‘తల్లిని, భార్యను జాదవ్ ఎదుట వితంతువుల్లా ప్రవేశపెట్టారు’

ఫొటో సోర్స్, Youtube/Rajyasabha TV
పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్‌పై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఆమె పాక్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
మానవీయ దృక్పథంతోనే జాదవ్ తల్లి, భార్యలు ఆయనను కలిసేందుకు అనుమతించినట్లు పాక్ చెబుతున్నా అందులో మానవత కానీ, సహృదయత కానీ లేదన్నారు.
తల్లి, భార్య జాదవ్‌ను కలిసే సందర్భంగా మీడియాకు అనుమతి ఇవ్వరాదని కోరినా, పాక్ ప్రభుత్వం మీడియాను అనుమతించడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టిందని తెలిపారు.
పాకిస్తాన్ తాను ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించిందని సుష్మ అన్నారు.

కుమారుణ్ని కలిసేందుకు వెళ్లిన జాదవ్ తల్లిని సల్వార్, కుర్తా వేసుకునేలా చేసారని సుష్మ తెలిపారు.
భద్రత పేరిట జాదవ్ భార్య కుంకుమ, గాజలు, బొట్టు తీసివేసేలా చేసారని, జాదవ్ తల్లిదీ అదే పరిస్థితి అని వివరించారు. జాదవ్ తల్లిని, భార్యను అతని ఎదుట వితంతువుల్లా ప్రవేశపెట్టారని తెలిపారు.
సుష్మ ప్రకటన సందర్భంగా అధికార ఎంపీలు పాక్ తీరుపై 'షేమ్.. షేమ్' అని నిరసన వ్యక్తం చేశారు.

సుష్మా స్వరాజ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు:
- జాదవ్‌ను కలవడానికి వెళ్లే ముందు తల్లి, భార్య దుస్తులను క్షుణ్నంగా తనిఖీ చేసారు. చీర కట్టుకునే అలవాటున్న జాదవ్ తల్లిని సైతం సల్వార్, కుర్తా వేసుకునేలా చేసారు.
- జాదవ్‌ను కలిసినప్పుడు బొట్టు లేని తల్లిని చూసి జాదవ్, 'నాన్న ఎలా ఉన్నారు' అని ప్రశ్నించారు.
- జాదవ్ తల్లి తన కుమారుడితో మరాఠీలో మాట్లాడాలనుకున్నారు. అయితే పాక్ అధికారులు అందుకు అనుమతించలేదు. పక్కన కూర్చున్న ఇద్దరు అధికారులు పదే పదే ఇంటర్ కామ్ నిలిపేశారు.
- కెమెరా, చిప్, రికార్డర్ ఉండొచ్చనే అనుమానంతో జాదవ్ భార్య చెప్పులు కూడా ముందుగానే తీసి వేయించారు.
- జాదవ్ తల్లి మాటలను బట్టి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. ఎవరి బలవంతం మీదో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
పాక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్, దేశమంతా జాదవ్ కుటుంబానికి అండగా ఉండాలని రాజ్యసభ ద్వారా పిలుపునిచ్చారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








