వడనగర్: ప్రధాని సొంతూరిలో దళితుడి 'ఆత్మహత్య'

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రాక్సీ గాగేడ్కర్ ఛారా
- హోదా, బీబీసీ గుజరాతీ ప్రతినిధి
గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన వడనగర్ ప్రాంతంలో ఓ దళితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
షేఖ్‌పూర్ అనే గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద వంట ఏర్పాట్లు చూసే మహేశ్ భాయి చావ్డా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
ఆ పాఠశాలలోని ముగ్గురు టీచర్లు సాగిస్తున్న వేధింపులతో విరక్తి చెందిన మహేశ్ భాయి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మంగళవారం, ఫిబ్రవరి 6 సాయంత్రం షేఖ్‌పూర్‌లోని ఓ బావి నుంచి మహేశ్ భాయి శవాన్ని బయటకు తీశారు.
ఆయనను ఆత్మహత్యకు పురికొల్పిన ముగ్గురు టీచర్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మృతుడి భార్య ఇలా బేన్ కూడా ఇదే స్కూలులో మధ్యాహ్న భోజనం వండుతారని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మెహసాణా జిల్లా ఎస్పీ రవీంద్ర మాండలిక్ బీబీసీతో మాట్లాడుతూ, "డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారి ఈ కేసు దర్యాఫ్తు చేస్తారు. దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తాం" అని అన్నారు.
మహేశ్ సోదరుడు పీయూష్ వ్యాస్ బీబీసీతో మాట్లాడుతూ, తాను అధికారుల ముందు మూడు డిమాండ్లు ఉంచానని, వారు అందుకు అంగీకరించారని చెప్పారు. 35 ఏళ్ల ఇలాకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మృతుడి కూతురి స్కూలు బ్యాగులో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు.
గత సంవత్సరంనర కాలంగా స్కూలులోని ముగ్గురు టీచర్లు మహేశ్‌ను వేధిస్తున్నట్టు ఆ నోట్‌లో ఉంది. మోమిన్ హుస్సేన్ అబ్బాస్ భాయి, అమాజీ అనార్జీ ఠాకోర్, ప్రజాపతి వినోద్ భాయి అనే ముగ్గురు టీచర్లపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఎస్‌సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఈ టీచర్లు ముగ్గురూ మహేశ్ పట్ల వివక్ష చూపేవారని ఆరోపణలున్నాయి. తినడానికి నాస్తా తీసుకురమ్మని పంపించే వారు కానీ డబ్బులివ్వకపోయేవారు. నాస్తా తీసుకురాకపోతే ఆయనను వేధించేవారని ఆరోపణ.
మహేశ్ భాయికి నెలకు రూ. 1600 జీతం వచ్చేది. ఆయన భార్యకు రూ. 1400 జీతం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








