జాతీయ అవార్డులు: వినోద్ ఖన్నాకు 'దాదా సాహెబ్ ఫాల్కే'

ఫొటో సోర్స్, Photoshot
65వ జాతీయ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు మరణానంతరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. నిరుడు ఏప్రిల్ 27న ఆయన మరణించారన్న విషయం తెలిసిందే.
మేరే అప్నే, మేరా గాంవ్ మేరా దేశ్, కచ్చే ధాగే, ముకద్దర్ కా సికందర్, అమర్-అక్బర్-ఆంటోనీ, ద బర్నింగ్ ట్రెయిన్, ఖూన్-పసీనా, చాందినీ వంటివి ఆయన నటించిన ప్రముఖ చిత్రాలు. వీటిలో ఆయన తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.
విలన్‌గా కూడా ఆయన చాలానే పేరు గాంచారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ఆయన సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఇటీవలే మరణించిన నటి శ్రీదేవికి ఆమె నటించిన 'మామ్' సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీదేవి నటించిన ఆఖరు సినిమా 'మామ్'. ఫిబ్రవరి 24 రాత్రి ఆమె దుబాయిలోని ఓ హోటల్‌లో మరణించారన్న విషయం తెలిసిందే.
శ్రీదేవి సినీరంగ యాత్ర నాలుగేళ్ల వయసులో మొదలైంది. ఆమె బాలనటిగా పలు తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు.
80వ దశకంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి హిమ్మత్‌వాలా, తోఫా, మిస్టర్ ఇండియా, నగీనా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 'లేడీ అమితాబ్'గా పేరు పొందారు.
1997లో జుదాయి సినిమా తర్వాత ఆమె దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. తిరిగి 2012లో ఆమె ఇంగ్లిష్-వింగ్లిష్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
2017లో ఆమె తన 300వ చిత్రంగా 'మామ్'లో నటించారు. సినీరంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.
ఇంకా ఎవరెవరికి అవార్డులు దక్కాయి?
ఉత్తమ నటుడు: రిద్ధి సేన్ (నగర్‌కీర్తన్)
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీ)
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
స్పెషల్ మెన్షన్ అవార్డ్: పంకజ్ త్రిపాఠీ (న్యూటన్)
ఉత్తమ కొరియోగ్రఫీ : 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ'లో పాటకు గణేష్ ఆచార్య
ఉత్తమ సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ : బాహుబలి 2
నేషనల్ అవార్డ్, సినిమాపై ఉత్తమ విమర్శకుడు : గిరిధర్ ఝా
ఉత్తమ గాయకడు : జేసుదాస్
ఉత్తమ ప్రజాకర్షక చిత్రం: బాహుబలి 2
విజేతలందరికీ మే 3న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డుల్ని ప్రదానం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








