ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు హైకోర్టు అనుమతి

ఫొటో సోర్స్, Gorantla madhav
- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
వైసీపీ తరపున హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పి వెలువరించింది.
దాంతో ఆయన నామినేషన్ వేస్తారా లేదా? ఒకవేళ వేస్తే, ఆమోదం లభిస్తుందా అన్నదానిపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం తుది గడువులోగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.
గోరంట్ల మాధవ్ ప్రభుత్వ ఉద్యోగానికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా కదిరిలో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన గోరంట్ల మాధవ్ గత ఏడాది అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానంటూ జేసీకి హెచ్చరిక చేసి అందరి దృష్ఠినీ ఆకర్షించారు.
ఆ తరువాత డిసెంబర్‌లో స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన మాధవ్ జనవరిలో వైసీపీలో చేరారు.

ఫొటో సోర్స్, గోరంట్ల మాధవ్
పార్టీ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో ఆయనను హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ప్రచారం ప్రారంభించిన మాధవ్, నామినేషన్ వేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ, ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమెదించలేదు. రాజీనామా ఆమోదం పొందకుండా నామినేషన్ వేయటానికి చట్టప్రకారం వీలుకాదు. దీంతో మాధవ్ రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తన వీఆర్‌ఎస్‌ను ఆమోదించడంలేదని ఇటీవల ఏపీ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీనిని పరిశీలించిన ట్రిబ్యునల్, గోరంట్ల మాధవ్ వీఆర్‌ఎస్‌ను వెంటనే ఆమోదించి నామినేషన్‌కు అడ్డంకులు లేకుండా రిలీవ్ చేయాలంటూ కర్నూలు డీఐజీని ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశించినప్పటికి వీఆర్ఎస్ ఆమోదించినట్లు అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదు.
దీంతో, కోర్టు ఉత్తర్వులను కర్నూలు డీఐజీ ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించి వెంటనే రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం డీజీపీకి లేఖ రాశారు. అయినప్పటికీ, మాధవ్ రాజీనామాను ఆమోదిస్తూ సంబంధిత పోలీసు ఉన్నతాధికారి నుంచి ఇంతవరకూ ఉత్తర్వులు అందలేదు.
దీనికితోడు, మాధవ్ పై రెండు చార్జి షీట్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఆయనను రిలీవ్ చేయటం కుదరదని పోలీసు శాఖ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.
ఇప్పట్లో రిలీవ్ అయ్యే అవకాశం లేకపోవటం, నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండడంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం మాధవ్ భార్యను లోక్‌సభ అభ్యర్థిగా నిలిపేందుకు ఏర్పాట్లు చేసింది.

ఫొటో సోర్స్, గోరంట్ల మాధవ్
వీఆర్ఎస్ తీసుకోవడానికి అర్హతలేంటి?
స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకునే ప్రభుత్వ ఉద్యోగి వయసు యాభై సంవత్సరాలకు పైబడి ఉండాలి లేదా ఉద్యోగిగా ఇరవై ఏళ్ళ సర్వీసు పూర్తిచేసి ఉండాలి. అలాంటి వారే స్వచ్ఛంద పదవీ విరమణకు అర్హులవుతారు.
వీఆర్ఎస్ కోరురునేవారు మూడు నెలల ముందుగా రాతపూర్వకంగా తనపై అధికారితోపాటు ఉద్యోగ నియామకాధికారికి నోటీసు ఇవ్వవలసి ఉంటుంది.
నోటీసు ఇచ్చిన మూడునెలలలోగా పదవీ విరమణకు ఆమోదం పొందవలసి ఉంటుంది.
వీఅర్ఎస్ అనుమతి నిరాకరణపై కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?
క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశాలు లేదా ఏవైనా కేసు విచారణలు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల విజ్ఞప్తులను మినహాయిస్తే, స్స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న అర్హులైనవారి విజ్ఞప్తులను ప్రభుత్వం ఆమెదించాల్సిందేనని ముత్తుసామి వీఅర్ఎస్ కేసులో చెన్నై హైకోర్ట్ తీర్పునిచ్చింది.
మరో కేసులో స్వచ్ఛంద పదవీ విరమణను ఉద్యోగులు తమ హక్కుగా కోరకూడదని, కొన్ని ప్రజా ప్రయెజనాలను దృష్ఠిలో ఉంచుకొని ప్రభుత్వం దానిని తిరస్కరించవచ్చని అందుకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, నలుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ వైద్యుల వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరించిన కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నాజీర్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వ చర్యను సమర్ధించింది.

ఫొటో సోర్స్, గోరంట్ల మాధవ్
'కక్ష సాధింపులో భాగంగానే వీఆర్ఎస్ ఆమోదించడం లేదు'
గోరంట్ల మాధవ్ తన వీఆర్ఎస్ ఆమోదం, నామినేషన్‌కు సంబంధించి బీబీసీతో మాట్లాడారు. "రాజకీయ కుట్ర , కక్షసాధింపులో భాగంగానే నా వీఆర్‌ఎస్ విజ్ఞప్తిని ఆమోదించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారు" అని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ఒత్తిడి మేరకే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ తనను రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
"కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా డీఐజీ స్థాయి అధికారి తప్పించుకు తిరగడం సిగ్గు చేటు" అని కూడా మాధవ్ విమర్శించారు.
ఒకే స్థానానికి భార్యాభర్తల నామినేషన్
ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు తాను, తన భార్య వైఎస్సార్సీపీ తరపున హిందూపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేయనున్నట్లు మాధవ్ బీబీసీకి ఇంతకుముందు తెలిపారు. నామినేషన్ వేసినతరువాత వాటి పరిశీలనకు కొంత సమయం ఉంటుందని ఆలోపు కోర్టు నుంచి తనకు అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సాంకేతిక కారణాలవల్ల తన నామినేషన్ చెల్లని పక్షంలో తన భార్య పోటీలో కొనసాగుతారని ఆయన అన్నారు.
అయితే, ఇప్పుడు కోర్టు అనుమతితో మాధవ్ నామినేషన్ వేశారు, ఆయన భార్య కూడా నామినేషన్ వేశారు. దీంతో మాధవ్ భార్య నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
మాధవ్ ఆరోపణలపై కర్నూల్ రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ వివరణ కోరేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








