You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానానికి మళ్లీ మార్పులు ఎందుకు చేస్తున్నారు? అసలు సమస్య ఏమిటి?
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ఆదాయం సమకూర్చే వనరుల్లో ఇసుక కూడా ఒకటి. గడిచిన దశాబ్దంన్నర కాలంగా ఈ ఇసుక వ్యవహారం నిత్యం వివాదంగానే ఉంటుంది.
కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదులతో పాటుగా ఇతర నదుల నుంచి కూడా నాణ్యమైన ఇసుక లభిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుకను సమీప రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.
ప్రధానంగా తెలంగాణతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలకు, కొంత మేరకు ఒడిశాకి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి నిబంధనలను విరుద్ధంగా ఇసుక సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకంలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు తెరలేపుతూ ఉన్నారు.
ఇసుక అక్రమాలను అరికట్టేందు కోసమేనంటూ ఇదివరకు కూడా ప్రభుత్వాలు అనేక మార్లు విధానాలు సవరించాయి. కానీ నేటికీ ఈ సమస్య కొలిక్కిరాలేదు. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం గత ఏడాది తానే రూపొందించిన విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.
మళ్లీ మొదటికి వస్తోందా?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తర్వాత జగన్ సర్కారు ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరించింది. సుమారు 4 నెలల పాటు ఇసుక తవ్వకాలు నిలిపివేసింది. దాంతో రాష్ట్రమంతా 2019 వర్షాకాల సమయంలో ఇసుక సమస్య తీవ్రమయ్యింది.
ఇసుక సమస్య పరిష్కరించాలంటూ అప్పట్లో చాలా మంది రోడ్డెక్కారు. ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోయి, కార్మికులు ఉపాధి కూడా కోల్పోయారు.
కొందరు ఆత్మహత్యలు చేసుకోగా దానికి ఇసుక సమస్యే కారణమంటూ విపక్షాలు ఆరోపించాయి. వరదల మూలంగానే ఇసుక కొరత అంటూ అప్పట్లో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చివరకు 2019 సెప్టెంబర్ నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతినిస్తూ నూతన విధానం అమలులోకి తీసుకొచ్చారు.
దాని ప్రకారం ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం చేస్తున్నట్టు దానికి సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కావాల్సినంత ఇసుకకి బ్యాంకులో చలానా కట్టాలి. దానిని తీసుకెళ్లి తహాశీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే ఇసుక ర్యాంపు కేటాయిస్తారు.
ప్రభుత్వం కేటాయించిన స్టాక్ పాయింట్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో ఇసుక డెలివరీ అవుతోంది. ఇసుక కూడా ప్రభుత్వం ఏది పంపిస్తే అది సరఫరా అవుతుంది. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ కావడం, అదే సమయంలో ఆన్ లైన్ ఇసుక బుకింగ్స్‌ని కొందరు హైజాక్ చేయడం, ఇసుక సరఫరాకి ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందనే అభిప్రాయంతో పలువురు ఇసుక వ్యాపారులను ఆశ్రయించడం పెరిగింది.
విజయవాడకి చెందిన తిరుమలశెట్టి వెంకటేశ్ బీబీసీతో మాట్లాడుతూ తన అనుభవాన్ని ఇలా వివరించారు.
"సెప్టెంబర్‌లో ఇంటి నిర్మాణం కోసం ఇసుక అవసరం అయ్యింది. ఆన్‌లైన్ లో బుక్ చేద్దామని చూశాను. కానీ రెండు రోజులు ప్రయత్నం చేసినా అది తెరిచిన కొన్ని నిమిషాల్లో మాకు కేటాయించిన స్టాక్ పాయింట్ లో ఇసుక నిల్వ లేదనే చూపించేంది. దాంతో ఈ సమస్య ఎందుకని చివరకు స్థానికంగా ఉన్న వ్యాపారిని ఆశ్రయిస్తే ఇసుక పంపించారు. ప్రభుత్వం రవాణా చేస్తే లారీ ఇసుకకి రూ.2,900 తీసుకుంటారు. కానీ, నేను రూ. 6,000 చెల్లించాల్సి వచ్చింది. ఆన్‌లైన్లో మాకు దొరకని ఇసుక కొందరు వ్యాపారుల వద్ద మాత్రం లభించడంపై మైనింగ్ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫిర్యాదు చేశాను. కానీ ఫలితం రాలేదు. మళ్లీ ఇసుక అవసరమైన ప్రతీసారి ఇదే పద్ధతిలో దళారుల దగ్గరే కొనుక్కుంటున్నాను" అంటూ ఆయన వివరించారు.
