బ్యాట్‌మన్ ఎఫెక్ట్: ఆందోళన తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సింపుల్ టెక్నిక్.. ‘ఆల్టర్ ఈగో’

పెద్ద పెద్ద స్టార్లు తమలో ఎంత టెన్షన్ ఉన్నా కూడా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు ఆ కంగారు, ఆందోళన కనిపించనివ్వకుండా స్థితప్రజ్ఞత, సంకల్పం ఎలా చూపగలుగుతారు?

బియాన్స్, ఆడెల్‌ వంటి పాప్‌స్టార్‌లు ఈ విషయంలో తమ సక్సెస్ వెనుక సీక్రెట్ బయటపెట్టారు. అది.. ఆల్టర్ ఈగో. అంటే తమలోని కాల్పనిక వ్యక్తిత్వాన్ని బయటకు తీయడం.

పరకాయ ప్రవేశం అనే మన పాత సినిమాల్లో కాన్సెప్ట్‌కు దగ్గరగా కనిపించే సైకలాజికల్ టెక్నిక్ ఇది.

బియాన్స్ కాల్పనిక వ్యక్తిత్వ అవతారం(ఆల్టర్ ఈగో) సాషా ఫియర్స్‌. ఒకే రూపంలోని వేరొక అవతారం ఇది. సాషా ఫియర్స్‌గా ఆమె చాలా దృఢమైన, సాధికార మహిళ.

బియాన్స్ అదనపు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన ఇచ్చేందుకు ఈ కాల్పనిక వ్యక్తిత్వ అవతారం సాషా ఫియర్స్ మార్గమేర్పరిచింది.

''సాధారణంగా గమకాలు నా చెవిన పడినాక.. ఆందోళనగా ఉన్నప్పుడు నాలోని సాషా ఫియర్స్ బయటకొస్తుంది. అప్పుడు నా మాట తీరు, ధోరణి అన్నీ మారిపోతాయి.'' అని 2008లో ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బియాన్స్ చెప్పారు.

2010 వరకు బియాన్స్ ఇదే వ్యూహం అమలుచేశారు.

తనకు తగినంత మానసిక పరిపక్వత ఉంది.. ఈ మానసిక ఊత ఇక చాలు అనుకున్న తరువాత ఆమె సాషా ఫియర్స్‌ను బయటకు తీయడం మానేశారు.

బియాన్స్‌తో ఒక ఉద్వేగభరిత భేటీ అనంతరం ప్రేరణ పొందిన ఆడెల్ కూడా తన ఆల్టర్ ఈగో గురించి చెప్పారు. 2011లో రోలింగ్ స్టోన్ మ్యాగజీన్‌తో మాట్లాడిన ఆడెల్ తాను సృష్టించిన కాల్పనిక అవతారం సాషా కార్డర్ సంగతులు చెప్పారు.

బియాన్స్ సృష్టించుకున్న ఊహా వ్యక్తిత్వం సాషా ఫియర్స్, అమెరికా పాప్ సింగర్ జూన్ కార్టర్‌ల మేళవమే ఈ సాషా కార్టర్‌.

ఈ ఊహా అవతారం తాను అత్యుత్తమ ప్రదర్శనలు ఇవ్వడానికి సాయపడిందని ఆడెల్ చెప్పారు.

ఈ కాల్పనిక వ్యక్తిత్వ అవతారం పాప్ తారలకు గిమ్మిక్కులా అనిపించినప్పటికీ.. ఈ వ్యూహం వల్ల కొన్ని వాస్తవ మానసిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

కాల్పనిక అవతారాన్ని స్వీకరించడమనేది తన నుంచి తాను దూరమవడానికి పరాకాష్ఠ.

''స్వీయ దూరం అనేది విషయాలు, పరిస్థితుల గురించి హేతుబద్ధంగా ఆలోచించేందుకు అదనపు అవకాశమిస్తుంద''న్నారు న్యూయార్క్‌లో హామిల్టన్ కాలేజ్ మనస్తత్వ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ వైట్.

ఇది ఆందోళన వంటి అవాంఛనీయ మానసిక స్థితులను నియంత్రించడానికి... సవాలుగా మారిన పనులను పూర్తి చేయడానికి తగిన పట్టుదల కలిగించడానికి తోడ్పడుతుందన్నారు రాచెల్.

దృక్పథంలో మార్పు

మిషిగన్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసే ఎథాన్ క్రాస్ గత దశాబ్దాకాలంగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.

దృక్పథంలో చిన్నపాటి మార్పు చేసుకున్నా కూడా భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి అది ఎంతగానో తోడ్పడుతుందని క్రాస్ అంటారు.

అలాంటి ఒక అధ్యయనంలో పాల్గొన్నవారిని సవాలుగా మారిన ఒక సంఘటన లేదా విషయం గురించి రెండు రకాలుగా ఆలోచించమని అడిగారు.

ఆ సవాలులో చిక్కుకున్నవారిగా కొందరు.. బయట నుంచి ఆ సవాలును చూస్తున్నవారిగా మరికొందరిని విభజించి ఆ ఊహను చిత్రించమన్నారు.

ఆ సవాలులో చిక్కుకున్నట్లుగా భావించిన గ్రూపులో ఎక్కువగా ఆందోళన, ఆత్రుత కనిపించగా.. బయట నుంచి దాన్ని చూసిన బృందంలో అంత ఆందోళన ప్రస్ఫుటం కాలేదు.

