‘రోజూ 7000 అడుగులు నడిస్తే ఈ ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గినట్లే’

    • రచయిత, జోష్ ఎల్గిన్
    • హోదా, బీబీసీ న్యూస్

మెదడు శక్తి పెరగడానికి, రకరకాల వ్యాధుల నుంచి రక్షణ లభించడానికి రోజుకు 7,000 అడుగులు నడిస్తే సరిపోతుందని ఒక అధ్యయనం సూచిస్తోంది.

రోజుకు 10 వేల అడుగులు నడవడం అనే లక్ష్యంతో పోల్చితే 7 వేల అడుగులు నడవడం అనేది పెద్ద లక్ష్యం కాకపోవచ్చు.

క్యాన్సర్, గుండె జబ్బులు, మతిమరుపు వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంతో ఈ అడుగుల లెక్కకు సంబంధం ఉందని ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయన ఫలితాలు, ప్రజలు తాము రోజూ నడిచే అడుగులను ట్రాక్ చేసుకునేలా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేలా ప్రోత్సహిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

‘రోజుకు 10 వేల అడుగులు నడవాలని ముందు మనం అనుకునేవాళ్లం. కానీ ఈ భావనకు ఆధారాల్లేవు’ అని అధ్యయన రచయిత, డాక్టర్ మెలోడి డింగ్ అన్నారు.

1960లలో జపాన్‌లోని ఒక మార్కెటింగ్ ప్రచారం ద్వారా ఈ భావన పుట్టుకొచ్చినట్లుగా చెబుతారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పెడోమీటర్లను తయారు చేసే ఒక సంస్థ 'మాన్ఫె-కెయ్' అనే పెడోమీటర్‌ను తయారు చేసింది. దీనర్థం '10,000-స్టెప్ మీటర్'.

తర్వాత, ఇదే అనధికారిక గైడ్‌లైన్‌గా మారిపోయిందని.. ఫిట్‌నెస్ ట్రాకర్లు, యాప్స్ ఈ సంఖ్యనే సిఫార్సు చేయడం మొదలుపెట్టాయని డాక్టర్ డింగ్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 1,60,000 మందికి పైగా వయోజనుల ఆరోగ్యం, యాక్టివిటీకి సంబంధించిన గత పరిశోధనలు, డేటాను లాన్సెట్ స్టడీ విశ్లేషించింది.

రోజుకు 2,000 అడుగులు నడిచిన వారితో పోలిస్తే 7,000 అడుగులు నడిచినవారికి కొన్ని రకాల ప్రమాదం తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది.

7 వేల అడుగులు నడిచినవారిలో వ్యాధుల ముప్పు తగ్గుదల శాతాన్ని పైన ఉన్న చిత్రంలో చూడొచ్చు.

అయితే, కొన్ని గణాంకాలు ఇతర గణాంకాల కన్నా తక్కువ ఖచ్చితత్వమైనవి కావచ్చని, స్వల్ప సంఖ్యలో అధ్యయనాల నుంచి తీసుకున్నవి కావడమే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

మొత్తంమీద, రోజుకు కేవలం 2,000 అడుగులు నడిచేవారి కన్నా రోజుకు 4,000 అడుగులు నడిచేవారికి మెరుగైన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని వారి అధ్యయనం సూచిస్తోంది.

7,000 అడుగులు నడిస్తే చాలా ఆరోగ్య పరిస్థితులు, ప్రయోజనాలలో మార్పు కనిపిస్తుంది.. అంతకుమించి నడవడం వల్ల గుండెకు సంబంధించి అదనపు ప్రయోజనాలు ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.

అడుగులు లెక్కించడం కన్నా శారీరక శ్రమకు పెట్టే సమయంపైనే ఎక్కువ వ్యాయామ సూత్రాలు దృష్టి పెడతాయి.

ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న ప్రకారం.. వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాలు తేలికైన ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. లేదంటే 75 నిమిషాల పాటు కఠినమైన ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి.

ఈ సలహాను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టతరం కావచ్చు, కానీ ప్రస్తుత మార్గదర్శకాలు ఇప్పటికీ ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తున్నాయి అని డాక్టర్ డింగ్ అన్నారు

''ఈతకొట్టేవారు, సైకిల్ తొక్కేవారు, లేదా శారీరక వైకల్యం ఉన్నవారు నడవడానికి అంగీకరించకపోవచ్చు'' అని ఆమె చెప్పారు.

అయితే... ఈతకొట్టడం, సైకిల్ తొక్కడం వంటివాటికి నడవడం కూడా అదనంగా భావించాలని ఆమె సూచించారు.

రోజూ 10,000 అడుగులు నడవటం అవసరమనే వాదనను తాజా అధ్యయనం సవాల్ చేస్తుందని లండన్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీకి చెందిన ‘సెడెంటరీ బిహేవియర్ అండ్ హెల్త్’ ఎక్స్‌పర్ట్ డాక్టర్ డేనియల్ బెయిలీ చెప్పారు.

‘బాగా చురుగ్గా ఉండేవారికి 10,000 అడుగుల నడక సరైన లక్ష్యం అవుతుంది. మిగతావారికి 5,000 నుంచి 7,000 అడుగుల నడక అనేది మరింత వాస్తవికమైక, సాధించదగిన లక్ష్యం కావచ్చు’ అని బెయిలీ అన్నారు.

అడుగుల సంఖ్య ఎంతనేదీ ముఖ్యం కాదన్న వాదనను పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలోని క్లినికల్ ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ సీనియర్ లెక్చరల్ డాక్టర్ ఆండ్రూ స్కాట్ అంగీకరిస్తున్నారు.

‘ఎక్కువ ఉంటేనే ఎల్లప్పుడూ మంచిది'' అని చెబుతున్నారు. నిర్ణీత లక్ష్యం చేరుకోవడం గురించి ప్రజలు మరీ ఎక్కువగా, ముఖ్యంగా యాక్టివిటీకి అవకాశం తక్కువ ఉన్న రోజుల్లో ఆందోళన చెందకూడదు’ అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)