డియర్ కామ్రేడ్ : ఫక్తు ఫార్ములా సినిమానే, కానీ..

ఫొటో సోర్స్, facebook/DearComradeTheFilm
- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
కామ్రేడ్ అనే టైటిల్ చూసి ఇదేదో సీరియెస్ సినిమా కాబోలు అని ఉత్సాహపడితే నిరాశపడతారు. అదేదో సీరియెస్ గొడవలాగుంది మనకెందుకురాబాబోయ్ అనుకుంటే మాంచి కాక్ టెయిల్ మిస్సవుతారు. చారణా అభ్యుదయానికి జాగ్రత్తగా బారణా మసాలా కోటింగ్ ఇచ్చి వడ్డించిన మెయిన్ స్ట్రీమ్ మసాలా సినిమా ఇది.
దర్శకుడికి ఇది తొలి సినిమా అని అసలు అనుకోలేం. కమర్షియల్ పరిధిలో చూసినపుడు సినిమా మేకింగ్ నైపుణ్యంలో కొదవ లేదు. కాకపోతే ఒక టికెట్‌పై మూడు సినిమాలు అందించారేంటి అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. తొలి అర్థభాగం చూస్తున్నపుడు అర్జున్ రెడ్డికి కొనసాగింపు చూస్తున్నామేమో అని అనుకున్నా అది ప్రేక్షకుడి తప్పు కాబోదు. సెకండాఫ్ స్లోమోషన్లో నడుస్తున్నట్టుగా అనిపించి ఆవులింతలు వస్తే అది కూడా తప్పు కాబోదు.
అయినా సినిమాను కొట్టిపారేయలేం. కనెక్ట్ కాగలిగిన ఎలిమెంట్స్ వాటి చుట్టూ అల్లిన మసాలా ప్యాకేజి ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. ఫార్ములా సినిమానే అయినప్పటికీ అనేకానేక రొడ్డ కొట్టుడు మసాలా సినిమాలకు దీనికి ఒక తేడా ఉంది. ఇందులో హీరోయిన్ కేవలం చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ నాలుగు పాటల్లో కనిపించి మెరిపించి మాయమయ్యే క్యారక్టర్ కాదు. సాపేక్షకంగా ఒక మోస్తరు స్ట్రాంగ్ క్యారక్టర్. సెన్సిబిలిటీకి అదొక సూచిక. అలాగే ఈ సినిమాలో చూపించిన ఇష్యూస్ ఫాన్సీవి కావు. నిజమైనవి.

ఫొటో సోర్స్, facebook/DearComradeTheFilm
డియర్ కామ్రేడ్‌లోని కొన్ని సీన్లలో మణిరత్నం గుర్తొస్తారు. మరికొన్ని సీన్లలో రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తారు. ప్రేమసాగరం, శివ దగ్గర్నుంచి గమ్యం దాకా చాలా సినిమాలు కళ్లముందు మెదులుతాయి. యువతను ఆకట్టుకునే అంశాలు ఏవేం ఉంటాయో కుప్పేసుకుని తెలంగాణ, ఆంధ్ర, డాన్సూ రోమాన్సూ కంటికి ఇంపైన లోకేషన్లు, ఇట్లా అన్ని ఎలిమెంట్స్‌ను తులాల కొద్దీ లెక్కలు కూడికలు తీసివేతలు వేసి తీసిన సినిమా లాగా అనిపిస్తుంది.
ఫస్ట్ ఆఫ్ కాకినాడలో నడిస్తే సెకండాఫ్‌కి హైదరాబాద్ సెంటర్ చేయడమేకాకుండా తప్పెట కొట్టి ప్రకటించినట్టు బోర్డులు అవీ చూపించి మరీ ఆ విషయాన్ని గుర్తుచేయడం, యూత్ అట్రాక్షన్ ఉన్న క్రికెట్ వంటి అంశాల చుట్టూ సినిమా అల్లడం, లిప్ లాక్ ను కాస్త ఎలాబరేట్ గా చూపెట్టడం, కాస్త హైక్లాస్ యూత్లో ఉన్న గ్లోబ్ ట్రెక్కర్ లక్షణాన్ని.. అంటే జిందగీ నహీ మిలేగా దుబారా తాలూకు వ్యవహారాన్ని రుచి చూపించడం వగైరాలన్నీ సినిమా కథ తనకు తానుగా ఎంచుకున్నవిగా కనిపించవు. మేథమేటిక్ ఈక్వేషన్ లాగా కనిపిస్తాయి.
ఏ ఎలిమెంట్ తగ్గితే ఎక్కడ ఏ ప్రేక్షుకులను కోల్పోతామో అని తమకు తెలిసిన దినుసులు, ద్రావకాలు అన్నీ వేసి కలిపిన కాక్ టెయిల్ లాగా అనిపిస్తుంది. కాకినాడ, హైదరాబాద్, లద్దాఖ్, ప్రేమా ఫ్రెంచికిస్సు, హీరో ఎలివేషన్, వగైరా చాలా మందికే తెలిసుండొచ్చు. కానీ ఈ దర్శకుడికి వాటితో పాటు ఎమోషనల్ కనెక్టు కూడా తెలుసు. అది తెలీకుండా ఎన్ని తెలిసినా సినిమా నిలవదు.