ఆన్‌లైన్ మోసాలను గుర్తించిన ప్రభుత్వం
రాష్ట్రంలో అందరికీ ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో లేకపోవడం, ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకునే విధానాన్ని కొందరు అక్రమమార్గంలో వినియోగిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇసుక బుకింగ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ని హ్యాక్ చేస్తున్న కొందరిని గుర్తించింది. వారిపై కేసులు కూడా నమోదు చేసింది.
అయినా ఈ వ్యవహారం నియంత్రణలోకి రాలేదు. దాంతో ప్రస్తుతం పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే ఇసుక బుక్ చేసుకోవాలనే నిబంధనను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇసుకను కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలోనే తీసుకెళ్లాలనే నిబంధన కూడా సవరించాలని యోచిస్తోంది. ఇసుక ధరతో పాటుగా రవాణా చార్జీలు కూడా కలిపి వసూలు చేస్తుండడం వల్ల ఇసుక ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఇసుక విధానంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ధరణకు వచ్చింది.
అనేక చోట్ల సరైన పరిమాణంలో ఇసుక సరఫరా కావడం లేదని, ఆర్డర్ చేసిన వారి ఇంటికి సక్రమంగా ఇసుక రవాణా కాకపోవడం వంటి విషయాలను కూడా ఉపసంఘం గుర్తించింది.
కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తం కూడా వసూలు చేస్తున్నారని గుర్తించి, మళ్లీ ఇసుక విధానంలో మార్పులు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
‘మార్పులకు సూచనలు చేయండి’
గత ఏడాది నుంచి అమలవుతున్న ఇసుక విధానంపై ఆరంభం నుంచి విమర్శలు వస్తున్నాయి. చివరకు మంత్రులకు కూడా ఇసుక విషయంలో చేదు అనుభవాలున్నాయి.
అమలాపురంలోని తన ఇంటి నిర్మాణం కోసం ఇసుకను బుక్ చేసుకున్న ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు గతంలో ఆయన కోరుకున్న ఇసుక కాకుండా, కేవలం పునాదులను నింపేందుకు ఉపయోగపడే ఇసుక సరఫరా కావడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.
ఇసుక ధరలు, రవాణా చార్జీలు, ఆన్‌లైన్ కష్టాలు, కొరత, అక్రమ రవాణ వంటి అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి.
ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు సీహెచ్ రాజ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ "ఇసుక విధానంతో మొదటి నుంచి సమస్యలే. పటిష్ఠమైన ఇసుక విధానం అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అంతకుముందు ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలన్నీ ఆ తర్వాత కూడా కొనసాగాయి. ఇసుక ర్యాంపుల వద్ద కొందరు స్థానిక నాయకుల పెత్తనం యథావిధిగా నడుస్తోంది. అక్రమ రవాణాకు అడ్డంకులు నామమాత్రమే. రాష్ట్ర ప్రజల అవసరాల కన్నా అధిక ధరలకు అమ్ముకునేందుకు ఇతర ప్రాంతాలకు నిత్యం ఇసుక రవాణా సాగుతోంది. అడ్డుకునే వారే లేరు. కానీ, సామాన్యుడికి మాత్రం ఈ విధానం చుక్కలు చూపిస్తోంది. ఇసుక కావాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ధరలు తగ్గించి, రవాణా ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తే కొంత ఉపశమనం వస్తుంది" అని అభిప్రాయపడ్డారు.
