మోదీ ఎందుకు మాటిమాటికీ చైనా వెళుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోని వుహాన్ నగరంలో ఏప్రిల్ 27, 28వ తేదీలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో 'ఇష్టాగోష్ఠి భేటీ' కానున్నారు.
డోక్లామ్ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు ఈ సమావేశంతో ఫుల్‌స్టాప్ పడుతుందని, ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చిస్తారని భావిస్తున్నారు.
గత నాలుగేళ్లలో మోదీ చైనాలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఇలా ఒక దేశ ప్రధాని మరో దేశానికి పదేపదే వెళ్లడం చాలా అరుదు.
మోదీ జూన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడం కోసం చైనాకు వెళ్లాల్సి ఉండగా, దానికి ముందు ఇప్పుడు చైనాకు వెళ్లడం చాలా మందికి అసహజంగా అనిపిస్తోంది. అయితే జూన్‌లో జరిగే సదస్సులో ఎనిమిది దేశాలు పాల్గొంటాయి కాబట్టి, అప్పుడు ద్వైపాక్షిక చర్చలకు చాలా తక్కువ అవకాశం ఉంటుందని ఒక వాదన వినిపిస్తోంది.
ప్రధాని చైనా పర్యటనపై అంతర్జాతీయ విశ్లేషకులు పుష్పేష్ పంత్ మాట్లాడుతూ, చైనాతో సంబంధాలు మెరుగు పరచుకోవాలనేది భారత్ కోరికే కానీ చైనాది కాదని అన్నారు. చైనా ముందు తాము చాలా తక్కువని భారత్ గుర్తించినట్లు దీని వల్ల స్పష్టమవుతోందని ఆయన తెలిపారు.
1962 యుద్ధం అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి 1988లో రాజీవ్ గాంధీ చైనా పర్యటన తరహాలో, మోదీ కూడా ఇప్పుడు ఇలా చైనా పర్యటన చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చైనాతో కఠినంగా ఉండడం వల్ల తమకే నష్టమని మోదీ గుర్తించినట్లు కనిపిస్తోందని పంత్ అన్నారు.
''జిన్‌పింగ్‌ను భారతదేశం రప్పించడానికి మోదీ చేయని ప్రయత్నం లేదు. డోక్లామ్ కారణంగా అవన్నీ విఫలమయ్యాయి. డోక్లామ్‌పై జరిగిన టీవీ డిబేట్లలో భారతదేశం చైనా బలగాలను వెనక్కి నెట్టేసిందని పేర్కొన్నారు. కానీ వాస్తవం వేరే ఉంది'' అని తెలిపారు.
‘‘గత రెండేళ్లుగా చైనాతో మన సంబంధాలు చాలా దెబ్బ తిన్నాయి. చైనా ప్రతి విషయంలో భారతదేశాన్ని నిరాశపరచింది. మసూద్ అజహర్ విషయంలోనూ చైనా భారత్‌కు సహకరించలేదు. అయినా భారత్ చేయడానికేం లేదు'' అని పంత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి ఈ ఇష్టాగోష్ఠి పర్యటన ఎందుకు?
ఇలాంటి ఇష్టాగోష్ఠి పర్యటనల వల్ల చాలా లాభాలుంటాయని పంత్ తెలిపారు. వీటిలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఉండవు. ఇలాంటి పర్యటనల కోసం స్థలాన్ని ముందుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మోదీని జిన్‌పింగ్ ఆహ్వానించారని చైనా విదేశాంగ మంత్రి అంటున్నారు. ఇది పిలవకుండానే వచ్చారనే అపవాదు రాకుండా ఉండేందుకే అని పంత్ అభిప్రాయం.
ఈ పర్యటన ద్వారా చైనాతో సంబంధాల విషయంలో తాము పలు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ నిరూపించుకుందని తెలిపారు.
భారతదేశంలో ప్రవాసం ఉండబట్టి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలో దలైలామా తలపెట్టిన నిర్వహించి తలపెట్టిన ర్యాలీని కూడా భారత్ అడ్డుకుంది. ఇది కూడా చైనాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకే.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో సమానమని భావించడం పిల్లచేష్టలే..
గత ఏడాది భారత్, చైనాల మధ్య డోక్లాం వద్ద 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. దాంతోపాటు చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ భారత్ గుండా వెళుతోంది. దీనిలో భారత్‌కు సరిహద్దుల్లో ఉన్న దేశాలన్నీ పాల్గొంటుండగా, భారత్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.
అయితే కాశ్మీర్ గుండా వెళ్లే ఈ ప్రాజెక్ట్ తమ సార్వభౌమత్వ ఉల్లంఘనేనని భారత్ అంటోంది.
''మీరు ఎంత దేశభక్తులైనా చైనాతో సమానమని భావిస్తే మాత్రం అవి పిల్లచేష్టలే. చైనాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మాత్రమే కాదు, వీటో చేసే అధికారం కూడా ఉంది. ఆ దేశం వద్ద అణ్వాయుధాలతో పాటు థర్మోన్యూక్లియర్ ఆయుధాలు కూడా ఉన్నాయి. చైనా ఆర్థికవ్యవస్థను మనం ఎప్పటికి అందుకుంటామో తెలీదు. మిలటరీపరంగా కూడా చైనా ముందు మన బలం చాలా తక్కువ. అందుకే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనది కానీ, చైనాది కాదు.'' అని పంత్ విశ్లేషించారు.
ఇప్పుడు మోదీనే కాదు, గతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయిలు కూడా ఇలాగే సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








