చైనా: కారులో మహిళపై అత్యాచారం, హత్య.. కార్‌పూలింగ్ సేవలు నిలిపివేసిన సంస్థ

ఫొటో సోర్స్, Reuters
చైనాకు చెందిన అద్దె కార్ల సంస్థ 'డీడీ చషింగ్' కార్ పూలింగ్ సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళను డ్రైవర్ అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు చెప్పడంతో డీడీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
చైనాలోని వెంజూ నగరంలో శుక్రవారం 'డీడీ' కారు ఎక్కిన 20 ఏళ్ల యువతిపై డ్రైవరే అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంతకుముందు కూడా ఈ సంస్థకు చెందిన వాహనంలో ఇలాంటి ఘటన జరిగింది. మేలో 21 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్ ఒకరు జింగ్‌జూ నగరంలో డీడీ కారులో ప్రయాణిస్తూ అత్యాచారం, హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
తాజా ఘటనలో బాధితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో డీడీ కారెక్కింది. స్నేహితులకు మెసేజ్‌లు పంపించింది. కానీ, ఒక గంట తరువాత ఆమె ఫోన్‌లో అందుబాటులో లేకుండాపోయింది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో డ్రైవర్‌ను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జోంగ్ అనే ఆ డ్రైవర్ ప్రయాణికురాలిపై అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న జోంగ్‌కు ఇంతకుముందు నేరచరిత్రేమీ లేదని డీడీ సంస్థ చెబుతోంది. కానీ, గతంలోనూ ఒకసారి అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు అందిందని మాత్రం అంటోంది. ఒక ప్రయాణికురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేసి, అక్కడి నుంచి ఆమె వెంటపడ్డాడన్నది అతనిపై వచ్చిన ఫిర్యాదుగా సంస్థ తెలిపింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








