పిట్స్‌బర్గ్ కాల్పులు: ట్రంప్ పర్యటనలో అడగడుగునా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శనివారం ఒక ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో 11 మంది యూదులు చనిపోయిన యూదుల ప్రార్థనా మందిరాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. ట్రంప్‌తో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, వారి కుమార్తె, అల్లుడు కూడా ఉన్నారు.
పిట్స్‌బర్గ్ లోని ట్రీ ఆఫ్ లైఫ్ ఆలయం వద్ద వందలాది మంది నిరసనకారులు చేరి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ ఊచకోత మృతులకు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు.
ట్రంప్ కుటుంబాన్ని యూదు మతగురువు జెఫ్రీ మేయర్స్ ఆహ్వానించి మందిరంలోకి తీసుకెళ్లారు. ఇక్కడ శనివారం జరిగిన దాడి అమెరికా చరిత్రలోనే యూదులకు వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద దాడిగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ కుటుంబంతో ఇంకా ఎవరున్నారు?
డోనల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా ఉన్నారు. కుష్నర్ యూదు మతస్తుడు కాగా.. ఆయనను వివాహమాడిన తర్వాత ఇవాంకా కూడా యూదు మతానికి మారారు. వీరిద్దరూ అధ్యక్ష భవనంలో సలహాదారులుగా ఉన్నారు.
ట్రంప్ సర్కారులోని ట్రెజరీ మంత్రి స్టీవెన్ ముంచిన్ కూడా యూదు మతస్థుడే. ఆయన కూడా ట్రంప్‌తో పాటు ట్రీ ఆఫ్ లైఫ్ ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు.
ఈ పర్యటనకు ముందు ట్రంప్, యూదు వ్యతిరేకతను ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిరసనలు ఎందుకు?
ట్రంప్ తన విభజనవాద ప్రసంగాలతో శ్వేత జాతీయవాదాన్ని, నయా నాజీ కార్యకలాపాలను రెచ్చగొడుతున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు వలస వచ్చే వారి మీద, ప్రత్యేకించి ముస్లింల మీద ట్రంప్ తరచుగా విమర్శలు గుప్పిస్తుంటారు.
యూదు ప్రార్థనా మందిరాన్ని ట్రంప్ సందర్శించటాన్ని కొందరు యూదు ప్రముఖులు, పిట్స్‌బర్గ్ నగర మేయర్, యూదు మతస్థుడు బిల్ పెడుటో వ్యతిరేకించారు.
దేశాధ్యక్షుడు ట్రంప్ ‘‘శ్వేత జాతీయవాదాన్ని పూర్తిగా ఖండించనిదే’’ ఆయనను పిట్స్‌బర్గ్ నగరంలోకి ‘‘ఆహ్వానించబోం’’ అని ఆ ప్రాంతానికి చెందిన యూదు నేతలు రాసిన బహిరంగ లేఖ మీద 70,000 మందికి పైగా ప్రజలు సంతకం చేశారు.

ఫొటో సోర్స్, EPA
పెన్సిల్వేనియాలో ట్రంప్‌తో కలిసి పర్యటనలో పాల్గొనాల్సిందిగా అధ్యక్ష భవనం పంపిన ఆహ్వానాన్ని రిపబ్లికన్, డొమెక్రటిక్ అగ్రస్థాయి కాంగ్రెస్ నాయకులు నలుగురు తిరస్కరించారు.
పిట్స్‌బర్గ్ కాల్పుల విషయంలో వచ్చిన విమర్శలను అధ్యక్ష భవనం కొట్టివేసింది.
ట్రంప్ సందర్శనకు వ్యతిరేకంగా పిట్స్‌బర్గ్ యూదు సమాజానికి చెందిన వారితో సహా దాదాపు 2,000 మంది నిరసన ప్రదర్శన చేపట్టారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
అధ్యక్షుడు పిట్స్‌బర్గ్‌లో కారులో ప్రయాణిస్తుండగా.. రోడ్ల పక్కన ఉన్నవారు ఆయనకు అసభ్యకర సంజ్ఞలు, బొటనవేలు కిందికి చూపుతూ నిరసనలు తెలిపారని ఏపీ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.
ట్రంప్ యూదు ప్రార్థనా మందిరం వద్దకు చేరుకున్నపుడు ‘‘విద్వేష అధ్యక్షుడా.. మా రాష్ట్రం నుంచి వెళ్ళిపో’’ అంటూ... ‘‘పదాలకు అర్థాలుంటాయి’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, EPA
‘‘మేం వారధులు కడతాం.. గోడలు కాదు’’ అని, ‘‘ట్రంప్.. తక్షణమే శ్వేత జాతీయవాదాన్ని తృణీకరించు’’ అని, ‘‘ట్రంప్ అబద్ధాలు చంపేస్తాయి’’ అనే నినాదాలతో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు.
నిరసనకారుల్లో ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఒక మహిళ.. ట్రంప్ వచ్చినపుడు ఆయనను ఉద్దేశించి ‘‘మేం నిన్ను ఇక్కడికి ఆహ్వానించలేదు’’ అని గట్టిగా అరవటం విలేకరులు చూశారు.
ఎవరి అంత్యక్రియలు జరిగాయి?
ఊచకోత మృతుల్లో నలుగురి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.
వారిలో డేవిడ్ (54), సిసిల్ రోసెన్థాల్ (59) ఉన్నారు. సోదరులైన వీరిద్దరూ మృతుల్లో పిన్న వయస్కులు.

ఫొటో సోర్స్, Reuters
డానియెల్ స్టీన్ (71), జెర్రీ రబినోవిట్జ్ (66)లకు కూడా అంత్యక్రియలు పూర్తిచేశారు.
యూదు ప్రార్థనా మందిరం పునర్నిర్మాణానికి, మృతుల కుటుంబాలకు మద్దతు అందివ్వటానికి.. పిట్స్‌బర్గ్ సమాజంతో ఎటువంటి సంబంధం లేని ఒక ఇరానీ శరణార్థి ఏర్పాటుచేసిన ‘గోఫండ్‌మి’ పేజి ఇప్పటికే 9,00,000 డాలర్లు సమీకరించింది. సదరు శరణార్థి వాషింగ్టన్ డీసీలో విద్యార్థిగా ఉన్నారు.
మృతుల అంత్యక్రియలకు అయ్యే ఖర్చులకు సాయం చేయటానికి ముస్లిం-అమెరికన్ గ్రూప్ ఏర్పాటుచేసిన సహాయ నిధికి 2,00,000 డాలర్ల విరాళం వచ్చింది.
అనుమానిత దుండగుడి విషయం ఏమిటి?
ఈ కాల్పులు జరిపిన నిందితుడు రాబర్ట్ బోవెర్స్ (46) ప్రస్తుతం అమెరికా మార్షల్స్ కస్టడీలో ఉన్నాడు. అతడు 29 క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
అతడికి తుపాకీ కాల్పుల వల్ల గాయాలవటంతో ఆస్పత్రిలో చికిత్స చేసి సోమవారం డిశ్చార్జి చేశారు.
తొలిసారి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టినపుడు.. ప్రభుత్వం నుంచి తన తరఫున న్యాయవాదిని నియమించాలని అతడు కోరినట్లు అమెరికా మీడియా తెలిపింది.
ఈ కేసులో నవంబర్ 1వ తేదీన పునర్విచారణ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం?
- పాకిస్తాన్: దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- హాలోవీన్‌ని తెలుగువాళ్లు ఎలా చేసుకుంటారు? - BBC Special
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








