కామన్వెల్త్ గేమ్స్: ఈ తెలుగు వాళ్లలో పతకాలు తెచ్చేదెవరు?

ఫొటో సోర్స్, Kidambi Srikant/Gagan Narang/PV Sindhu
- రచయిత, బీబీసీ
- హోదా, తెలుగు డెస్క్
2018 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన క్రీడాకారులు ఎవరెవరు? వారి గత రికార్డులు ఏమిటి?
21వ కామన్వెల్త్ క్రీడల సంబరాలు బుధవారం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
గురువారం నుంచి ఆటలు ప్రారంభం అవుతున్నాయి.
అందుకు 71 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.
భారత్ నుంచి మొత్తం 218 మంది (8 మంది పారా అథ్లెట్లతో కలిపి) ఆటగాళ్లు వెళ్లారు.
వీరిలో 13 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
భారత్ తరఫున కామన్వెల్త్ క్రీడల్లో తలపడనున్న ఆరుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఐదుగురు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారే.
ఒక్క అశ్వినీ పొన్నప్పది మాత్రమే బెంగళూరు.

ఫొటో సోర్స్, Getty Images
1. సింధు 'బంగారం' పట్టుకొచ్చేనా?
బ్యాండ్మింటన్‌లో ప్రపంచ నం. 3గా ఉన్న పీవీ సింధుపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది.
2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సింధు కాంస్యం గెలుచుకుంది.
2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించింది.
ఇప్పుడు గోల్డ్ కోస్ట్‌లో గోల్డ్ మెడల్ కొట్టేయాలన్న తపనతో ఉంది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సింధూ, గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/gettyimages
2. సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్)
2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా బంగారు పతకం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం సాధించింది.
2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుపొందింది.
అయితే, 2014లో గాయాల కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకుంది.
రియో ఒలింపిక్స్‌లోనూ గాయాల వల్లనే గెలవలేకపోయానని తెలిపింది. మోకాలికి శస్త్రచికిత్స కూడా చేయించుకుంది.
ఇప్పుడు మరోసారి బంగారు కలను నిజం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది సైనా.
ఈసారి అలాంటి సమస్య రాకుంటే, సైనా తీవ్రంగానే పోరాడే అవకాశం ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని జలాల్‌పూర్‌లో సైనా జన్మించారు. అయితే, ఆమె కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.
ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్నారు.
3. గద్దె రుత్విక శివానీ (బ్యాడ్మింటన్)
విజయవాడకు చెందిన 21 ఏళ్ల గద్దె రుత్విక ఈ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో తలపడనుంది.
2016: గువాహాటిలో జరిగిన సౌత్ ఏషియా క్రీడల్లో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ఓడించి బంగారు పతకం సాధించింది సంచలనం సృష్టించింది రుత్విక.
2016: ఉబెర్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.
ఈ యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ ఇప్పుడు ఈ క్రీడల్లో గోల్డ్ మెడల్‌కి గురిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈమె కూడా హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకుంది.

ఫొటో సోర్స్, twitter.com/sikkireddy
4. సిక్కి రెడ్డి(బ్యాడ్మింటన్)
ఈమె స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ.
2016: మిక్స్‌డ్ డబుల్స్‌లో బ్రెజిల్, రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలుచుకుంది.
2016 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో 2 బంగారు పతకాలు, ఒక రజతం సాధించింది.
కామన్వెల్త్‌లో రెండు విభాగాల్లో ఆడనుంది.

ఫొటో సోర్స్, GSFKidambiSrikanth/Facebook
5. కిదాంబి శ్రీకాంత్(పురుషుల బ్యాడ్మింటన్)
గుంటూరు జిల్లాకు చెందిన కిదాంబి శ్రీకాంత్ 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచాడు.
2014 కామన్వెల్త్ క్రీడల్లో, 2016 రియో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్‌ఫైనల్ నుంచే వెనుదిరిగాడు.
ఇతన్ని స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఇతను కూడా పుల్లెల గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నాడు.
6. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(పురుషుల బ్మాడ్మింటన్)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల సాత్విక్, చిరాగ్ శెట్టితో జతకట్టి ఓపెన్ అంతర్జాతీయ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
2017: గ్లాస్గో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఆడిన అనుభవం ఉంది.
2017లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన సుదిర్‌మాన్ కప్‌లో 5వ స్థానంలో నిలిచాడు.

