లోక్‌సభ ఎన్నికలు 2019: ఏపీ, తెలంగాణతో పాటు, మరో 18 రాష్ట్రాల్లో పోలింగ్ నేడు

భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈసారి లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది.
తొలి విడతలో ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు మొత్తం 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 18, మూడో విడత ఏప్రిల్ 23, నాలుగో విడత ఏప్రిల్ 29, అయిదో విడత మే 6, ఆరో విడత మే 12, ఏడో విడత పోలింగ్ మే 19న జరుగుతుంది.
మే 23న దేశవ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
లోక్ సభ ఎన్నికలు 2019 పోలింగ్ తేదీలు :
రాష్ట్రాల వారీగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగే లోక్‌సభ స్థానాల సంఖ్య

ఫొటో సోర్స్, Reuters
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం
రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలతో పాటు మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ నేడు పోలింగ్ జరుగుతోంది. అందుకోసం 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు, కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 34, 603 కేంద్రాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/ELECTION COMMISSION OF IND
543 లోక్‌సభ స్థానాలకు
రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య గరిష్ఠంగా 552 వరకూ ఉండచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సంఖ్య 545. వీటిలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 543 స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఇవి కాకుండా రాష్ట్రపతికి ఆంగ్లో-ఇండియన్ సమాజం వారికి లోక్‌సభలో తగినంత ప్రాతినిధ్యం లేదని అనిపిస్తే, ఆయన ఇద్దరిని నామినేట్ వేయవచ్చు.
మొత్తం స్థానాల్లో 131 లోక్‌సభ సీట్లు రిజర్వ్ ఉంటాయి. ఈ 131లో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47 స్థానాలు రిజర్వ్ చేస్తారు. అంటే ఈ స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేయాలి.
లోక్‌సభలో ఏదైనా పార్టీకి మెజారిటీ రావాలంటే 272 స్థానాలు అవసరం. మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువైనా మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. రాజకీయ పార్టీలు పొత్తు ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత కూడా పెట్టుకోవచ్చు.
లోక్‌సభలో విపక్ష నేత పదవి కోసం ప్రతిపక్ష పార్టీకి మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం రావాల్సి ఉంటుంది. అంటే, 55 స్థానాలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు కేవలం 44 స్థానాలే వచ్చాయి.
2014 ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన దానికి మించిన మెజారిటీ దక్కించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత ఎన్నికల ప్రక్రియ విధానం ఎక్కడిది?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారితంగా ఏర్పడింది. బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం కాగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. రాత్రికి కౌంటింగ్ చేసి తర్వాత రోజు ఉదయానికి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
కానీ, భారత్‌లో అలా జరగదు. ఇంత పెద్ద దేశంలో ఓటింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రత అవసరం కాబట్టి చాలా దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతి దశలో పోలింగ్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎంలను కౌటింగ్ వరకూ సురక్షితంగా భద్రపరుస్తారు.
ఎన్నికల సంఘం నిర్దేశాల ప్రకారం అంతిమ దశ పోలింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మొదట్లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగేటపుడు ట్రెండ్స్ రావడానికి చీకటి పడేది. ఫలితాల్లో స్పష్టత రావడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈవీఎంలు ఉపయోగిస్తుండడంతో మధ్యాహ్నం లోపే పోలింగ్ సరళి తెలిసిపోతుంది. సాయంత్రానికి ఫలితాలు దాదాపుగా తెలుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!
- తెలంగాణలో కమ్యూనిస్టులు: శాసించే స్థాయి నుంచి శూన్యానికి..
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
- ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
- టీజేఎస్ భవిష్యత్తు ఏంటి? కోదండరాం బీబీసీతో ఏమన్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








