మెదక్: పాపన్నపేటలో బోరుబావిలో పడిన బాలుడు మృతి

ఈ బావిలోనే బాలుడు పడిపోయాడు

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, ఈ బోరుబావిలోనే బాలుడు పడిపోయాడు

మెదక్ జిల్లాలో బోరు బావిలో పడిన సాయి వర్థన్ మరణించాడు. ఈ మూడేళ్ల బాలుడు నడుస్తూ నడుస్తూ అప్పుడే వేసిన బోర్ బావిలో పడ్డాడు. అతణ్ణి రక్షించడానకి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మెదక్ జిల్లా పాపన్న పేట దగ్గర్లోని పోడ్చనపల్లి అనే ఊరిలో ఘటన జరిగింది. బుధవారం రాత్రి తల్లి తండ్రులతో కలిసి పొలంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. అతను బావిలో పడ్డ తరువాత వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్సు అక్కడకు చేరుకున్నాయి. బావిలోకి ఆక్సిజన్ అందించారు.

బోరు లోతు 150 అడుగులు ఉన్నప్పటికీ, బాబు సుమారు 25 అడుగుల లోతులో ఉంటాడని అంచనాకు వచ్చారు. ప్రొక్లెయిన్లు పెట్టి బోరుకు సమాంతరంగా తవ్వారు. కానీ అప్పటికే ఫలితం లేదు. బాబు శరీరం మట్టి పొరల కింద దొరికింది.

ప్రమాదం జరిగిన పొలం చనిపోయిన బాబు తాతదే. భిక్షపతి అనే వ్యక్తి కూతురు నవీన కొడుకు ఈ సాయి వర్థన్. వాళ్లు మంగళవారం ఒక బోరు, బుధవారం రెండుబోర్లు ఆ పొలంలో వేయించారు. కానీ ఫలితం లేదు. మూడు బోర్లలోనూ నీళ్లు రాలేదు. బుధవారం సాయంత్రం నీరు పడకపోవడంతో, నిరాశగా ఆ కుటుంబం అంతా పొలం నుంచి వెళ్లిపోతున్నప్పుడు ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది.

అధికారులు అంతా అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించారు. ''అనుమతి లేకుండా బోర్లు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులు బోరు వేసిన రిగ్గు యజమాని కూడా బాధ్యులే. బోరు బావులపై అవగాహన లేక కాదు. అయినా ఇలానే చేస్తున్నారు కొందరు.'' అని వ్యాఖ్యానించారు జిల్లా కలెక్టర్ ధర్మా రెడ్డి.

బాబు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)