ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్ట్ హత్య: వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు... ఎస్సై సస్పెన్షన్

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలు ఘటనలు జరిగాయి.
నెల్లూరులో స్థానిక పత్రికా విలేకరి డోలేంద్ర ప్రసాద్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా దూషిస్తున్నట్టుగా కొన్ని ఆడియో క్లిప్పులు ప్రచారమయ్యాయి.
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్ట్‌పై హత్యాయత్నం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ విలేకరిపై దాడి జరిగింది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కాతా సత్యనారాయణ అనే విలేకరి హత్యకు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో కూడా పేకాట క్లబ్బుల వీడియో తీశారనే కారణంతో విలేకరిపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడుల వెనుక పాలక పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై జర్నలిస్ట్ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా తుని, జలుమూరుల్లో కేసులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో అక్కడి పోలీసులపై చర్యలు తీసుకుంటూ డీజీపీ శనివారం(19.10.2019) చర్యలు తీసుకున్నారు.

తునిలో ఏం జరిగింది? విలేకరి హత్యకు కారకులెవరు?
తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి మండల ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరిగా సత్యనారాయణ పనిచేస్తున్నారు. పదిహేనేళ్లుగా ఆయన ఈ వృత్తిలో ఉన్నారు. రాజకీయంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబానికి పట్టున్న ప్రాంతంలో వారికి సన్నిహితంగా ఉండేవారని స్థానిక మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సత్యనారాయణ సోదరుడు కాతా గోపాలకృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో పదవి కూడా నిర్వహించారు. ఆ క్రమంలోనే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన వైసీపీ నేత దాడిశెట్టి రామలింగేశ్వర రావు(రాజా)తో సత్యనారాయణకు విబేధాలు ఏర్పడ్డాయి.
మీడియా ప్రతినిధిగా ఎమ్మెల్యే కార్యక్రమాలకు కూడా సత్యనారాయణ హాజరయ్యే వారు కాదని పేరు ప్రస్తావించేందుకు ఇష్టపడని కొందరు విలేకరులు తెలిపారు.

ఫిర్యాదులకు పోలీసులు స్పందించలేదు: ఏపీయూడబ్ల్యూజే
కాతా సత్యనారాయణపై గత నెలలో దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేశాం. స్పందించి ఉంటే ఆయన ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉండేదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు.
ఆయన బీబీసీ తో మాట్లాడుతూ, "పోలీసుల వైఫల్యం వల్లే విలేకరి సత్యనారాయణ హత్య జరిగిందని భావిస్తున్నాం. తుని రూరల్ పోలీసులు అలసత్వం ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. సత్యనారాయణను బెదిరించిన ఆడియో రికార్డులను యూనియన్ తరఫున ఎస్పీకి తీసుకెళ్లి ఇచ్చినా స్పందించలేదు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లాం. నిర్లక్ష్యం వహించిన తుని రూరల్ ఎస్సైపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరాం. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, కుటుంబానికి 25లక్షల నష్టపరిహారం అందించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/Dadisetty Raja
హత్యకేసు దర్యాప్తు సాగుతుంది.. కేసులో ఏ6 గా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
కాతా సత్యనారాయణ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుండగా దారిలో అడ్డగించి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్న తుని రూరల్ సీఐ కిషోర్ బాబు ఆ వివరాలు బీబీసీ కి వెల్లడించారు. ''ఆరుగురిపై అనుమానాలతో కేసు నమోదు చేశాం. ఏ1గా గాది రాజుబాబు ఉన్నారు. గతంలో ఆయన ఫోన్ లో బెదిరించినట్టు ఫిర్యాదు ఉంది. సెప్టెంబర్‌లో దాడికి యత్నించిన ఘటనపైనా కేసు నమోదయ్యింది. ఇప్పుడు హత్య కేసులో ఏ6గా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉన్నారు. విచారణ సాగుతోంది. కొన్ని ఆధారాలు దొరికాయి. నిందితుల వివరాలు విచారణ తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం" అని చెప్పారు.

స్పందించిన ప్రెస్ కౌన్సిల్... ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు
విలేకరి సత్యనారాయణ హత్యపై ఆంధ్రప్రదేశ్ అంతటా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలు చేశాయి. హత్యని నిరసిస్తూ, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు హత్యపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. కేసు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమకు నివేదించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసింది. వీలయినంత త్వరగా నివేదించాలని పిసిఐ చైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
సత్యనారాయణ హత్య కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన అనుచరులను సంప్రదించగా వారు ఎమ్మెల్యే వచ్చిన తరువాత ఆయనే దీనిపై స్పందిస్తారని చెబుతున్నారు.
తుని ఎస్సై సస్పెన్షన్
జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసు నేపథ్యంలో తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో విలేకరిపై దాడి కేసులోనూ అక్కడి ఇంచార్జ్ ఎస్సై తోపాటు ఏఎస్సైని కూడా విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చీరాలలో ప్రజా సంఘం నేత నాగార్జున రెడ్డిపై దాడి.. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆమంచి కుటుంబీకులపై కేసు నమోదు
- పోలవరం రివర్స్ టెండరింగ్: ప్రభుత్వం ఏం సాధించింది? ప్రతిపక్షం ఏమంటోంది?
- డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు
- కోడెల శివప్రసాద్ 'ఆత్మహత్య'.. ప్రభుత్వ వేధింపులే కారణమన్న చంద్రబాబు
- అమరావతిపై నిపుణుల కమిటీ.. రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై సమీక్ష చేయాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








