గోహత్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. అమాయకులపై ప్రయోగిస్తున్నారు: అలహాబాద్ హైకోర్టు - Press Review

ఉత్తరప్రదేశ్‌లో అమాయకులపై గోహత్య చట్టాన్ని ప్రయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

వదిలేసిన పశువుల రక్షణ కోసం చర్యలు చేపట్టాలని, ఉద్దేశ పూర్వకంగా ఈ చట్టాన్ని ఉపయోగించకూడదని కోర్టు చెప్పింది.

అక్టోబర్‌లో గోహత్య చట్టం కింద అరెస్టైన ఒక నిందితుడికి బెయిల్ ఇచ్చిన జస్టిస్ సిద్దార్థ్ "అమాయకులకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉపయోగించకూడదు. మాంసం దొరికిన చోట ఫోరెన్సిక్ పరీక్ష చేయకుండా ఆవు మాంసం అని చెబుతున్నారు. ఎక్కువ కేసుల్లో మాంసాన్ని పరీక్షల కోసం పంపించడం లేదు. నిందితులు చేయని నేరానికి జైల్లో ఉంటుండవచ్చు" అపి పేర్కొన్నారు.

"ఆవులను స్వాధీనం చేసుకుంటున్నట్టు చూపిస్తున్నప్పుడు, వాటి రికవరీ గురించి ఎలాంటి మెమో ఉండడం లేదు. రికవరీ చేసిన తర్వాత ఆ ఆవులు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలీడం లేదు" అని కోర్టు తన ఆదేశాల్లో చెప్పింది.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జాతీయ భద్రతా చట్టం కింద జరిగిన మొత్తం 139 అరెస్టుల్లో సగానికి పైగా (76) అరెస్టులు గోహత్య కేసుల్లోనే జరిగాయి.

ఈ ఏడాది ఆగస్టు 26 వరకూ రాష్ట్రంలో మొత్తం 1,716 గోహత్య కేసులు నమోదయ్యాయి. నాలుగు వేల మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ గణాంకాల ప్రకారం 32 కేసుల్లో పోలీసులు ఎలాంటి ఆధారాలూ ప్రవేశపెట్టలేకపోయారు అని పత్రిక వివరించింది.

ఆస్ట్రేలియా పర్యటన నుంచి రోహిత్ శర్మ అవుట్.. మహమ్మద్ సిరాజ్ ఇన్

ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మను తీసుకోలేదని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఖరారైంది. సోమవారం వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సమావేశమైన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించింది.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గాయపడి ముంబయి ఇండియన్స్‌ ఆడిన గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌ శర్మను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదని పత్రిక తెలిపింది.

తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో రోహిత్ ఈ ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం కనిపించడం లేదు.

ఐపీఎల్‌లోనే గాయపడ్డ పేసర్‌ ఇషాంత్‌ శర్మ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రస్తుతానికి అతడికి జట్టులో చోటివ్వలేదు. ఇషాంత్‌ కోలుకుంటే టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముంది.

పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2019లో వెస్టిండీస్‌ సిరీస్‌ తర్వాత రాహుల్‌కు మళ్లీ ఇప్పుడు టెస్టు జట్టులో చోటు దక్కింది. వన్డేలు, టీ20ల్లో అతనే వికెట్‌ కీపింగ్‌ చేయనున్నాడు.

పంత్‌ను కేవలం టెస్టులకే ఎంపిక చేశారు.

పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను అయిదో పేసర్‌గా టెస్టుల్లోకి తీసుకున్నారు.

ఐపీఎల్‌లో రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని టీ20లకు ఎంపిక చేశారు. హార్దిక్‌ పాండ్య వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు.

వచ్చే నెలలో మొదలవనున్న పర్యటనలో భాగంగా కంగారూ గడ్డపై టీమ్‌ ఇండియా మూడేసి టీ20లు, వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది.

