అమెరికా అధ్యక్షుడినే బురిడీ కొట్టించేశాడు

ఫొటో సోర్స్, Reuters
అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడడం మామూలు మనుషులకు సాధ్యపడుతుందా? అస్సలు కాదు.. కనీసం ఫోన్లో మాట్లాడాలన్నా అదేమంత సులభం కాదు.
కానీ, ఆ దేశానికి చెందిన కమెడియన్ ఒకరు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని బురిడీ కొట్టించి ఆయనతో ఫోన్లో సంభాషించారు.
ట్రంప్ కూడా ఏమాత్రం అనుమానించకుండా సెనేటర్ అనుకునే ఆ కమెడియన్‌తో మాట్లాడారట.

ఫొటో సోర్స్, Getty Images
మొదట ఎవరూ నమ్మలేదు
డొనాల్డ్ ట్రంప్ తన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తుండగా తాను ఫోన్ చేసి ఆయనతో మాట్లాడానంటూ అమెరికాకు చెందిన కమెడియన్ జాన్ మెలెండెజ్ ఇటీవల వెల్లడించారు.
తాను తొలుత అధ్యక్షుడి అల్లుడు జరేడ్ కుష్నర్‌కు ఫోన్ చేసి న్యూజెర్సీకి చెందిన డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ బాబ్ మెనెండెజ్‌లా మాట్లాడానని.. ఆ తరువాత అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని జాన్ చెప్పారు.
అయితే, ఆయన మాటలను ఎవరూ నమ్మకపోవడంతో తాజాగా ఆ ఆడియో రికార్డును ఆయన విడుదల చేశారు.
దీనిపై వైట్‌హౌస్ అధికారి ఒకరు స్పందించి ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కీలక విషయాలూ చర్చించారు
కాగా జాన్ బయటపెట్టిన ఆడియో రికార్డుల్లో ట్రంప్‌లా వినిపించిన గొంతు సెనేటర్ మెనెండెజ్‌ను అభినందించినట్లుగా ఉంది. గత ఏడాది మెనెండెజ్ ఒక లంచం కేసులో చిక్కుకోగా ఇప్పుడు దాన్నుంచి బయటపటినందుకు ఆయన్ను అభినందించినట్లుగా అందులో ఉంది.
అంతేకాదు.. వచ్చే నెలలో సుప్రీం కోర్టు నుంచి రాజీనామా చేయబోతున్న న్యాయమూర్తి ఆంథోనీ కెనడీ స్థానంలో ఎవరిని నియమిస్తే బాగుంటందనే విషయంలోనూ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.
పదిపదిహేను రోజుల్లో కొత్త జడ్జిని నామినేట్ చేస్తానని ట్రంప్ చెప్పినట్లుగా ఉంది.
బాబ్ మెనెండెజ్‌నంటూ తాను ఫోన్ చేసినప్పుడు ఎవరూ కనీసం అనుమానించలేదని.. బాబ్‌ది ఏ పార్టీ అని కానీ, ఎక్కడి సెనేటర్ అని కానీ అడిగి ఉంటే తాను చెప్పలేకపోయేవాడినని.. కానీ, ఎవరూ ఆ ప్రశ్న తనకు వేయకపోవడంతో బాబ్‌లా నటించి ట్రంప్‌తో మాట్లాడానని జాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