కొత్త ఇసుక విధానం కోసం ప్రజలు తమ సూచనలు, సలహాలు పంపించాలని ప్రభుత్వం కోరుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలతో పాటుగా ప్రజల సూచనలు పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన, పారదర్శకంగా ఇసుక విధానం రూపొందిస్తామని చెబుతోంది.
‘ఎవరు వచ్చినా అంతే’
ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుక చుట్టూ వివాదాలు సర్వసాధారణమవుతున్నాయి.
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనూ మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. ఇసుక మాఫియాతో చేతులు కలిపారని విమర్శలు వచ్చాయి. తొలుత స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్‌లతో పాటు పంచాయితీలకు కూడా సీనరేజ్ చెల్లించి ఇసుక తవ్వకాలు జరుపుకునే అవకాశం ఉండేది. అలా ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్లు హద్దులు మీరి నదీ గర్భాలను ఇష్టారాజ్యంగా ఛిద్రం చేయడంతో పలు సమస్యలు వచ్చాయి. చివరకు నదీ ప్రవాహానికి కూడా ఇసుక తవ్వకాల మూలంగా ఆటంకాలు ఏర్పాడ్డాయి.
ఆ తర్వాత ప్రభుత్వ విధానంలో మార్పులు చేస్తూ ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలిచి కాంట్రాక్టులు అప్పగించారు. ఆ టెండర్ల విధానంలో కూడా అవతకవకలు, కాంట్రాక్టర్ల అవినీతి జరిగిందంటూ పెను దుమారం రేపింది. చివరకు చంద్రబాబు పాలనా కాలంలో తొలుత ఇసుక తవ్వకాలకు డ్వాక్రా మహిళా సంఘాలను రంగంలోకి తెచ్చారు. ఇసుక ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం మహిళలకు చెల్లిస్తామంటూ కాంట్రాక్టర్ల వ్యవస్థకు ముగింపు పలికారు.
కానీ, డ్వాక్రా మహిళల పేరుతో మళ్లీ ఇసుక అక్రమార్కుల హవా మొదలుకావడంతో గత ప్రభుత్వమే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. నేరుగా ప్రభుత్వ సిబ్బంది ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేకుండా ఉచితంగా ఇసుక తవ్వకునేందుకు అనుమతులిచ్చింది. అయినా అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు దానిని సొమ్ముచేసుకునేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
చివరకు కృష్ణానదీ తీరంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ జరిమానా కూడా విధించింది. ఇక ప్రస్తుత జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో రెండోసారి ఇసుక విధానంలో మార్పులకు సిద్ధం కావడం చూస్తుంటే ఇసుక సమస్య కొలిక్కిరాలేదని స్పష్టమవుతోంది.
‘ముందే హెచ్చరించాం’
ఏపీలో జగన్ ప్రభుత్వం ఇసుక విషయంలో ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలుజేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.
"ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎంతో మేలు కలిగింది. చంద్రబాబు ప్రజలకు అనుకూలంగా ఇసుక విధానం రూపొందించారు. కానీ, జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల తరబడి ఇసుక లేకుండా చేసి నిర్మాణాలు నిలిచిపోవడానికి కారణమయ్యారు. ఆ తర్వాత తీసుకొచ్చిన విధానం ఆన్‌లైన్ అంటూ అనేక అవస్థలు పాలుజేసింది. నేటికీ ఆన్‌లైన్‌లో ఇసుక అంతా బడాబాబులు బుక్ చేసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. సామాన్యులు మాత్రం ఆ ఇసుకను ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ విధానం విఫలమవుతుందని ముందే టీడీపీ తరుపున చెప్పాం. అయినా, ప్రభుత్వానికి చెవికెక్కలేదు. ఇప్పుడు కూడా పారదర్శకత లేకుండా అవినీతి, అక్రమాలకు ఇసుక విధానాన్ని అనుకూలంగా మారుస్తున్నారు. ఇది ఏపీ ప్రజలకు అన్యాయం చేసేందుకు ఉపయోగపడుతుంది" అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి ఆశోక్ బాబు బీబీసీతో అన్నారు.
