పాంపే: 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు

రెండు వేల ఏళ్ల కిందట వెసువియస్ అగ్నిపర్వతం పేలినపుడు ప్రాచీన రోమన్ నగరం పాంపేలో చనిపోయిన ఇద్దరు పురుషుల అవశేషాలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

వీటిలో ఒకరు సంపన్నుడు కావచ్చని, ఇంకొకరు ఆయన బానిస అయ్యుంటారని పాంపే పురాతత్వ శాఖ అధికారులు చెప్పారు.

"వాళ్లు బహుశా విస్ఫోటనం నుంచి తప్పించుకోవాలని చూసుండవచ్చ"ని డైరెక్టర్ మాసిమో ఒసన్నా తెలిపారు.

క్రీస్తు శకం 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలడంతో ఉప్పొంగిన లావా పాంపే నగరాన్ని చుట్టుముట్టింది. దానిని బూడిద చేసింది.

ఆ నగరంలోని ప్రజలు అందులోనే గడ్డకట్టుకుపోయారు. వారు పురాతత్వ శాస్త్రవేత్తలకు అమూల్యమైన ఒక వనరుగా మారారు.

ఈ తాజా అవశేషాలను నవంబరులో ప్రాచీన నగరం శివార్లలోని ఒక పెద్ద భవనంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు కనుగొన్నారు.

బాధితుల్లో సంపన్నుడి వయసు 30-40 మధ్య ఉంటుందని, అతడు ఉన్ని దుస్తులు వేసుకున్నట్టు అతడి మెడ కింద ఆనవాళ్లు కనిపించాయని వారు చెప్పారు.

అక్కడే ఉన్న మరో వ్యక్తి వయసు 18-23 మధ్య ఉంది. బాగా పాడైన వెన్నెముక అతడు శారీరక కష్టం చేసే బానిస అయ్యుండవచ్చని చెబుతోందని తవ్వకాలు జరిపిన అధికాలు తెలిపారు.

గట్టిపడిన బూడిదగా మారిన బాధితుల శరీరాలను ఉపయోగించి వాటి అచ్చులు పోతపోశారు.

"థెర్మల్ షాక్ వల్ల వారు చనిపోయారని, వారి పాదాలు, చేతుల ద్వారా అది కనిపిస్తోంది" అని ఒసన్నా రిపోర్టర్లకు చెప్పారు.

ఇక్కడ విస్ఫోటనం జరిగిందని చెప్పడానికి ఒక అసాధారణ సాక్ష్యంగా ఆయన వాటిని వర్ణించారు.

నేపుల్స్ సమీపంలో పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే ప్రాంతంలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ కరోనా వల్ల అక్కడికి పర్యటకుల రాకను నిషేధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)