బైడెన్ దిగిపోయే వేళ ఇజ్రాయెల్‌కు 8 బిలియన్ డాలర్ల ఆయుధాలు పంపనున్న అమెరికా

ఫొటో సోర్స్, EPA
- రచయిత, అనా ఫాగై
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్
ఇజ్రాయెల్‌కు 8 బిలియన్ డాలర్ల (సుమారు 6.5లక్షల కోట్లరూపాయలు) విలువైన ఆయుధాలను విక్రయించాలని యోచిస్తున్న విషయాన్ని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కాంగ్రెస్‌కు తెలిపింది.ఈ విషయాన్ని ఒక అమెరికా అధికారి బీబీసీకి తెలిపారు.
కాంగ్రెస్, సెనేట్ కమిటీల ఆమోదం అవసరమయ్యే ఈ ఆయుధ సరఫరాలో క్షిపణులు, షెల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు ఉన్నాయి.
బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా తప్పుకునే పక్షం రోజుల ముందు ఈ చర్య కీలకంగా మారింది. గాజాలో యుద్ధంలో అనేకమంది పౌరులు మరణిస్తున్న కారణంగా ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతును నిలిపివేయాలనే పిలుపును వాషింగ్టన్ తిరస్కరించింది.
ఆగస్టులో 20 బిలియన్ డాలర్ల యుద్ధ విమానాలు, ఇతర సైనిక పరికరాలను ఇజ్రాయెల్‌కు విక్రయించడానికి అమెరికా ఆమోదించింది.
అయితే తాజా ఆయుధ సరఫరాలో గగనతల క్షిపణులు, హెల్‌ఫైర్ క్షిపణులు, ఆర్టిలరీ షెల్స్,బాంబులు ఉన్నాయని అమెరికా అధికారి తెలిపారు.
"అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా తన పౌరులను రక్షించడానికి ఇరాన్‌తోపాటు దాని అనుబంధ సంస్థల దూకుడును నిరోధించడానికి ఇజ్రాయెల్‌కు హక్కు ఉందని అధ్యక్షుడు స్పష్టం చేశారు" అని ఈ విక్రయం గురించి తెలిసిన వర్గాలు బీబీసీకి చెప్పాయి.


ఫొటో సోర్స్, Reuters
"ఇజ్రాయెల్ రక్షణకు అవసరమైన శక్తి, సామర్థ్యాలను అందించడాన్ని మేం కొనసాగిస్తాం."
ఇజ్రాయెల్ అమెరికా బంధం ధృడమైనదని బైడెన్ తరచుగా అభివర్ణిస్తూ ఉండేవారు.
ప్రపంచంలోనే సాంకేతికంగా అత్యాధునికమైన మిలిటరీని నిర్మించడంలో ఇజ్రాయెల్‌కు సహాయపడిన అమెరికానే ఆ దేశానికి ఇప్పటివరకు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం, 2019-2023 మధ్య ఇజ్రాయెల్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో అమెరికా వాటా 69%.
దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ భారీ భూతల ఆపరేషన్‌తో ముందుకు వెళుతోందనే ఆందోళనతో 2024 మేలో 2,000 పౌండ్లు , 500 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేసినట్లు అమెరికా ధృవీకరించింది. కానీ ఈ చర్యను ఆయుధ నిషేధంగా పోల్చుతూ రిపబ్లికన్లతోపాటు అటు నెతన్యాహు నుంచి కూడా జోబైడెన్‌కు ప్రతిఘటన ఎదురైంది. దీంతో బైడెన్ పాక్షికంగా ఈ నిలిపివేతను రద్దుచేశారు. తరువాత మరోసారి అటువంటి చర్యలు తీసుకోలేదు.
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు ఆయన అధికారయంత్రాంగం ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనేక చర్యలలో ఈ ఆయుధ షిప్‌మెంట్ కూడా ఒకటి.
అలాగే 2025 జనవరి 20న బైడెన్ శ్వేతసౌధాన్ని వీడేముందు, ట్రంప్ బాధ్యతలు స్వీకరించే ముందు ఇజ్రాయెల్‌కు ఇదే చివరి ఆయుధ విక్రయ సరఫరా కానుంది.
విదేశాలతో విభేదాలకు ముగింపు పలకడం, అమెరికా ప్రమేయాన్ని తగ్గించడం గురించి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గతంలోనే మాట్లాడారు. ట్రంప్ ఇజ్రాయెల్ కు గట్టి మద్దతుదారుగా ఉన్నప్పటికీ గాజాలో సైనిక చర్యను త్వరగా ముగించాలని ఇజ్రాయెల్‌ను కోరారు.
దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ 2023 అక్టోబర్7న చేసిన దాడిలో 1,200మంది చనిపోగా 251మందిని బందీలుగా పట్టుకుపోయింది. దీంతో హమాస్‌ను తుడిచిపెడతానంటూ ఇజ్రాయెల్ ప్రతినపూనింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో 45,580 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














