న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం

    • రచయిత, దుర్గం రవిందర్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరస ప్రతికూల తీర్పులతో ఇబ్బంది పడ్డ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టుతో పాటు "సహేంద్ర తక్షకాయ స్వాహా" అనే రీతిలో ఏకంగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమించడం, గళమెత్తడం ఇటీవల చర్చ నీయాంశం అయ్యింది.

దీనిపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతున్నది. కొందరు ముఖ్యమంత్రి చర్యను తప్పుపట్టగా ఇంకొందరు న్యాయవ్యవస్థ అన్యాయాలపై ఏకరువు పెడుతున్నారు.

న్యాయవ్యవస్థ న్యాయంగానే నడుస్తున్నదా అన్నది ప్రశ్న. ఇది ఇప్పటి గొడవ కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ గొడవ మాత్రమే కాదు. జస్టిస్ చంద్రారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కూడా దశాబ్ధాల క్రితం ఫిర్యాదు పత్రం దిల్లీకి పంపారు.

నిజానికి వివాదం వెనుక ఉన్నది రెండు పార్టీలు, రెండు కులాల మధ్య గొడవ. లోపాయికారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి సీనియారిటీని కాదని తమకు అనుకూలంగా ఉండే న్యాయమూర్తిని తెచ్చుకోవడానికి కేంద్ర వ్యూహం ఇందులో మిళితమైందని కూడా అనుకోడానికి ఆస్కారం కనిపిస్తున్నది.

సాధారణంగా పాలకులు తమకు అనుకూలమైన వారిని హైకోర్టు జడ్జిలుగా నియమించుకుంటున్నారని కొందరు రిటైర్ట్ న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు జడ్జీలు కొందరు గతంలో తమను నియమించిన పార్టీ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ పాలక పార్టీని ఇరుకున పెట్టే తీర్పులు, వ్యాఖ్యలు చేశారన్నది పాలక పార్టీ వారి ఆరోపణల సారాంశం.

ఒక్కటి నిజం, ఈ దేశంలో జనతా పార్టీ తర్వాత అన్ని రకాల రాజకీయ నియామాకాల్లో కులం ప్రధాన అంశంగా మారింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన పి. శివశంకర్‌ను హైకోర్టు ఆవరణలో ఒక జడ్జి గేలి చేస్తూ, రానున్న 25 ఏళ్ళు నా కులం వాళ్ళు ఈ కోర్టును ఏల బోతున్నారు అని అన్నాడని బాధపడుతూ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆక్షేపిస్తూ అమరావతి న్యాయవాది ఒకరు సుప్రీంకోర్టుకు లేఖ రాసి, ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. తన లేఖను పిల్‌గా విచారించేందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిందని, న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపిస్తామని హైకోర్టు న్యాయవాది ప్రకటించారు.

అంటే, ఈ వాదనకు సుప్రీంకోర్టు వత్తాసు పలుకుతున్నదా అనే అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే ఒక అడ్వకేట్ లేఖను "పిల్"గా స్వీకరించడం యాధృచ్ఛికం కాదని ఒక విశ్రాంత న్యాయమూర్తి అన్నారు.

సీనియార్టీ ప్రకారం తదుపరి చీఫ్ జస్టిస్ కావాల్సిన జస్టిస్ ఎన్.వి.రమణను తప్పించడానికి కేంద్రం కదుపుతున్న పావు ఆంధ్రా హైకోర్టు గొడవ కూడా అయి ఉండవచ్చని తెలంగాణ బార్ కౌన్సిల్ సబ్యుడు కొండల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సీనియార్టీలో నాల్గవ స్థానంలో ఉన్న ఉదయ్ లలిత్‌ను తదుపరి సి.జె.గా నియమించడానికి జస్టిస్ రమణ, సీఎం జగన్ మోహన్ రెడ్డిల గొడవను కేంద్ర ప్రభుత్వం పావుగా వాడుకుంటున్నదని కూడా భావించడానికి ఆస్కారం కనిపిస్తున్నది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తరువాతే ఫిర్యాదు లేఖను బహిరంగం చేశారు కాబట్టి.. దీనికి కేంద్రం లోపాయికారీ ఆమోదం ఉందనుకోవచ్చని కూడా సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.

నిజానికి న్యాయవ్యవస్థ పై ప్రజలకు తొలగుతున్న విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ఇలాంటి సందర్భాలను సుప్రీంకోర్టు వినియోగించుకోవాలి. కానీ, పరిస్థితి అందుకు బిన్నంగా కనిపిస్తున్నది.

