జెరూసలెంపై ట్రంప్: మాకు ఓట్లెయ్యకుంటే మీకు అప్పులు బంద్!

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అంగీకరించని దేశాలకు ఆర్థిక మద్దతు నిలిపివేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను లెక్క చేయకుండా ఈ నెలలోనే ట్రంప్ జెరూసలెంకు ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తింపునిచ్చిన విషయం తెలిసిందే.
"వాళ్లు మన నుంచి వందల కోట్ల డాలర్ల సహాయం తీసుకుంటారు. మళ్లీ మనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు" అని వైట్‌హౌస్‌లో ట్రంప్ విలేకరులతో అన్నారు.
"సరే.. వాళ్లు అలాగే మనకు వ్యతిరేకంగా ఓట్లు వెయ్యనివ్వండి. మాక్కూడా డబ్బులు ఆదా అవుతాయి. దీంతో మాకొచ్చే నష్టమేమీ లేదు" అని ట్రంప్ వ్యంగంగా అన్నారు.
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడానికి వ్యతిరేకించే తీర్మానంపై ఐరాసలో ఓటింగ్ జరగడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తీర్మానం ముసాయిదాలో అమెరికా ప్రస్తావన లేనప్పటికీ జెరూసలెంపై చేసిన ఎలాంటి నిర్ణయాన్నయినా రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు.
జెరూసలెం నగరం విషయంలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య చిరకాలంగా వివాదం కొనసాగుతోంది. ప్రపంచంలోనే పవిత్ర నగరంగా గుర్తింపున్న జెరూసలెం మాదేనని రెండూ వాదిస్తున్నాయి.
ఇజ్రాయెల్ దీనిని తన రాజధాని అని భావిస్తోంది కానీ దానికి ఒక్క అమెరికా మినహా ప్రపంచంలో మరే దేశమూ మద్దతు ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, EPA
'ఉత్తుత్తి బెదిరింపే'
అమెరికా, ఐరాసలో అమెరికా దూత నికీ హేలీ ఇతర దేశాలను తమ వైపు తిప్పుకోవడానికి దౌత్యనీతిని ఉపయోగించడానికి బదులు అమెరికా కండబలాన్ని, దాని ప్రభావాన్ని ఉపయోగిస్తున్నారని బీబీసీ న్యూయార్క్ ప్రతినిధి నాదా తౌఫీక్ అభిప్రాయపడ్డారు.
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలించాలనే నిర్ణయం తమ సార్వభౌమిక అధికారం కిందకు వస్తుందని అమెరికా భావిస్తోంది. కానీ ఐరాసతో పాటు ప్రపంచంలోని అత్యధిక దేశాల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది.
కాగా, ట్రంప్ చేసిన తాజా కటువైన వ్యాఖ్యలను ఉత్తుత్తి బెదిరింపులుగా పలు అమెరికా సహచర దేశాలు అభివర్ణించాయి.
ఇజ్రాయెల్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం ఎంత మొండి వైఖరితో ఉన్నప్పటికీ ఆర్థిక మద్దతును నిలిపివేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవచ్చని ప్రముఖ రాయబారి ఒకరు నాదా తౌఫీక్‌తో అన్నారు.
నాదా తౌఫీక్ అభిప్రాయం ప్రకారం, గురువారం నాడు ఐరాస సాధారణ సభలో అమెరికా ఒంటరి అవుతుంది. ఇజ్రాయెల్ పట్ల తీసుకున్న నిర్ణయానికి తమ ఆమోదం లేదని ప్రపంచం ట్రంప్‌కు మరోసారి స్పష్టం చేయనుంది.

ఫొటో సోర్స్, RRODRICKBEILER
వివాదానికి కేంద్రం జెరూసలెం
1967 నాటి యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెంను ఆక్రమించుకుంది. అంతకు ముందు అది జోర్డాన్ నియంత్రణలో ఉంది.
ఇప్పుడు అవిభాజ్య జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తుంది. మరోవైపు పాలస్తీనియులు తూర్పు జెరూసలెంను తమ ప్రతిపాదిత దేశానికి రాజధానిగా భావిస్తారు.
జెరూసలెం విషయంలో అంతిమ నిర్ణయం భవిష్యత్తులో జరిగే శాంతి చర్చలలో తీసుకోవాల్సి ఉంది.
జెరూసలెంపై ఇజ్రాయెల్ చేసే వాదనలకు అంతర్జాతీయ సముదాయం ఎప్పుడూ ఆమోదం తెలపలేదు. ప్రపంచంలోని అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ప్రస్తుతం టెల్ అవీవ్‌లోనే ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు మార్చాలని విదేశాంగ శాఖను ఆదేశించారు.
అరబ్, ముస్లిం దేశాల ప్రతిపాదనపై 193 దేశాలతో కూడిన ఐరాస గురువారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికన్ విధానాన్ని మార్చివేశారంటూ అరబ్, ముస్లిం దేశాలు ట్రంప్‌పై భగ్గుమంటున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా వీటో
జెరూసలెంపై తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఐరసా భద్రతా మండలి ప్రతిపాదించిన తీర్మానంపై అమెరికా వీటో చేసింది. పవిత్ర నగరమైన జెరూసలెంలో రాయబార కార్యాలయం ఏర్పాటును వ్యతిరేకించాలంటూ పాలస్తీనియులు కూడా అన్ని దేశాలకూ విజ్ఞప్తి చేశారు.
భద్రతా మండలిలోని మొత్తం 14 దేశాలూ తీర్మానానికి మద్దతుగా ఓటు వేశాయి. అమెరికా రాయబారి నికీ హేలీ మాత్రం ఇది అమెరికాను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
తాజాగా, ట్రంప్ చేసిన హెచ్చరికను పునరుద్ఘాటిస్తూ నికీ హీలీ ట్వీట్ చేశారు.
మరోవైపు అమెరికా ఇతర దేశాల పట్ల బెదిరింపులకు పాల్పడుతోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మలీకీ, టర్కీ విదేశాంగ మంత్రి మెవలుత్ కావాసోగ్లూ ఆరోపించారు.
అంకారాలో జరిగిన ఒక సంయుక్త పత్రికా గోష్ఠిలో కావాసోగ్లూ ఇలా అన్నారు, "ఒంటరైన అమెరికా ఇప్పుడు బెదిరింపులకు దిగినట్టు స్పష్టంగా కనబడుతోంది. గౌరవ మర్యాదలున్న ఏ దేశమైనా ఈ బెదిరింపులకు తలొగ్గదు."
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








