ఫలించిన సెలబ్రిటీ కిమ్ జోక్యం.. ఖైదీకి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
క్షమాభిక్ష కోసం ఆమె నాలుగేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. 22 ఏళ్ల జైలు జీవితం నుంచి విముక్తి దొరికింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్షకు అంగీకారం తెలపడంతో ఆమె తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకోగలిగింది.
ఈ మొత్తం వ్యవహారంలో టెలివిజన్ నటి, సోషలైట్ కిమ్ కర్దాషియన్ పోషించిన పాత్ర ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది.
ఆమె దౌత్యమే ఈ 63 ఏళ్ల వృద్ధ ఖైదీ అలైస్ మేరీ జాన్సన్‌ను తిరిగి ఇంటికి చేరుకునేలా చేసింది.

ఫొటో సోర్స్, CAN-DO CLEMENCY
అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన అలైస్ మేరీ జాన్సన్ 1996లో మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యారు.
కొకైన్ సరఫరా చేస్తున్న ముఠాలో పనిచేసిన ఆమెను, మరో 15 మందిని అరెస్టు చేశారు. ఆరోపణలు రుజువవడంతో ఆమెకు జీవితఖైదు విధించారు.
జైలులో క్రమశిక్షణతో మెలిగిన ఆమె బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్షమాభిక్ష కోసం అభ్యర్థించి విఫలమయ్యారు. ఇప్పుడు ట్రంప్ హయాంలోనూ ఆమె క్షమాభిక్ష కోసం ప్రయత్నించారు.
'కెన్ డు' అనే సంస్థ ఆధ్వర్యంలో అలైస్ కుటుంబసభ్యులూ ఆమె క్షమాభిక్ష కోసం పోరాటం సాగించారు.

ఫొటో సోర్స్, Reuters
కిమ్ కర్దాషియన్ పాత్రేంటి?
తల్లి కోసం తల్లడిల్లుతున్న అలైస్ ఇద్దరు కుమార్తెలు సోషల్ మీడియా వేదికగా తరచూ ఈ కేసును ప్రస్తావించేవారు.
ఈ క్రమంలోనే అలాంటి అలైస్ కేసుకు సంబంధించిన వీడియో ఒకటి కిమ్ దృష్టిలో పడింది. ఆమె కూడా 'కెన్ డు' నేతృత్వంలో సాగుతున్న ఈ క్షమాభిక్ష పోరాటంలో పాలుపంచుకున్నారు.
ఆమె తన న్యాయవాదితో కలిసి శ్వేతసౌధానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు.
అదే సమయంలో జైళ్ల సంస్కరణల కోసం ఎప్పటినుంచో పనిచేస్తున్న ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ ద్వారా ప్రయత్నాలు చేశారు.
ఇవన్నీ ఫలించి అలైస్ మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Twitter/Donald J.Trump
సిల్విస్టర్ స్టాలోన్ జోక్యంతో..
కాగా అలైస్‌కు క్షమాభిక్ష పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేరు కోసం, సెలబ్రిటీల మాటలు విని క్షమాభిక్ష పరిమితులు పాటించకుండా ట్రంప్ ఎడాపెడా ఆ ప్రత్యేక అధికారాన్ని వినియోగిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
ఇంతకుముందు సిల్విస్టర్ స్టాలోన్ జోక్యంతో హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ జాక్ జాన్సన్‌ను విడుదల చేయడాన్నీ ప్రస్తావిస్తున్నారు.
ఇవీ చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








