ఫేక్‌ న్యూస్‌పై పాకిస్తాన్ ఎలా పోరాడుతోంది?

ఫేక్ న్యూస్

ఇంటర్నెట్ విస్తరణ, సోషల్ మీడియాకు ఆదరణ పెరుగుతుండటంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా జనం సమాచారం పంచుకోవటానికి, అభిప్రాయాలు వ్యక్తంచేయటానికి అవకాశం అందివచ్చిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.

కానీ సోషల్ మీడియా వేదికలు విపరీతంగా వ్యాప్తిచెందటం వల్ల కొన్ని సవాళ్లు కూడా పుట్టుకొచ్చాయి. ఫేక్ న్యూస్ (బూటకపు వార్తలు)ను గుర్తించటం అందులో ఒకటి.

కఠినమైన సైబర్ చట్టాలు ఉన్నా కూడా.. దీనిని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందా? బీబీసీ ఇండియా ప్రతినిధి షుమైలా జాఫ్రీ కథనం...

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

మాలీకా బొఖారీ పాకిస్తాన్ ఎంపీ. కొన్ని వారాల కిందట ఆమె లక్ష్యంగా ఒక ఫేక్ న్యూస్ ప్రచారమైంది.

ఓ కీలక పదవిలో ఆమెను నియమించటానికి కారణం ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ సన్నిహిత మిత్రుడొకరికి ఆమె సోదరి కావటమేనన్నది ఆ ఫేక్ న్యూస్ సారాంశం. మాలీకా ఖండించినా దానిని ఎవరూ పట్టించుకోలేదు.

''మహిళను కాబట్టి అది నన్ను చాలా బాధపెట్టింది. నేను ఎన్నడూ మహిళ అనే కార్డును ఉపయోగించను. జనం మహిళల గురించి మాట్లాడేటపుడు ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారు. అది చాలా బాధపెడుతుంది'' అని మాలీకా బొఖారి బీబీసీతో పేర్కొన్నారు.

మాలీకా ఘటన తర్వాత పాకిస్తాన్ సమాచార మంత్రిత్వశాఖ.. ఫేక్ న్యూస్‌ను గుర్తించటం కోసం ఒక ట్విటర్ అకౌంట్‌ను క్రియేట్ చేసింది.

ఫేస్‌బుక్ చూస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

కానీ.. దీనిని క్రియేట్ చేసిన కొన్ని గంటలకే ఈ ట్విటర్ అకౌంట్‌ను అనుకరిస్తూ ఫేక్ అకౌంట్ ట్విటర్‌లో ప్రత్యక్షమైంది. దీంతో సమాచార మంత్రిత్వశాఖ ఖండనను జారీచేయాల్సి వచ్చింది.

సమాచార మంత్రిత్వశాఖ సైబర్ విభాగం ఆ అకౌంట్‌ను నిర్వహిస్తోంది. కొన్ని రోజుల్లేనే వేలాది మంది ఆ అకౌంట్‌ను ఫాలో అయ్యారు. కానీ ఇప్పటివరకూ ఇది ఎటువంటి ఫేక్ న్యూస్‌నూ గుర్తించలేదు.

ప్రధానమంత్రి గురించి, తమ ప్రభుత్వం గురించి వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించి చెప్పటానికే అది పరిమితమైంది.

''ప్రివెన్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ చట్టం ఇప్పటికే అమలులో ఉంది. అయినా చాలా మంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. కొందరికి తాము చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని తెలియదు. కానీ ఒక బృందం ఇలా చేస్తోందంటే.. ఏవో ఉద్దేశాలున్నట్టే'' అని సైబర్ విభాగం డీజీ జహంగీర్ ఇక్బాల్ చెప్పారు.

వాట్సాప్

ఫొటో సోర్స్, Reuters

ఇక ముహమ్మద్ సొహాయిబ్ ఓ జర్నలిజం విద్యార్థి. అతడు గత ఏడాది.. పనామా కేసులో నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా ఒక బూటకపు తీర్పును సృష్టించి తన స్నేహితులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో దానిని షేర్ చేశాడు.

అది సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందంటే.. ప్రధాన స్రవంతిలోని టీవీ చానళ్లు కూడా వాస్తవ తీర్పుకు బదులుగా ఈ నకిలీ తీర్పునే తమ చానళ్లలో చూపించాయి.

''పలు టీవీ చానళ్లు దీనిని బాహాటంగా చూపించాయి. చాలా మంది వ్యాఖ్యాతలు దీనిని చదివారు. కొన్ని కార్యక్రమాల్లో న్యాయవాదులు సైతం దీనిని విశ్లేషించారు. కానీ ఇది నకిలీదని గుర్తించలేకపోయారు'' ముహమ్మద్ సోహాయిబ్ బీబీసీ ప్రతినిధికి వివరించారు.

కంప్యూటర్ మౌస్

పాకిస్తాన్‌లో ఫేక్ న్యూస్ అనేది ఒక తీవ్ర సమస్య అని మీడియా డెవలప్‌మెంట్ సంస్థలు భావిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి దీనికి ఏ పరిష్కారమూ లేదు. దీని గురించి మెయిన్‌స్ట్రీమ్ జర్నలిస్టులకు కూడా అవగాహన లేదు.

''ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియదు. కానీ ఆ పరిష్కారం ఈ రంగం లోపలి నుంచే రావాలి. ఒకవేళ బయటి నుంచి.. అంటే ప్రభుత్వం నుంచి పరిష్కారం వస్తే.. అది జర్నలిజాన్ని దెబ్బతీస్తుంది'' అని మీడియా మేటర్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ సదాఫ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

దేశంలో సెన్సార్‌షిప్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఫేక్‌న్యూస్‌ని సక్రమంగా నిలువరించలేకపోతే.. ప్రభుత్వం దానిని సాకుగా వాడుకుని సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించే అవకాశముందని పాకిస్తాన్‌లోని మీడియా ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)