స్టాలిన్, పవార్‌ను ఒప్పించేందుకు సోనియా, రాహుల్ చెన్నై, ముంబయి ప్రయాణం

ఫొటో సోర్స్, ANI
డీలిమిటేషన్ బిల్లుపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠ నడుమ డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ చెన్నై బయలుదేరారు.
డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఇండీ కూటమిలోని పార్టీ డీఎంకే ప్రకటించింది.
ఆదివారం ఉదయం చెన్నై బయలుదేరే ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ 'చూద్దాం' అని క్లుప్తంగా బదులిచ్చారు.
ఈ పర్యటన గురించి రాహుల్ గాంధీ కూడా 'ఎక్స్'లో మెసేజ్ పోస్ట్ చేశారు. స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
చెన్నైలో స్టాలిన్‌తో భేటీ తర్వాత ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇతర ఇండీ కూటమి నేతలు ముంబయి వెళ్లి శరద్ పవార్‌ను కూడా కలవనున్నారు.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూడా డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు ప్రకటించింది.
దీనిపై సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 'ఎక్స్'లో మెసేజ్ పోస్ట్ చేశారు.
"కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గే, కపిల్ సిబల్, ఎం.ఏ. బేబీ సహా ఇండీ కూటమి నేతలు రెండు విమానాల్లో చెన్నై వెళ్తున్నారు. అక్కడ వారు ఎం.కె. స్టాలిన్‌తో సమావేశమవుతారు. అనంతరం ముంబయి వెళ్లి శరద్ పవార్‌ను కలుస్తారు" అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. త్వరగా రావాలని తనకు సమాచారం అందిందని ఆమె విలేకరులతో చెప్పారు.
"నన్ను త్వరగా రమ్మని కోరారు. అందుకే వచ్చాను" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, CONGRESS
రాహుల్ గాంధీ ఏమన్నారు?
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"ఇండీ కూటమి సీనియర్ నేతలు, నేను చెన్నై వెళ్లి ఎం.కె. స్టాలిన్‌ను కలవబోతున్నాం. డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని ఆయన్ను, డీఎంకేను విజ్ఞప్తి చేస్తాం" అని అందులో పేర్కొన్నారు.
"లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచడం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. ఇది బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లకు తమ స్వప్రయోజనాల కోసం దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే స్వేచ్ఛను ఇస్తుంది" అని రాహుల్ విమర్శించారు.
"తమిళ వ్యతిరేక శక్తులపై సోదరుడు స్టాలిన్ ఎల్లప్పుడూ దృఢంగా నిలబడ్డారు. దేశ ప్రయోజనాలు, తమిళనాడు ప్రయోజనాలు, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమందరం కలిసి ఈ బిల్లును ఓడించాలి" అని రాహుల్ పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, ANI
శివసేన (యూబీటీ) స్పందన ఏంటి?
"ఇండీ కూటమి, మహా వికాస్ అఘాడీ తమ పోరాటాన్ని విరమించుకోలేదు. మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ముంబయి వస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అక్కడ ఉంటారు" అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.
"ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశాన్ని కాపాడుకోవడం కోసం చివరి క్షణం వరకు పోరాటం కొనసాగుతుంది" అని ఆయన అన్నారు.
శరద్ పవార్‌ను ఉద్దేశించి రాజ్ ఠాక్రే శనివారం సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
"నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని ఒక వర్గం విడిపోయి బీజేపీతో వెళ్లడం ప్రారంభించిన 2023 జులై 2వ తేదీనే నేను ఈ విషయం చెప్పాను" అని ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేసిన సందేశంలో రాశారు.
"తర్వాతి మూడేళ్ల పాటు ఎన్సీపీలోని రెండు వర్గాలు చాలా నమ్మశక్యంగా కనిపించేలా విభేదాల నాటకం ఆడాయి. ఇప్పుడు నేను ఊహించినట్లుగానే, అధికార నిచ్చెన ఎక్కడానికి మరో వర్గం ముందుకు కదులుతోంది" అని విమర్శించారు.
"ఇదంతా శరద్ పవార్ 'జంతర్ మంతర్'లో భాగమని నేను ఒకసారి చెప్పాను. ఈ ఆటను చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా అర్థం చేసుకోగలరు" అని రాజ్ ఠాక్రే ఎద్దేవా చేశారు.

ఫొటో సోర్స్, X/@INCIndia
ఇండీ కూటమి సమావేశం
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో శనివారం ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత అభిషేక్ బెనర్జీ, స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతలు అభయ్ కుమార్ సింగ్, మనోజ్ ఝా, సీపీఐ నేత పి. సంతోష్ కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేత ఈ.టీ. మొహమ్మద్ బషీర్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) నేత ఎన్.కె. ప్రేమచంద్రన్ తదితరులు పాల్గొన్నారని పీటీఐ కథనం తెలిపింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూ జనతా దళ్‌ను ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీలు హాజరుకాలేదు.
అయితే, పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