జట్లు... టీ20: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌, మయాంక్‌, రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌, పాండే, హార్దిక్‌, శాంసన్‌, జడేజా, సుందర్‌, చాహల్‌, బుమ్రా, షమి, సైని, దీపక్‌ చాహర్‌, వరుణ్‌

వన్డే: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌, గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌, మనీశ్‌, హార్దిక్‌, మయాంక్‌, జడేజా, చాహల్‌, కుల్‌దీప్‌, బుమ్రా, షమి, సైని, శార్దూల్‌

టెస్టు: కోహ్లి (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, పుజారా, రహానె (వైస్‌ కెప్టెన్‌), విహారి, గిల్‌, సాహా, పంత్‌, బుమ్రా, షమి, ఉమేశ్‌, సైని, కుల్‌దీప్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్‌

షేర్ చాట్ సరదా, చిన్నారి ప్రాణం తీసింది.. డబ్బు ఆశ హంతకుడిని పట్టించింది

ఒక మైనర్ కిక్ జంప్ స్టంట్ వీడియో సరదా ఒక చిన్నారి ప్రాణాలు తీసిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటకు చెందిన సయ్యద్‌ యూసుఫ్‌ ఆటో డ్రైవర్‌. అతనికి భార్య గౌసియా, అదిబీ రహాన్‌, ఫర్హాన్‌, అథియాన్‌(5) సంతానం.

యూసుఫ్‌ కిరాయికి ఉంటున్న ఇంటి పై అంతస్తులో ఈ నెల 8న కిరాయికి దిగిన బీహార్‌కు చెందిన ఓ మైనర్‌.. పక్క గదిలోనే ఉంటున్న మరో యువకుడు రాజుతో కలిసి గ్రీన్‌ల్యాండ్‌ దాబాలో పనిచేస్తున్నాడు.

ఈ నెల 15న ఆ మైనర్‌.. యూసుఫ్‌ కుమారుడు అథియాన్‌ను తన గదిలోకి తీసుకెళ్లి కిక్‌ జంప్‌ స్కిట్‌ చేయిస్తూ షేర్‌చాట్‌ యాప్‌లో చిత్రీకరిస్తున్నాడు.

జంప్‌ చేసే సమయంలో అథియాన్‌ కిందపడిపోగా తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. విషయం బయటికి తెలిస్తే తనను చితకబాదుతారని భయపడ్డాడు. మృతదేహాన్ని వెంటనే ఓ పెద్ద బ్యాగులో పెట్టి టేప్‌ చుట్టేశాడని పత్రిక రాసింది.

ఆ బ్యాగ్‌ను తీసుకొని ఉప్పర్‌పల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ సమీపంలోని చెట్ల పొదల్లో పడేశాడు.

వారం రోజుల తర్వాత ఆ మైనర్‌ తన స్నేహితుడు రాజు ఫోన్‌ దొంగిలించి దానిని స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.

అదే సమయంలో అథియాన్‌ ఆచూకీ చెప్తే రూ.10వేలు ఇస్తామని యూసుఫ్‌ అందరికీ చెప్తుండటం, బాబును క్షేమంగా తీసుకొస్తే రూ.10 వేలు ఏంది రూ. లక్ష ఇద్దామని ఇంటి యజమాని యూసుఫ్‌ కుటుంబంతో అనడం విన్నాడు.

ఎలాగూ బాలుడు చనిపోయినందున రాజు ఫోన్‌తో కాల్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలనుకు న్నాడు. ఆ డబ్బుతో బీహార్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడని కథనంలో చెప్పారు.

ఈ నెల 24న ఇంటి యజమానికి ఫోన్‌చేసి అథియాన్‌ క్షేమంగా ఇంటికి రావాలంటే రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే ఇదే చివరి కాల్‌ అవుతుంది.. డబ్బు ఇస్తే క్షేమంగా వస్తాడని బెదిరించాడు.

అథియాన్‌ తండ్రి ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. విషయం ఎవరికైనా చెప్తే బాబు దక్కడని బెదిరించాడు. కుటుంబసభ్యులు, ఇంటి యజమాని చాంద్‌ పాషా వెంటనే పోలీసులకు చెప్పారని పత్రిక రాసింది.

పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మొదట రాజును అనుమానించి ఆ తర్వాత ఫోన్‌ బీహార్‌కు చెందిన మైనర్‌ వద్ద ఉన్నదని గుర్తించి విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు.

సోమవారం శామీర్‌పేట పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని పత్రిక కథనంలో వివరించింది.

