ప్రెస్ రివ్యూ : ‘కోదండరామ్ అలానే అంటారు. టీజేఏసీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం మాత్రం పక్కా’

ప్రొ.కోదండరామ్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ జేఏసీ పార్టీగా మారబోదని కోదండరామ్ ప్రకటించినట్టు ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.

టీజేఏసీ కేంద్ర కార్యాలయంలో కోదండరామ్ అధ్యక్షతన జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై చర్చించారని వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో కోదండరామ్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదన్నారు. అయితే.. ఆయన సన్నిహితుల్లో ఒకరు మాత్రం.. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో కోదండరామ్ పార్టీ ప్రకటిస్తారని తెలిపారు.

''మా సార్ అలానే అంటారు. పార్టీ ఏర్పాటు చేయడం మాత్రం పక్కా.. పేరు కూడా ఫైనల్ అవబోతోంది. మేం ప్రతిపాదించుకున్న పేర్లలో రెండే మిగిలాయి. ఒకటి 'తెలంగాణ జన సమితి'.. రెండోది 'తెలంగాణ సకల జనుల పార్టీ' అని ఆ సన్నిహితుడు తెలిపినట్టు ఈ కథనం వెల్లడించింది.

రజనీ కాంత్

ఫొటో సోర్స్, Getty Images

రజనీ రాజకీయ ప్రవేశం.. 'డిసెంబర్ 31న విడుదల'

''నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడం లేదు. రాజకీయ ప్రవేశంపై నా నిర్ణయం ఏంటనేది ఈ నెల 31న వెల్లడిస్తా..'' అని తమిళ కథానాయకుడు రజనీకాంత్ చెప్పారు.

తన అభిమానులతో రజనీకాంత్ మరోసారి భేటీ అయ్యారు. డిసెంబర్ 31వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మంగళవారం నాడు ఈ భేటీలో మాట్లాడుతూ..

''1996లోనే రాజకీయాల గురించి మాట్లాడాను. ఇందులో ఎప్పుడేం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కష్టనష్టాలు తెలిసినందువల్లే అడుగుపెట్టేందుకు ఆలోచిస్తున్నా. మనం యుద్ధంలోకి దిగితే గెలుపే లక్ష్యం కావాలి. యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే చాలదు. వ్యూహం కూడా ఉండాలి!'' అన్నారు.

రజనీకాంత్ మాట్లాడటం మొదలుపెట్టగానే సభాప్రాంగణం ఒక్కసారిగా మార్మోగింది. తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి రజనీకి 2 నిమిషాలు పట్టింది.

మరోవైపు.. తమ తలైవర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేశారని ఈనాడు ఈ కథనంలో పేర్కొంది.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

పెరిగిన మద్యం ధరలు

తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయని నమస్తే తెలంగాణ ఓ వార్తను ప్రచురించింది.

5 నుంచి 12% మద్యం ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం రూ.400 లోపు ఉన్నవాటిని మాత్రం యథాతథంగానే ఉంచుతున్నారు.

ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగానే నిర్దేశిత ప్రకారం ధరలు పెరుగుతాయి. ఒక ఫుల్ బాటిల్‌పై 40 నుంచి 60 వరకు పెరిగింది.

అయితే.. బీర్ల ధరల్లో ప్రస్తుతానికి మార్పు లేదు. రాష్ట్ర విభజన అనంతరం మద్యం ధరలు పెరగడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ధరలు పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ గత సెప్టెంబర్‌లోనే మద్యం ధరలు పెంచినట్టు ఈ కథనం తెలిపింది.

సెల్ఫీ తీసుకుంటున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

సెల్ఫీ డెత్.. ఇండియా ఫస్ట్

సెల్ఫీ మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని ఓ సర్వేలో వెల్లడైనట్టు ఈనాడు ఓ వార్తను ప్రచురించింది.

మధురైకి చెందిన జనార్ధన్ బాలకృష్ణన్, నటింగ్‌హమ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రిఫ్త్స్‌‌లు.. భారత్‌లోని సెల్ఫీ అలవాట్లను పరిశీలించారు.

మన యువకుల్లో 57.5% మంది, యువతుల్లో 42.5% మంది సెల్ఫీలు తీసుకోవడంలో మునిగిపోతున్నట్లు తేల్చారు. ఈ సమస్యను మూడు దశలుగా విభజించారు.

రోజుకు మూడుసార్లు ఫోన్‌లో ఫోటోలు దిగి, ఇతరులతో వాటిని పంచుకోని వారు ప్రాథమిక దశ సమస్యతో బాధపడుతున్నట్లు లెక్క.

వాటిని వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే మాత్రం మోస్తరు సమస్య ఉన్నట్లే.

ఇక రోజుకు ఆరు కంటే ఎక్కువసార్లు సెల్ఫీలు తీసుకుని, వాటిని ఇతరులతో పంచుకునేవారు మాత్రం తీవ్రస్థాయి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లుగా గుర్తించాలి అని బాలకృష్ణన్ తెలిపారు.

ఇంటర్నేషనల్ 'జర్నల్ ఆఫ్ హెల్త్ అడిక్షన్' గణాంకాల ప్రకారం సెల్ఫీలు దిగుతూ ప్రపంచవ్యాప్తంగా 127 మంది మృతిచెందగా.. అందులో 76 మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు.

ఏపీ, తెలంగాణ ఉమ్మడి కోర్ట్

ఫొటో సోర్స్, High court website

కోర్టు ఉత్తర్వులంటే జోక్ కాదు

పరిహారం ఇచ్చాకే భూసేకరణ చేయాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు హెచ్చరించిందంటూ సాక్షి దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

పరిహారం ఉత్తర్వుల అమలుపై ఇరు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, కోర్టు ఉత్తర్వులంటే జోక్ అయిపోయిందని హైకోర్టు ఆగ్రహించింది.

పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తే భూసేకరణ ప్రక్రియనే ఆపేస్తామని చెప్పింది.

దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలంటే తొలుత పరిహారాన్ని డిపాజిట్‌ చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల తరహాలో... అన్ని రకాల భూ సేకరణకు కూడా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)