తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం

కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/fb

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ కేసీఆర్‌తో ముందుగా నిర్ణయించిన ప్రకారం సరిగ్గా మధ్నాహ్నం 1 గంట 25 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆ తరువాత ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించారు.

మహుమూద్ అలీ

ఫొటో సోర్స్, kcr/fb

కేసీఆర్ తరువాత మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలుగులో ప్రమాణం చేశారు. మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు.

మహమూద్ అలీ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ నిన్న విలేఖరుల సమావేశంలో చెప్పినట్లు, మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్ రావు, కవిత, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో పాటు కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, టీఆర్ఎస్ ఎంపిలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా...

కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)