సిరియాలో కూలిన రష్యా విమానం, 32 మంది మృతి

ఫొటో సోర్స్, AFP/getty
రష్యాకు చెందిన విమానం సిరియాలో కూలిపోయింది. ఈ విమానంలో ఉన్న 26 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది చనిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
సిరియా తీర ప్రాంత నగరం లటాకియాలోని మెయిమిన్ ఎయిర్ బేస్‌లో ఈ An-26 విమానం దిగుతుండగా ప్రమాదం జరిగింది.
ఈ మేరకు రష్యా అధికారులు తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ఈ విమాన ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది.

ఫొటో సోర్స్, UK MoD
ఇప్పటి వరకు తేలింది..
రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల మేరకు భారత కాలమానం ప్రకారం సాయంత్రం అయిదున్నరకు ఈ ప్రమాదం జరిగింది.
ఈ విమానం రన్ వే నుంచి 500 మీటర్లు ముందుకు వెళ్లింది.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
మెయిమిన్ అంటే?
సిరియాలో తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేసేందుకు రష్యా వినియోగించే ప్రధానమైన ఎయిర్ బేస్ ఇది.
రష్యా దాడుల్లో పౌరులూ చనిపోయారని చెబుతుండగా.. రష్యా మాత్రం తాము తిరుగుబాటు దారులపైనే దాడులు చేస్తున్నామని అంటోంది.

ఫొటో సోర్స్, AFP
రష్యాకు జరిగిన నష్టం
- 2018 ఫిబ్రవరిలో.. సుఖోయ్-25 యుద్ధ విమానాన్ని తిరుగుబాటుదారులున్న ఇడ్లిబ్ (సిరియా)లో కూల్చేశారు.
- 2017 డిసెంబరులో.. మెయిమిమ్ ఎయిర్ బేస్‌లో పలు విమానాలపై దాడులు చేశారు. రష్యాకు చెందిన ఇద్దరు చనిపోయారు.
- 2016 డిసెంబరులో.. 92 మందిని తీసుకెళ్తున్న టు-154 నల్ల సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న అందరూ చనిపోయారు.
- 2016 ఆగస్టులో.. అయిదుగురితో వెళ్తున్న హెలికాప్టర్‌ను ఇడ్లిబ్‌లో కూల్చేశారు.
- 2015 నవంబరులో.. టర్కీ యుద్ధ విమానాలు ఓ సుఖోయ్ 24 విమానాన్ని కూల్చేశాయి. ఒక పైలట్ చనిపోయారు. మరొకరిని కాపాడారు. ఈ ఘటన ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