విశాఖలో దేశంలోనే తొలి లైట్ మెట్రో

దేశంలోని తొలి లైట్ మెట్రోను విశాఖలో నిర్మించబోతున్నారని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశంలోనే తొలిసారిగా విశాఖలో లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.

ప్రాజెక్టు డీపీఆర్, కారిడార్లలో మార్పులు చేర్పులపై అధికారులు మంత్రులకు వీడియో, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం బొత్స పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

మెట్రో ప్రాజెక్టు పీపీపీ విధానంలోనా, ప్రభుత్వమే నేరుగా చేపడుతుందా అనే విషయంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

నవంబర్‌ రెండోవారంలో లైట్‌మెట్రో, డిసెంబర్‌ రెండోవారంలో మోడరన్‌ ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌లను యూఎంటీసీ కన్సల్టెంట్‌ సంస్థ ఇవ్వనుందని చెప్పారు.

ముందుగా చేపట్టే లైట్‌మెట్రో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమై మార్చి నాటికి పూర్తవుతుందన్నారు.

నాలుగు కారిడార్లలో 75.31 కిలోమీటర్ల మేర 52 స్టేషన్లు ఏర్పాటు చేసేలా మొదటి విడత ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారని సాక్షి వివరించింది.

విమానంలో వచ్చి ఏటీఎంలు కొల్లగొట్టిన దొంగల అరెస్ట్

విమానాల్లో వచ్చి ఏటీఎంలు దొచుకుంటున్న ఇద్దరిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

విమానంలో వచ్చి ఏటీఎంలలో చోరీలకు పాల్పడి, తిరిగి విమానంలోనే చెక్కేస్తున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు.

విశాఖపట్నంలోని ఆరిలోవ సుందర్‌నగర్‌లో ఏటీఎం చోరీ కేసును 34 గంటల్లోనే ఛేదించారు. ఆ వివరాలను క్రైమ్‌ డీసీపీ వి.సురేశ్‌బాబు సోమవారం వెల్లడించారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌సిటీకి చెందిన సమర్‌ జ్యోతిసింగ్‌(32), కేరళలో కేసరగుడ్‌ జిల్లాకు చెందిన జాఫర్‌ సాదిక్‌(28) పాత నేరస్థులు.

బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో వీరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఏటీఎంలో చోరీకి ఈ నెల 16న హైదారాబాద్‌ నుంచి విమానంలో విశాఖపట్నం వచ్చారు.

ముందుగా బుక్‌ చేసుకున్న ‘కీస్‌’ హోటల్‌లో దిగారు. బైక్‌ రెంటల్‌ షాపులో స్కూటీ అద్దెకు తీసుకున్నారు. దోపిడీకి అనువుగా ఉండే ఏటీఎం కోసం నగరంలో పరిశీలించారు.

సుందరనగర్‌ ఎస్‌బీఐ ఏటీఎం దోపిడీకి అనువుగా ఉన్నట్టు గుర్తించారు. అవసరమైన వస్తువులను తీసుకొని ముందే ఏటీఎం ఎదురు పార్కులో దాచారు.

ఈనెల 22వ తేదీ రాత్రి ఆ వస్తువులను తీసుకొని సమరజ్యోతిసింగ్‌ ఏటీఎం లోపలకు వెళ్లి షట్టర్‌ దించేశాడు. సాదిక్‌ బయటే ఉండి గమనించాడు.

సమరజ్యోతిసింగ్‌ ఏటీఎం యంత్రాన్ని కట్‌ చేసి రూ.9,59,500 చోరీ చేశాడు. అనంతరం ఇద్దరూ హోటల్‌కు చేరుకుని తర్వాతరోజు ఉదయం స్కూటీని రెంటల్‌ షాపులో పెట్టి నేరుగా విమానాశ్రయానికి చేరుకుని పది గంటలకు బెంగళూరు వెళ్లిపోయారు.

సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించిన నగర పోలీసులు...బెంగళూరు వెళ్లి అక్కడ ఓ హోటల్‌ల్లో ఇద్దరినీ స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరూ కలసి బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏటీఎం చోరీలకు పాల్పడినట్టు గుర్తించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)