'సిరియా నుంచి వెనక్కి తగ్గొద్దని ట్రంప్‌ను ఒప్పించింది నేనే!'

ఫొటో సోర్స్, AFP
సిరియా నుంచి తమ సైనికులను వెనక్కి రప్పించొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒప్పించింది తానేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ అన్నారు. సిరియాలో సుదీర్ఘ కాలం పాటు ఉండాల్సిన అవసరం ఉందని తాను చెప్పానని ఆయన వెల్లడించారు.
త్వరలోనే సిరియా నుంచి అమెరికా వెనక్కి వచ్చేస్తుందని ట్రంప్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అందుకు భిన్నంగా, గత శనివారం బ్రిటన్, ఫ్రాన్స్‌లతో కలిసి అమెరికా సిరియాలో జరిగిన అనుమానిత రసాయన దాడులకు ప్రతీకారంగా సిరియా ప్రభుత్వ స్థావరాలపై దాడులు నిర్వహించింది.
మొన్నటి దాడులను కేవలం కొన్ని స్థావరాలకే కుదించాలని అమెరికాను తాను ఒప్పించినట్టు కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సరికొత్త ఆంక్షలకు రంగం సిద్ధం
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌తో సంబంధాలు నెరిపే రష్యన్ కంపెనీలపై ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది.
సోమవారం నాడు ఈ ఆంక్షల్ని ప్రకటిస్తామని యూఎన్‌లో అమెరికా దూత నిక్కీ హేలీ అన్నారు.
సిరియా నుంచి అమెరికా సైనికులను ఆరు నెలలలోగా వెనక్కి రప్పించాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్టుగా వచ్చిన వార్తలను కూడా నిక్కీ హేలీ ఖండించారు.
భవిష్యత్తులో సిరియా రసాయన ఆయుధాల్ని ప్రయోగించకుండా కట్టడి చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
సిరియా భూభాగంపై ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడానికీ, ఇరాన్ ప్రభావం పెరగకుండా అడ్డుకోవడానికి కూడా తమ దేశం కట్టుబడి ఉన్నట్టు ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా హెచ్చరిక
సిరియాలో పాశ్చాత్య శక్తులు మరిన్ని దాడులకు పాల్పడ్డయితే అది అంతర్జాతీయంగా కల్లోలానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూహానీతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ పుతిన్ పశ్చిమ దేశాల దాడుల ఫలితంగా సిరియాలో రాజకీయ పరిష్కారానికి అనువైన పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ఈ రెండు దేశాలు సిరియాకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









