తెలంగాణ రైతు బీమా: తండ్రీకొడుకులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నా పైసా పరిహారం రాలేదు...

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పరిగి మండలం పెద్ద మాదారం గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త బండయ్య 2018 ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. ఆమె కుటుంబానికి మళ్లీ సాగులో నష్టాలు వచ్చాయి.
ప్రభుత్వ సాయం కోసం ఆమె కొడుకు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. భర్త చేసిన అప్పులూ తీరలేదు. చివరకు ఆమె కుమారుడు నరేశ్ కూడా 2020 నవంబరులో ఆత్మహత్య చేసుకున్నారు.
తండ్రి మరణానికి సంబంధించిన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి... అవి రాక, తాను కూడా సాగులో నష్టపోయి ఆయన ప్రాణాలు వదిలారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులు, తండ్రీ కొడుకులు చనిపోయినా, వారికి ప్రభుత్వం నుంచి పరిహారం కానీ, బీమా కానీ అందలేదు.
''పత్తి చేను పండలేదు. వరుసగా రెండేళ్లు ఇబ్బంది అయింది. ఎడ్లు కొన్నాం. వాటిలోనూ నష్టపోయాం. ఇక అప్పులు ఎలా తీర్చాలా అని భయపడి చనిపోయాడు నా భర్త. ఆయన పోయాక ఇంటికి రెండు మూడుసార్లు గవర్నమెంటు ఆఫీసర్లు వచ్చారు. డబ్బులు ఇస్తారు అన్నారు. వాటితో అప్పులు కట్టుకోవచ్చు అనుకున్నాం. కానీ అదీ జరగలేదు. నా కొడుకు పరిగి మండలంలో తిరగని గవర్నమెంటు ఆఫీసు లేదు. మొక్కని ఆఫీసర్ లేడు. అయినా పరిహారం రాలేదు. అటు పంట కూడా సరిగా పండలేదు. దీంతో మందు తాగి చనిపోయాడు. తరువాత పరిహారం కోసం నేను పరిగి వెళ్తే, వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లమన్నారు. నేనెళ్లి ఎవర్నడగాలి?'' అని బీబీసీతో వాపోయారు పద్మమ్మ.
ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో కొందరికి ప్రభుత్వం సాయం ప్రకటిస్తుంటుంది. అలా ప్రభుత్వ సాయం ప్రకటించినప్పటికీ, వాస్తవంగా ఆ డబ్బు అందని కుటుంబాలు తెలంగాణలో 400 వరకూ ఉన్నాయని చెబుతున్నాయి రైతు సంఘాలు.
పద్మమ్మ కేసులో కూడా, నిధులు లేకపోవడం వల్లే ఈ కుటుంబానికి పరిహారం అందించలేకపోతున్నట్టు గతంలో ఆర్టీఐ కింద సమాధానం ఇచ్చింది వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో రైతు బీమా పథకం రాకముందు అంటే, 2018 ఆగష్టు 14 వరకూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వ అధికారులు అక్కడకు వెళ్లి అది నిజంగా రైతు ఆత్మహత్యా కాదా అని విచారించి పరిహారం ప్రకటించే వారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇది జరిగేది.
ఆ ఉత్తర్వుల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి డబ్బే కాకుండా, వారి పిల్లలకు గవర్నమెంటు హాస్టల్లో సీటు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చేవారు. లక్షన్నర రూపాయల్లో యాభై వేలను అప్పులకు వన్ టైం సెటిల్మెంటుగా తహశీల్దారే చెల్లించేవారు. మిగిలిన లక్ష ఆ కుటుంబానికి ఇచ్చేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అప్పటి వరకూ లక్షన్నర ఉన్న పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచారు. అలాగే మిగతా సదుపాయాలను కూడా కొనసాగించింది తెలంగాణ ప్రభుత్వం.
అయితే, 2018 ఆగస్టు 15 నుంచి తెలంగాణలో రైతు బీమా పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద పాత పద్ధతిలోలా పరిహారం ఇవ్వరు. అంటే ఉదాహరణకు గ్రామంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిస్తే అక్కడకు ప్రభుత్వ అధికారులు వెళ్లి, నిజంగా రైతు వ్యవసాయ సమస్యలతో చనిపోయాడా అని ఆరా తీసి నివేదిక సిద్ధం చేస్తారు. అప్పుడు వారికి పరిహారం వస్తుంది.
కానీ బీమా వచ్చాక ఆ ప్రక్రియ ఆగిపోయింది. చనిపోయిన కుటుంబాల వారికి నేరుగా ఇన్సూరెన్సు ఇస్తారు. ఓ రకంగా ప్రక్రియ సులభం అయింది.
కానీ, గతంలోలా చనిపోయిన రైతుల పిల్లలకు హాస్టల్ సీటు వంటివి వర్తించవు. అలాగే అప్పుల సెటిల్మెంటులో ప్రభుత్వ జోక్యం ఉండదు. బాధిత కుటుంబాలే ఇన్సూరెన్సు సొమ్ము ఐదు లక్షల నుంచి సెటిల్మెంటు చేసుకోవాలి.
ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఇన్సూరెన్సు ఇచ్చేలా ఏర్పాటు చేసింది తెలగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఈ పథకం కింద దాదాపు 40 వేల మందికి పైగా బీమా పొందినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
దాని వల్ల చాలా కుటుంబాలకు మేలు జరిగింది. కానీ సమస్య ఏంటంటే రైతులు అందరికీ ఈ పథకం వర్తించదు. ఓ రకంగా చెప్పాలంటే ఇది భూమి యజమానులకు బీమా తప్ప రైతు బీమా కాదు.
సొంత భూమి ఉండి చనిపోయిన ఎవరికైనా ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయలు వస్తాయి. కానీ భూమి తమ పేరిటలేని వారు ఎలా చనిపోయినా ఈ పథకం వర్తించదు.

''గతంలో ఉన్న జీవో రైతులు అందరికీ వర్తిస్తుంది. దాంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వ విచారణ తరువాత పరిహారం అందేది. కానీ, రైతు బీమా పథకం కేవలం భూమి యజమానులకే వర్తిస్తుంది. ఉదాహరణకు భూమి తండ్రి పేరిట ఉంది. వ్యవసాయం కొడుకు చేస్తున్నాడనుకుంటే, ఆ కొడుకు సాగు సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నా, లేక పొలంలో ప్రమాదవశాత్తూ మరణించినా అతనికి బీమా దక్కదు. తమ పేరిట భూమి లేని వారు అప్పులతో ఆత్మహత్య చేసుకున్నా, వ్యవసాయం చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించినా ఈ బీమా వర్తించదు. మరోవైపు, కేవలం తమ పేరిట భూమి ఉండి, నిజంగా వ్యవసాయం చేయని వారికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. ఇక కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించదు. అలాగే, ప్రభుత్వం దళితులకు ఇచ్చే అసైన్డ్ భూమి ఉన్న రైతులకు కూడా ఈ బీమా వర్తించదు. కానీ బీమా పథకం రాకముందు, భూమితో సంబంధం లేకుండా రైతు ఆత్మహత్య అని ప్రభుత్వం నిర్ధారించిన అందరికీ పరిహారం అందేది'' అంటూ వివరించారు రైతు స్వరాజ్య వేదికకు చెందిన బి కొండల్.
''ఉన్నతాధికారులు వెళ్లి విచారించే సందర్భాల్లో 25 శాతం లేదా నాల్గవ వంతు ఆత్మహత్యలనే ప్రభుత్వం రైతు ఆత్మహత్యలుగా గుర్తించేది. మిగతా వారిని గుర్తించేది కాదు. అలా గుర్తించిన 25 శాతం మందికి కూడా పూర్తిగా పరిహారం అందకపోవడం చాలా దారుణం'' అన్నారు రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కిరణ్.
ఇంతకుముందు చూసిన పద్మమ్మ కథ ఈ సమస్యకు ఒక పెద్ద ఉదాహరణ. ఆమె భర్త పేరిట మూడెకరాల భూమి ఉంది. అప్పటికి బీమా పథకం రాలేదు. ప్రభుత్వం పాత ఉత్తర్వుల ప్రకారం ఆమె భర్తది రైతు ఆత్మహత్యే అని గుర్తించింది. కానీ ఇస్తామన్న పరిహారం ఇంకా ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, KONDALREDDY/FACEBOOK
భర్త చనిపోయాక, హిందూ వారసత్వ చట్టం కింద భూమి భార్య పేరిట వచ్చింది. వ్యవసాయం తల్లీ కొడుకులు ఇద్దరూ కలసి చేసేవారు. వ్యవసాయ సమస్యలతో కొడుకు చనిపోయినా, భూమి మాత్రం తల్లి పేరిటే ఉంది. కాబట్టి కొడుకు మరణానికి బీమా అందదు. దీంతో ఎటూ దిక్కుతోచని స్థితిలో పడ్డారామె.
పద్మమ్మే కాదు, తెలంగాణలో పాత పద్ధతి కింద సాయం అందని వందల రైతు కుటుంబాలు ఉన్నట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇక కొత్త బీమా కింద అర్హత లేని రైతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఈ తెలంగాణ రైతులంతా ఏ బీమా, ఏ భరోసా లేకుండానే కాలం గడుపుతున్నారు.
''పాత ఉత్తర్వుల ప్రకారం రైతు ఆత్మహత్యలను గుర్తించి ఏళ్లు గడిచినా వారికి పరిహారం ఇవ్వకపోవడం దారుణం. మా అంచనా ప్రకారం అలాంటి వాళ్లు ఒక 400 మంది వరకూ ఉండొచ్చు. మొత్తం అందరికీ పూర్తి పరిహారం ఇవ్వడానికి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు ముందు అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వడం లేదు'' అన్నారు కిరణ్.
నల్లగొండ జిల్లాలో రైతు ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాల వారు 2019లో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లగానే ఆ జిల్లా పరిధిలోని ఇలాంటి కేసులకు వెంటనే డబ్బులు చెల్లించారు జిల్లా కలెక్టర్. కానీ మిగిలిన తెలంగాణ జిల్లాల్లో మాత్రం పరిస్థితి అలాగే ఉంది.
ఈ అంశంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిని, ఆయన కార్యాలయాన్నీ బీబీసీ సంప్రదించింది. ఇంకా స్పందన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









