారం ఆయన అన్నారు.

తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించడానికి ఓ వారం రోజులు పట్టేలావుందని మైనింగ్ సంస్థ తెలిపింది.

బీహెచ్‌పీ ప్రధాన పోటీదారు సంస్థ రియో టిన్టో.. ప్రపంచంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైవర్ రహిత గూడ్స్ రైలును నడిపిన మొదటి సంస్థ మేమేనని జూలైలో ప్రకటించింది!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)