ఫొటో సోర్స్, gnspf/Facebook
7. గగన్ నారంగ్ (షూటింగ్)
హైదరాబాద్ వాసి అయిన గగన్ నారంగ్.. గత కామన్వెల్త్ గేమ్స్‌లో 8 బంగారు పతకాలు, ఒకటి రజతం, ఒకటి కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
2006 ( మెల్‌బోర్న్)లో 4 స్వర్ణాలు, 2010 (దిల్లీ)లో 4 స్వర్ణాలు, 2014 (గ్లాస్గో)లో ఒక రజతం, ఒక కాంస్యం సాధించాడు.
ఈ సారి గోల్డ్‌కోస్ట్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ బరిలో నిలిచిన నారంగ్ 2006, 2010 మాదిరి ఫలితాలను సాధిస్తాడో లేదో.. చూడాలి.
2012 లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (పురుషుల) విభాగంలో కాంస్యం గెలుచుకున్నాడు.

ఫొటో సోర్స్, twitter.com/TelanganaCMO
8. బుద్దా అరుణా రెడ్డి (జిమ్నాస్టిక్స్)
ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
ప్రపంచ కప్ గెలిచిన భారత తొలి జిమ్నాస్టిక్ క్రీడాకారిణి.
2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పాల్గొంది కానీ పతకాలు రాలేదు.
హైదరాబాద్‌కు చెందిన అరుణకు ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
9. మేఘన (రిథమిక్ జిమ్నాస్ట్)
భారత టాప్ జిమ్మాస్ట్‌గా పేరు తెచ్చుకున్న మరో హైదరాబాదీ మేఘనా రెడ్డి.
కామన్వెల్త్‌లో రిథమిక్‌లో పోటీ పడుతున్న ఏకైక భారతీయ క్రీడాకారిణి మేఘనా.
ఒలింపిక్ జిమ్నాస్ట్ వర్వారా ఫిలియో దగ్గర కొలంబస్‌లో శిక్షణ తీసుకుంది.
2016 ఆషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొంది, పతకాలు రాలేదు.

ఫొటో సోర్స్, AFP
10. మహమ్మద్ హుసాముద్దీన్(బాక్సింగ్)
24 ఏళ్ల బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్‌ది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా.
ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్‌లో ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు.
గత సంవత్సరం బల్గేరియా టోర్నీలో రజత పతకం గెలుచుకున్నాడు.
11. రాగాల వెంకట్ రాహుల్(పురుషుల వెయిట్ లిఫ్టింగ్)
గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ పురుషుల 85 కిలోల విభాగంలో పోటీపడనున్నారు.
2017: గోల్డ్ కోస్ట్, కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు.
2015: పుణె కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు.
2013: మలేషియాలో జరిగిన కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 2 బంగారు పతకాలు సాధించాడు.
12. రజని ఎతిమార్పు(హాకీ గోల్‌కీపర్)
రజనీది చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం.
2010: దక్షిణ కొరియాలో జరిగిన ఆసియాన్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో భారత జట్టు కాంస్యం గెలుచుకుంది. ఆ జట్టులో రజనీ కూడా ఉంది.
2010: దిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని ఐదో స్థానంలో నిలిచింది.
2016: రియో ఒలింపిక్స్‌లో 12వ స్థానంలో నిలిచింది.
2016: సింగపూర్‌లో జరిగిన మహిళల ఆసియాన్ ఛాంపియన్‌షిప్ ట్రోపీలో భారత్ బంగారు పతకం కైవసం చేసుకుంది.
13. శరత్ ఆచంట(టేబుల్ టెన్నిస్)
గతంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ మూడు స్వర్ణాలను సాధించాడు.
2006లో రెండు బంగారు పతకాలు, 2010లో ఒకటి స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నాడు.
2014లో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మెన్స్ డబుల్స్‌లో రజతం సాధించాడు.
శరత్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, ఆయన కుటుంబం చెన్నైలో స్థిరపడింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