‘ప్రధాన నగరాలకు పెద్ద మొత్తంలో తరలిపోతోంది’
గోదావరి తీరంలో తవ్వుతున్న ఇసుకను కూడా ఇతర ప్రాంతాలకు ఎక్కువగా తరలిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన కూచిపూడి రవి శేఖర్ అంటున్నారు.
"గోదావరి ఒడ్డున ఉన్న మాకు ఇసుక దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ , విశాఖ వంటి నగరాలకు మాత్రం ఇక్కడి నుంచి ఇసుక వెళుతోంది. ప్రభుత్వం రికార్డుల్లో స్థానిక అవసరాలకే ఇసుక అందిస్తున్నామని చెబుతుంటారు. కానీ ఆచరణలో అందుకు భిన్నం. మా కళ్లెదురుగా భారీ వాహనాల్లో ఇసుక రవాణా నేటికీ సాగుతోంది. అలాంటివాటికి అడ్డుకట్ట వేయకుండా, ఇసుక విధానంలో తీసుకొచ్చే మార్పులు అసలు సమస్యలను తీర్చవు" అని ఆయన అన్నారు.
‘సమస్యలు తీర్చడానికే విధాన మార్పులు’
ఇసుక విధానం పటిష్ఠంగా ఉన్నప్పటికీ అమలులో వస్తున్న సమస్యలను తీర్చేందుకే విధానంలో సవరణలు చేయాలని సంకల్పించామని ఏపీ పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
"రాష్ట్రంలో ఇసుక విధానంలో లోపాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. పలుమార్పులకు ప్రతిపాదనలు చేసింది. వాటితో పాటుగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. సమగ్ర విధానంగా రూపొందించబోతున్నాం. ర్యాంపుల వద్ద నేరుగా డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేందుకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలలో మాత్రమే ఇసుక తీసుకెళ్లాలనే నిబంధన తొలగిస్తాం. నదుల పక్కనే ఉన్న వారు సొంత అవసరాలకు ఎడ్లబండిపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రతిపాదించాం. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తున్న వారికి అడ్డుకట్ట వేస్తాం. ఎక్కువ ధరలకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం" అంటూ వివరించారు.
ఏపీ ఇసుకకు ఎందుకంత డిమాండ్?
ఇసుక అక్రమాలపై ఏపీలో స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఎస్ఈబీ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ఇచ్చిన సమాచారం మేరకు సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తంగా 18వేల మెట్రిక్ టన్నుల ఇసుకను, వాటిని తరలిస్తున్న వాహనాలతో పాటుగా సీజ్ చేశారు.
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇసుక కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండడంతో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఇసుకను ఎగుమతి చేస్తారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇసుకకి హైదరాబాద్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంది. దానికి కారణాలను హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేవీ చౌదరి వివరించారు.
"ప్రధాన నదులన్నీ ఆంధ్రప్రదేశ్ వద్దే సముద్రంలో కలుస్తాయి. కాబట్టి వందల కిలోమీటర్ల నదీ ప్రయాణంలో ఇసుక నాణ్యత బాగా పెరుగుతుంది. ఆ ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎంత నాణ్యతతో కూడిన సిమెంట్ వాడినప్పటికీ ఇసుక అందుకు తగ్గట్టుగా లేకపోతే నిర్మాణాలు పటిష్ఠంగా ఉండవు. కాబట్టే ఏపీలోని కృష్ణా , గోదావరి తీరంలో తవ్వి తీసుకొచ్చే ఇసుకను తమ నిర్మాణాలకు వాడేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతూ ఉంటారు. ఏపీలో ప్రభుత్వాలు ఇసుక రవాణా మీద కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. అయినప్పటికీ జంటనగరాల్లో నిర్మాణాలకు ఇసుకకు ఢోకా లేకుండా పోతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)