జడ్జీల నియామకం రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మెరిట్, నిజాయితీల ఆధారంగా జరగాల్సి ఉంది. లేదా సుప్రీంకోర్టు ప్రతిష్ట మరింత మసక బారే ప్రమాదం ఉంది.

ఇటీవల ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా పదవీ విరమణ చేసిన వెంటనే రాజ్యసభ సబ్యుడిగా నామినేట్ కావడం లాంటి సంఘటనలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ట కొంత మసక బారిన సంగతి అందరికీ తెలిసినదే.

ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు పాలించే ప్రభుత్వాలకు ప్రశ్నలు, విమర్శలు మామూలే. ఇలాంటి అనేక సంఘటనలను గమనించిన ప్రజలు ఓటు ద్వారా తుది తీర్పునిస్తారు. అయితే, వారికి అయిదేళ్ళకు ఒకసారి అవకాశం వస్తుంది, పైగా వారి తీర్పుకు పరిమితులు ఉంటాయి.

ఏ కోర్టు తీర్పు అయినా రాజ్యాంగానికి లోబడి, చట్ట సభలు చేసిన చట్టాలను అనుసరించి ఇవ్వాల్సి ఉంటుంది. పైగా మన దేశంలో ధర్మం అనేది ఒకటి ఉంది. తీర్పు ధర్మ బద్ధమైనదిగా ఉండాలి, సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉండకూడదు. అలా ఉండనప్పుడే ఇలాంటి గొడవలన్నీ బయటకు వచ్చేది.

న్యాయస్థానం న్యాయం అందించటానికి సిద్ధంగా లేకపోతే? లేదా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే అది ఏ కోర్టు అయినా ఏ దేశంలో అయినా ప్రశ్నించాల్సిందే. ప్రశ్నిస్తున్న వారు ఎవరు, వారు నీతి మంతులా, వారికి అవకాశం వస్తే నీతిమంతంగా ఉంటారా! అనే వాదనలు ఈ సందర్భంలో అప్రస్తుతం.

గతంలో పలు సందర్భాల్లో న్యాయస్థానానికి, చట్ట సభలకు - న్యాయస్థానానికి మీడియాకు మధ్య విభేదాలు పొడసూపాయి. ప్రతిసారి మా శీలాన్ని శంకిస్తారా, జాగ్రత్త కోర్టు ధిక్కార నేరం అవుతుంది అని గడసరిగా తప్పించుకునే వారు.

ప్రజాస్వామ్యంలో అది ఏ వ్యవస్థ అయినా ట్రాన్స్పరెంట్‌గా, ప్రశ్నించడానికి వెసులుబాటు ఉండేట్లుగానే ఉండాలి. ఒకసారి పీఠమెక్కాం కాబట్టి మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు అనడానికి వీలు లేదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 చట్టం ముందు అంతా సమానులే అని చెప్తున్నది. అంటే జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఏమీ ఇవ్వలేదు కదా? జడ్జీలు ఈ సమాజపు మనుష్యులే, మనుషుల్లో ఉండే సహజ బలహీనతలు, పక్షపాత ధోరణులు జడ్జీలకు ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారిని ప్రశ్నించాల్సిందే, వేలెత్తి చూపాల్సిందే.

సుప్రీంకోర్టు, హైకోర్టు అన్యాయాలపై జడ్జీలు రాసిన పుస్తకాలే ఉన్నాయి. జడ్జీలు పక్షపాతులుగా ఉండే అవకాశం ఉందని "డాక్ట్రిన్ అఫ్ బయాస్" చెబుతున్నది.

అయితే, రాజకీయ ఉద్దేశాలతో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పోగెట్టే ప్రయత్నాలు చేస్తే దాని పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇదో ధర్మసంకటం. వ్యవస్థలు అందులో కీలకపదవుల్లో ఉన్నవారు విలువలతో వ్యవహరిస్తే ఈ సమస్య రాదు కానీ మనం అలాంటి పరిస్థితుల్లో లేము.

ప్రజాస్వామ్యం నాలుగు మూలస్తంభాలలో న్యాయవ్యవస్థ ఒకటి. ఆ స్తంభానికి బీటలు వస్తే మరమ్మత్తు చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అమరావతి హైకోర్టుకు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని ఆక్షేపించే బదులు అందులో ఉన్న ఆక్రోశాన్ని అర్థం చేసుకుని, బీటలు వారుతున్న న్యాయవ్యవస్థకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)