క్షమించండి.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నా పెద్ద తప్పు: పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena
2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పెద్ద తప్పిదమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.
పవన్ కల్యాణ్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త 'పోరాట యాత్ర' ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైంది.
ఉదయం సముద్ర తీరంలో గంగ పూజలు నిర్వహించిన తరువాత పవన్ ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలోనూ పూజలు జరిపారు.
తరువాత 'నిరసన కవాతు' నిర్వహించి బహిరంగసభలో ప్రసంగించారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ప్రధానంగా తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఫొటో సోర్స్, janasena party
పవన్ కల్యాణ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
- ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రిని చేయండి మీ కష్టాలు తీరుస్తానని అనడం లేదు. మీ కష్టాలు తెలుసుకోనివ్వండి. డబ్బులు సంపాదించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు.
- తెలుగుదేశం చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు.. ఎన్టీయార్ పార్టీ.
- మా జనసేన సైనికుల మీద దాడి చేయకండి. మీకు మద్దతిచ్చి బానిసలుగా ఉండాలా. ఇది ప్రజాస్వామ్యం. భయపడి కాదు, ఇష్టపడి మద్దతిచ్చాం. మీ ఎమ్మెల్యేలతో దాడి చేయిస్తే ఊరుకుంటామనుకుంటున్నారా?
- ఉద్దానం సమస్యకు, సాగు నీటి అవసరాలకు మీరు ఒక్క పైసా కూడా విదల్చడం లేదు. కానీ విదేశీ పర్యటనల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారానికి హార్వర్డ్ నుంచి డాక్టర్లను తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనే లేదు. కనీసం అయిదుగురు ఎమ్మెల్యేలున్నా ఉద్దానం సమస్యపై అసెంబ్లీలో నిలదీసే వాణ్ని.
- ప్రత్యేక హోదా మీ వల్లనే సాధ్యమవుతుందని నమ్మి మీ పార్టీకి మద్దతునిచ్చాను. కానీ మీరు కాలయాపన చేశారు తప్ప కదిలిందే లేదు.
- వైసీపీ , టీడీపీ, బీజేపీ నాయకులు మన పార్టీనే తిడుతున్నారు.
- తెలుగుదేశం పార్టీ కులాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ. మేం అన్ని కులాలను గౌరవిస్తాం.
- బీజేపీ స్క్రిప్టు ప్రకారమే నేను మాట్లాడుతున్నానని అంటున్నారు. బీజేపీ నా బంధువా, చుట్టమా? ప్రత్యేక హోదా గురించి మొదటిసారి మాట్లాడింది నేనే.
- చంద్రబాబుకు అపార అనుభవం ఉంది నిజమే కానీ ఆ అనుభవం ప్రజలను వంచించడానికే.
- ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి?
- నేనే 2014 ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. అలా చేయనందుకు మీ అందరిని క్షమించాలని మీ అందరినీ అడుగుతున్నా. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం.

ఫొటో సోర్స్, janasena party
పవన్ యాత్ర ఇలా...
పవన్ కల్యాణ్ యాత్ర గురించి జనసేన పార్టీ అందించిన వివరాల ప్రకారం -
* 45 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తారు.
* కాలినడకన, బస్సులో యాత్ర సాగుతుంది. మధ్యమధ్యలో రోడ్‌షోలు ఉంటాయి.
* ఉత్తరాంధ్రలోని సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిశీలిస్తారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పవన్ తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తారు.
* జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో పరిష్కార మార్గాలు చూపుతూ ఆయా సమస్యలను ప్రస్తావించడానికి గాను ఈ పోరాట యాత్రను ఉపయోగించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








