మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఒపల్ సుచాత

ఫొటో సోర్స్, Opal Suchata/ FB
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్‌కు చెందిన ఒపల్ సుచాత చౌసీ నిలిచారు.
ఈ పోటీల గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగింది.
మే 7వ తేదీన ప్రారంభమైన ఈ సందడి మే 31న తుది పోటీలతో ముగిసింది.
'బ్యూటీ విత్ ఏ పర్పజ్' నినాదంతో 'మిస్ వరల్డ్' పోటీలను 1951లో 'ది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్' మొదలుపెట్టింది.
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ గ్రాండ్ ఫినాలేకు వేదికైంది.
కాగా, భారత్‌కు చెందిన నందిని గుప్తా టాప్ 20 వరకు వచ్చారు కానీ విజేతగా కాలేకపోయారు.

రాయబారి కావాలని..
ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్న ఒపల్ సుచాత, ఏదో ఒకరోజు రాయబారి (అంబాసిడర్) కావాలని అనుకుంటున్నారని మిస్ వరల్డ్ వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. అలాగే, సైకాలజీ, ఆంత్రోపాలజీపై ఆమెకు మక్కువ.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న సంస్థలతో ఆమె కలిసి పనిచేశారు.
ఒపల్ 16 పిల్లులు, 5 కుక్కలను పెంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Opal Suchata/ FB
ఫైనల్ కంటెస్టెంట్లు వీరే..
ఫైనల్ రౌండ్‌కు చేరిన నలుగురు కంటెస్టెంట్లలో మిస్ థాయిలాండ్, మిస్ ఇథియోపియా, మిస్ మార్టినిక్, మిస్ పోలెండ్ నిలిచారు.
మిస్ థాయ్‌లాండ్ ఒపల్ సుచాత 'మిస్ వరల్డ్ 2025' కిరీటాన్ని దక్కించుకున్నారు.
మిస్ వరల్డ్ 2025 మొదటి రన్నరప్‌గా మిస్ ఇథియోపియా హస్సెట్ డెరిజీ నిలిచారు.
రెండో రన్నరప్‌గా మిస్ పోలెండ్ మాజా క్లాజా, మూడో రన్నరప్‌గా మిస్ మార్టినిక్ ఓరీలియా జోచెమ్ నిలిచారు.

ఫొటో సోర్స్, Miss World/fb
108 దేశాల నుంచి కంటెస్టెంట్లు..
భారత్‌కు చెందిన నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ 'మిస్ వరల్డ్' పోటీలకు హాజరయ్యారు.
ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు ఒక్కో ఖండం నుంచి పదేసి మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది)ని ఎంపిక చేశారు..
గత ఆదివారం మొదటి దశ క్వార్టర్స్ పోటీలు ముగిశాయి. ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశలో 5 గురిని (టాప్ 5) ఎంపిక చేశారు.
ఇలా ప్రతి ఖండం నుంచి ఎంపికైన 5 గురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2) ఎంపిక చేశారు. అంటే, అప్పుడు పోటీలో 8 మంది నిలిచారు. ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఎంపిక చేశారు.
శనివారం రాత్రి జరిగిన పోటీలలో చివరికి థాయిలాండ్ సుందరి ఒపల్ సుచాత చౌసీ విజేతగా నిలిచారు.

ఫొటో సోర్స్, Opal Suchata/ FB
పోటీలలో చివరి దశకు చెందిన నలుగురు కంటెస్టెంట్లను జ్యూరీ సభ్యులు నిర్దేశిత ప్రశ్నలు అడిగారు.
పోలాండ్‌కు చెందిన మాజా క్లాజాను నమ్రత శిరోద్కర్.. ఇథియోపియా కంటెస్టెంట్‌ను దగ్గుబాటి రాణా, మార్టినిక్ కంటెస్టెంట్‌ను మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్.. థాయిలాండ్ కంటెస్టెంట్‌ను సోనూ సూద్ ప్రశ్నలడిగారు.
ఆ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగా విజేతను నిర్ణయించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