ఇలాంటి ఇతర ప్రయోగాల్లోనూ ఇవే ఫలితాలొచ్చాయి. తనకు తాను దూరంగా ఉన్నట్లుగా ఊహించుకున్న స్థితిలో వ్యక్తులు ఉద్వేగాలను నియంత్రించుకోగలగుతున్నారని గుర్తించారు.

లక్ష్యంపై గురి పెట్టిస్తుందా?

సెల్ఫ్ డిస్టెన్సింగ్ వల్ల ఆందోళన, ఆత్రుత నుంచి బయటపడడం వంటి సానుకూల ఫలితాలు వచ్చి మరింత పెద్ద విషయాలపై దృష్టి పెట్టడానికి అవకాశమేర్పడుంది.

ఘటనానంతర తక్షణ భావాల గేలాలకు చిక్కుకోకుండా విస్తృత స్థాయి వీక్షణమనేది దీనితో సాధ్యపడుతుంది.

సంకల్పబలం కలిగేలా చేసి ఎన్నో దృష్టి మళ్లింపుల మధ్య కూడా ఏకాగ్రత సాధించి లక్ష్యంపై గురిపెట్టేలా చేస్తుందా ఇది? అని పరిశోధకులు ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ఆల్టర్ ఈగో.

బ్యాట్‌మన్ ఎఫెక్ట్

సెల్ఫ్ డిస్టెన్సింగ్ సంకల్పబలాన్ని పెంచుతుందనేది చైల్డ్ సైకాలజిస్టులకు ఆసక్తికర అంశం. విద్యా ప్రజ్ఞ సాధనకు స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యమని భావిస్తారు కాబట్టి వారికి ఇది ఆసక్తికర అంశమే.

కొన్నేళ్ల కిందట అసిస్టెంట్ సైకాలజీ ప్రొఫెసర్ వైట్ ఆరేళ్ల వయసున్న కొందరు పిల్లలకు ఒక ఏకాగ్రత పరీక్ష పెట్టారు. కంప్యూటర్లో పెట్టిన ఈ పరీక్షలో వరుసగా కొన్ని ఫొటోలు కనిపిస్తుంటాయి. వాటిలో చీజ్ కనిపించిన ప్రతిసారీ పిల్లలు స్పేస్ బార్ నొక్కాల్సి ఉంటుంది.

ఈ పరీక్ష పెట్టినప్పుడు వారికి అంతకంటే సరదా కలిగించే ఆట ఉన్న ఐప్యాడ్ ఇచ్చి ఏకాగ్రత చెదిరేలా చేశారు.

ఈ క్రమంలో విసుగు చెందితే 'నేను చాలా కష్టపడుతున్నానా'' అని కొందరు అనుకోవాలని.. ఒక గ్రూపు పిల్లలు మాత్రం తమ స్థానంలో బ్యాట్‌మన్, డోరా వంటి తమకిష్టమైన కార్టూన్ కేరక్టర్లను ఊహించుకుని .. కావాలంటే ఆ కేరక్టర్లలా డ్రెస్ వేసుకోవచ్చని.. వారికి ఈ పరీక్షలో విసుగు కలిగినప్పుడు ''ఏమిటి బ్యాట్‌మన్ బాగా కష్టపడిపోతున్నాడా'' అనుకుంటూ అచ్చం ఆ కార్టూన్ కేరక్టర్లా ఆలోచించాలని సూచించారు.

అంటే ఈ కార్టూన్ కేరక్టర్లను తమ స్థానంలో ఊహించుకున్న పిల్లలపై ఆల్టర్ ఈగో ప్రయోగం జరిగింది.

ఆల్టర్ ఈగో వల్ల సెల్ఫ్ డిస్టెన్సింగ్ తీవ్రంగా ఉంటుందన్న పరిశోధకుల ఊహకు తగ్గట్లుగానే ఈ అధ్యయన ఫలితాలు వచ్చాయి.

'నేను' అనుకుంటూ ఏకాగ్రత పరీక్షలో పాల్గొన్న పిల్లలతో పోల్చితే కార్టూన్ కేరక్టర్లను తమ స్థానంలో ఊహించుకుని పరీక్షలో పాల్గొన్న పిల్లలు ఎక్కువ ప్రతిభ చూపారు. ఈ టాస్క్‌లో ఇచ్చిన టైంలో 'నేను' గ్రూపు పిల్లలు ఉపయోగించుకున్న టైం కంటే ఆల్టర్ ఈగో గ్రూపు పిల్లలు 23 శాతం ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉన్నట్లు గుర్తించారు.

సంక్లిష్టమైన నిబంధనలుండి.. అవి తరచూ మారిపోతుండే ఒక ఆటలో పాల్గొన్న పిల్లల్లో కూడా ఆల్టర్ ఈగోను స్వీకరించినవారు ఏకాగ్రతతో ఆడి మెరుగైన ప్రదర్శన చేసినట్లు వైట్ గుర్తించారు.

ఇంట్లో టీవీ, సెల్ ఫోన్ వంటి ఆకర్షణల మధ్య హోం వర్క్ చేయాల్సిన వచ్చినప్పుడు పిల్లలు ఈ ప్రయోగం ద్వారా ఏకాగ్రతతో పనిచేసుకోవచ్చని వైట్ ఆశిస్తున్నారు.

కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు కలిగే నిస్పృహ, చిరాకులను అధిగమించడానికి తమ కంటే సమర్థులను తమ స్థానంలో ఊహించుకుంటూ పనిచేయడం లాభించొచ్చంటారు వైట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)