మూడు శతాబ్దాలకు సాక్షిగా నిలిచిన 117 ఏళ్ల తాజిమా ఇక లేరు!

ఫొటో సోర్స్, YOUTUBE
జపాన్‌కు చెందిన నబీ తాజిమా అనే బామ్మ సరిగ్గా 117 ఏళ్ల 261 రోజుల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఆమె జపాన్‌లో ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న కికాయి ద్వీపంలో ఉండేవారు.
ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఆమెను గుర్తించేవారు.
వైద్య నివేదిక ప్రకారం తాజిమా ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. గత జనవరి నుంచి ఆమె అందులో చికిత్స చేయించుకుంటున్నారు.
ఆమె పేరిట ఎన్నో రికార్డులున్నాయి. ఆసియాలో అతి ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఆమెది మూడో స్థానం.
గిన్నిస్ బుక్ రికార్డులలో 19వ శతాబ్దంలో జన్మించి 21వ శతాబ్దం వరకు జీవించి ఉన్న చివరి వ్యక్తిగా ఆమె పేరు నమోదై ఉంది.
అంటే తాజిమా తన జీవితకాలంలో మూడు శతాబ్దాలను చూశారన్నమాట. రికార్డుల ప్రకారం తాజిమా 1900 సంవత్సరంలో ఆగస్టు 4న జన్మించారు. 20వ శతాబ్దం అంతా ఆమె జీవించారు. 21వ శతాబ్దంలో ఆమె ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నారు.
జపాన్ మీడియాలో ప్రసారమైన వార్తల ప్రకారం, తాజిమా వారసుల మొత్తం సంఖ్య 160. వారిలో 28 మంది మనవలూ, మనవరాళ్లూ, 56 మంది మునిమనవలూ, మునిమనవరాళ్లూ.. వారి పిల్లలు 35 మంది ఉన్నారు.
తాజిమా తర్వాత జపాన్‌కే చెందిన చియో యోషిదా పేరిట ఎక్కువ వయసు వ్యక్తిగా రికార్డు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆమెతో సమాన వయసున్న వారెవ్వరూ లేరు. చియోకు ప్రస్తుతం 116 ఏళ్లు.
తాజిమా తన చివరి రోజుల్లో ఎక్కువ శాతం నిద్రపోతూ గడిపేవారని జపాన్ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది. చాలా కాలంగా ఆమె మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె రోజుకు మూడు పూటలా భోంచేసే వారు. జపాన్‌లో ఇలా సెంచరీ పూర్తి చేసిన వారు 67 వేల మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఇలా నూరు వసంతాల్ని పూర్తి చేసుకున్న వారు ఇంత ఎక్కువ సంఖ్యలో ఆసియాలోని మరే దేశంలోనూ లేరు. అందుకే జపాన్‌కు వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా పేరొచ్చింది.
65 లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వారు జనాభాలో 26 శాతం ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








