క్షిపణిని ప్రయోగించిన యెమెన్ రెబల్స్.. అడ్డుకున్న సౌదీ

ఫొటో సోర్స్, Almasirah
యెమెన్ హూతీ రెబెల్ బృందం ప్రయోగించిన ఓ బాలిస్టిక్ క్షిపణిని రియాద్ సమీపంలో అడ్డుకున్నట్లు సౌదీ మీడియా వెల్లడించింది.
క్షిపణి ప్రయాణించిన మార్గంలో ఆకాశంలో ఏర్పడిన పొగ మేఘాల ఫొటోలను కొంతమంది ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
అల్-యమమ ప్యాలెస్‌లో జరుగుతున్న సౌదీ నేతల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగిందని హూతీకి చెందిన అల్-మసీరా టీవీ పేర్కొంది.
గత నెలలో కూడా ఇలాంటిదే ఓ క్షిపణి రియాద్ విమానాశ్రయ సమీపంలో పేలింది.
హూతీకి ఈ క్షిపణిని ఇరాన్ అందించిందని సౌదీ అరేబియా, యూఎస్ ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
యెమెన్ ప్రజలపై అమెరికా-సౌదీల నేతృత్వంలో జరుగుతున్న క్రూర చర్యలకు వ్యతిరేకంగా బుర్కాన్-2 క్షిపణిని ప్రయోగించబోతున్నట్లుగా మంగళవారం మధ్యాహ్నం హూతీ క్షిపణి అధికారులు ప్రకటించినట్లుగా పేర్కొంటున్న ఓ నివేదికను అల్-మసీరా తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
ఇది జరిగిన కాసేపటికి, ఓ క్షిపణిని అడ్డుకున్నట్లుగా సౌదీ అధికారిక మీడియా కూడా ప్రకటన చేసింది.

ఫొటో సోర్స్, AFP
అల్-యమమ ప్యాలెస్‌లో జరుగుతున్న సమావేశంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొనాల్సి ఉందని అల్-మసీరా తెల్పింది. ఈ ప్యాలెస్ నుంచే సౌదీ రాజు తన అధికారిక కార్యకలాపాలన్నీ నిర్వహిస్తుంటారు.
"విచక్షణారహితంగా జనావాసాలపైకి ఈ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఎలాంటి నష్టం జరగకుండా మేం దాన్ని సమర్థంగా అడ్డుకున్నాం" అని సౌదీ అధికారి ఒకరు చెప్పినట్లుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది. "ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా ఇరాన్... హూతీలోని రెబెల్స్‌కు సహాయం అందిస్తూనే ఉందని మరోసారి రుజువైంది" అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన దాడికి ప్రతిగా సౌదీ.. యెమెన్‌తో ఉన్న సరిహద్దులను మూసివేయడమే కాక, అన్ని రకాల సరఫరాలను నిలిపివేసింది. తర్వాత యూఎన్ సూచనల మేరకు నిత్యావసరాల సరఫరాలను పునరుద్ధరించింది. కానీ చమురు, ఇతర వాణిజ్య ఉత్పత్తులపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