ఫొటో సోర్స్, facebook/DearComradeTheFilm
తెలివిగా కలిపిన కాక్ టెయిల్లో అంతగా కలిసిపోనిది స్టూడెంట్ పాలిటిక్స్. ప్రభుత్వ కాలేజీలు, హాస్టళ్ల ప్రభ తగ్గిపోవడంతో పాటుగా స్టూడెంట్ పాలిటిక్స్ హవా కూడా పోయింది. కొన్ని యూనివర్సిటీలు మినహాయిస్తే ఇపుడు సాధారణ అర్థంలో స్టూడెంట్ పాలిటిక్స్ ఒక రకంగా నోస్టాల్జియా. కాకపోతే ఇక్కడ సినిమా తీసిన వారికి ఉపయోగ పడే వాతావరణం ఒకటున్నది. ఇవాళ వామపక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ల కంటే బయటకొచ్చి అపుడపుడు నోస్టాల్జిక్గా పలవరించే వారి సంఖ్య ఎక్కువ. కాబట్టి అది మార్కెట్‌కు అడ్డంకి ఏమీ కాకపోవచ్చు.
చివర్లో హీరోయిన్ పాత్రతో కామ్రేడరీ గురించి చెప్పించి దానికి పోయెటిక్ జస్టిస్ తేవడానికి ప్రయత్నించినప్పటికీ సినిమా మొత్తం చూసినపుడు దేనికది విడివిడి ఎలిమెంట్స్ గానే ఉండిపోయాయి. .
స్టూడెంట్ పాలిటిక్స్ సినిమాగా మొదలయ్యి, లవ్ డ్రామాలోకి పీకల్లోతు దిగిపోయి అక్కడ్నించి స్త్రీలపై అణచివేత, లైంగిక దోపిడీలోకి టర్న్ తీసుకుని అక్కడ మలుపులు తిరిగి మళ్లీ కామ్రేడ్ గా ఉండడమనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పి ముగుస్తుంది ఈసినిమా. ఈ మూడూ మూడు సినిమాలుగా డిఫరెంట్ ట్రాక్స్‌లో నడుస్తున్నట్టు ఉంటుందది తప్పితే సీమ్ లెస్గా పెనవేసుకున్నట్టు ఒకదాంట్లోంచి మరొకదాంట్లోకి ప్రవహిస్తున్నట్టు ఉండవు. దేనిమీదా ఫోకస్ కుదరలే.

