You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమరావతి ఉద్యమానికి మద్దతిస్తే కులాలు ఆపాదిస్తారా? - సీపీఐ నారాయణ : ప్రెస్ రివ్యూ
రాజధాని అమరావతి ఉద్యమానికి ఎవరైనా మద్దతిస్తే వారికి కులాలు ఆపాదిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మండిపడ్డారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పక్షం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం 29 గ్రామాలకే పరిమితం కాదన్నారు. ఆనాడు రాజధాని కోసం ప్రభుత్వానికి ఆ రైతులు భూములిచ్చారని.. చంద్రబాబుకో, లోకేశ్‌కో కాదన్న సంగతి జగన్ ప్రభుత్వం గుర్తెరగాలని సూచించారు. అమరావతిలో నిర్మించిన ఇళ్లు మొండి గోడలుగా మిగిలాయని, భవిష్యత్‌లో దానిని శ్మశానం చేసేందుకు జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు.
ఇక 24 గంటలూ ఆర్టీజీఎస్
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరో నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 24గంటలు ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆదివారం అర్ధరాత్రి 12.30నిమిషాల నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24x7 అందుబాటులో ఉండనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇది సాధ్యమయ్యేందుకు కృషిచేసిన ఆర్‌బీఐ బృందానికి, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు.ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు అన్ని పనిరోజుల్లో కేవలం ఉదయం 7గం.ల నుంచి సాయంత్రం 6గం.ల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24గంటలపాటు ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. అధిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఆర్‌టీజీఎస్‌ను వినియోగిస్తుండగా, నెఫ్ట్ ద్వారా కేవలం రూ.2 లక్షలలోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇక, డిసెంబర్ 2019 నుంచి నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) విధానాన్ని అన్నిరోజుల్లో నిరంతర(24x7) సదుపాయాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...సీఎం ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది అంటూ సాక్షి ఒక కథనంలో తెలిపింది.
ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపిందని ఈ కథనంలో పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్ ఎవరి కోసం?..కమల్ హాసన్
ఎవరిని రక్షించేందుకు రూ.వెయ్యికోట్లతో పార్లమెంటును నిర్మిస్తున్నారని మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రశ్నించారంటూ నవతెలంగాణ ఒక కథనంలో తెలిపింది.
2021 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మదురై నుండి తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తమ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారీ మొత్తంతో నూతన పార్లమెంటు భవనం నిర్మించాలన్న అత్యుత్సాహానికి గల కారణమేమిటని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో సగం మంది ఆకలితో అల్లాడుతున్నారని, కరోనా వైరస్ కారణంగా వేలాది మంది జీవనోపాధిని కోల్పోయారని, దేశంలో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇటువంటి సమయంలో.. రూ. వెయ్యికోట్లతో నూతన భవనం నిర్మించడం అవసరమా అని మండిపడ్డారంటూ ఈ కథనంలో రాసారు.
ఇవి కూడా చదవండి:
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడి... బీబీసీ రహస్య చిత్రీకరణలో వెలుగు చూసిన గగుర్పొడిచే వాస్తవాలు
- కపాలాల కోట: వందలాది బందీలు, బానిసలను చంపేసి వారి పుర్రెలతో భారీ బురుజు కట్టేశారు
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)