ఫొటో సోర్స్, facebook/DearComradeTheFilm
ప్రతి ఆడపిల్ల లైఫ్‌లో ఒక కామ్రేడ్ కావాలి అని హీరోయిన్ చేత పలికిస్తారు చివర్లో. మళ్లీ మేల్ సెంట్రిక్, హీరో సెంట్రిక్, ఇండివిడ్యువల్ సెంట్రిక్ వ్యవహారమే. ఫెమినిస్టు దృష్టితో చూస్తే ఇదా మీ స్వావలంబన సాధికారత అని విసుగొస్తుంది కానీ తెలుగు సినిమా ప్రమాణాల ప్రకారం చూస్తే ఫర్లే అనిపిస్తుంది.
ప్రేక్షకులకు చూపించడానికి ఒక శరీరం మాత్రమే కాకుండా కూసింత బుర్ర, ఒక గోల్ వగైరా లాంటివి కూడా హీరోయిన్‌కు ఉంటాయని చూపించారు. ఒక సీరియెస్ అంశాన్ని ఆ మేరకైనా చర్చించారు కదా అనిపిస్తుంది. ఒక మెట్టయినా పైకే కదా అని సరిపెట్టుకోవచ్చు.
మూడు విడివిడిగా అనిపించినప్పటకీ తాను అభ్యుదయం అనుకున్నదాన్ని మూడింటిలోనూ ఓ మేరకు చూపించే ప్రయత్నం చేశారు.
కథ ప్రకారం హీరోయినే సెంటర్ పాయింట్ అయినప్పటికీ తెరమీద తొలి అర్థభాగం హీరో సెంట్రిక్ గానూ.. రెండో అర్థభాగం హీరోయిన్ సెంట్రిక్ గానూ నడుస్తుంది. మామూలు తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం ఇందులోనూ హీరోకు ఒక గ్యాంగ్ ఉంటుంది- ఎప్పుడు పిలిస్తే అపుడు రెడీగా వచ్చి ఎవర్నైనా తన్నడానికి లేదా తన్నులు తినడానికి.
కాకపోతే ఇందులో స్టూడెంట్ యూనియన్ కొలీగ్స్‌గా దానికో జస్టిఫికేషన్ ఇచ్చారు. క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ కి చాలా రీల్స్ ఖర్చుపెట్టారు డైరక్టర్ . అందుకే ఇదొక ఆధునిక లవకుశ అయి కూర్చుంది. పెద్ద సినిమా. అది మినహాయిస్తే మిగిలిన ఏరియాలన్నింటా దర్శకుడు ప్రతిభ చూపించారనే చెప్పాలి.
పెద్ద పెద్ద స్టార్లు ఎక్కువగా లేకుండానే భారీ బడ్జెట్ సినిమాకుండే హంగులన్నీ చూపించారు. నటీనటుల ఎంపికలోనూ ప్రతిభ ఉంది. అతని కోసమే రాసిన కథలాగా కనిపించింది అన్నట్టు అర్జున్ రెడ్డికి ఎక్స్‌టెన్షన్‌గా ఉన్న పాత్రలో విజయ్ దేవరకొండ రాణించారు.

ఫొటో సోర్స్, facebook/DearComradeTheFilm
హీరోయిన్ రష్మిక పర్వాలేదనిపించారు. కాకపోతే హీరోయిన్ తెలుగు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగు అంటే ప్రేమ ఉన్నవాళ్లకయితే చెవుల్లో సీసం పోసినట్టే. తెలుగు ఉచ్చరణకు దానిదైన ఒక లక్షణం ఉంటుందని ఎవరు చెప్పాలి వీళ్లకి.
‘నా అన్న’ లాంటి పిచ్చిమాటలతో పాటు ఒత్తకూడని చోట ఒత్తుతూ అవసరంలేని చోట్ల విరుస్తూ ఉసురు తీశారు. ఇది ఈ సినిమాకు పరిమితమైన వ్యవహారం కాదు. చాలామంది హీరోయిన్లకు డబ్బింగ్ చెపుతున్నవారెవరో కానీ అదే స్టయిల్‌గా మారిపోయే ప్రమాదం తలెత్తింది ఇవాళ.
హీరో హీరోయిన్ లతో పాటు మిగిలిన పాత్రధారులు కూడా పర్వాలేదనిపించారు. కెమెరా పనితనం బాగుంది. బాక్ గ్రౌండ్ స్కోర్ డిస్టర్బ్ చేయకుండా సూతింగ్ గా ఉంది. కమర్షియల్ దారిలోనే ఫక్తు ఫార్ములాలో కూడా కూసింత సెన్సిబుల్ మూవీ తీయొచ్చు అని చూపించిన సినిమా డియర్ కామ్రేడ్.
ఇవి కూడా చూడండి:
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- ఫిడెల్ క్యాస్ట్రో అరుదైన వీడియో ఇంటర్వ్యూ
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








